ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన ‘8వ జిల్లా కలెక్టర్ల సదస్సు’లో ఆయన మాట్లాడుతూ, ప్రజలందరికీ అన్నింటికంటే ముఖ్యమైంది నీటి సదుపాయమేనని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో నదుల అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేసి, ప్రతిష్టాత్మకంగా ‘వాటర్ గ్రిడ్’ను ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఎలాంటి నీటి సమస్య తలెత్తదని సీఎం కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు.
గతంలో తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇంకుడు గుంతల ఉద్యమం ఫలితాలు ఇప్పుడిప్పుడే క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయని, భూగర్భ జలాలు పెరుగుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వం కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించిందని, వాటిని సాధించేందుకు ఐఏఎస్ అధికారులు అత్యంత బాధ్యతగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు, లబ్ధి ప్రతి పేదవాడికి చేరేలా కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా అధికారులు బాధ్యత తీస్కోవాలని, నిర్దేశిత గడువులోగా లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం శ్రమించాలని ఈ సదస్సు వేదికగా ఆయన స్పష్టం చేశారు.














