ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం … మీరిలాగే ముందుకు పోవాలి జగన్!

0
3

వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి దగ్గర ఒక లక్షణం వుంది. తన మాటలని, తన చర్యలని వెనక్కి తీసుకోరు. కాలిపోతున్నా దానికే కట్టుబడి వుంటారు. దాన్ని కొంతమంది మంచి లక్షణం అంటారు. మరికొంతమంది మూర్ఖత్వం అని అంటారు. జగన్మోహనరెడ్డి అయిదేళ్ల అరాచక పాలన చూసి ప్రజలు ఆయనకు బుద్ది చెప్పేలాగా తీర్పు ఇచ్చారు కానీ ఆయన బుద్ధి మారలేదు. పొరపాట్లు ఎక్కడ జరిగాయనే ఆలోచన చెయ్యకుండా, తన విధానాలను సరిచేసుకోకుండా ముందుకుపోతున్నారు. ఘోర ఓటమి తరువాత కూడా ఆయన క్యాడర్ గంగమ్మ జాతరలో యాటలని నరికినట్టు నరుకుతాం అంటున్నారు. నాయకా నువ్వు చేసే విధ్వంసం కోసం చూస్తున్నాం అంటున్నారు.

జగన్మోహనరెడ్డి కూడా ఆ వ్యాఖ్యల్లో తప్పేంటని సమర్థిస్తున్నారు. విధ్వంసం కాదురా, వికాసం తీసుకొస్తామని చెప్పండని కార్యకర్తలని కోరడం లేదు. కార్యకర్తలు నువ్వు చేసే విధ్వంసం కోసం చూస్తున్నామంటుంటే, ఈయనేమో మీరు విధ్వంసం చెయ్యండి మీకు అండగా నేనున్నా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ డైలాగులు విని సామాన్య ప్రజలు భయంతో బిక్క చచ్చి పోతున్నారు. మొన్నటికి మొన్న గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఇప్పుడు కర్రలతో వస్తున్నాం, 29 తరువాత గొడ్డళ్లతో వస్తామని ప్రకటించారు. అంతకుముందు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇళ్లలోంచి లాక్కొచ్చి నరుకుతామన్నారు.

కుప్పంలో వైసిపి ఎమ్మెల్సీ భరత్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో వైసిపి కోసం చంపడానికైనా, చావడానికైనా సిద్ధంగా వుండాలని, అలాంటి అభ్యర్థులనే ఎంపిక చేస్తామని ప్రకటించారు. ఆయన వ్యాఖ్యలతో కార్యకర్తలు కేకలు అరుపులతో రెచ్చిపోయారు. రక్తాభిషేకం జరగాల్సిందే అని శపథం చేశారు. ఎవరి రక్తాన్ని ఎవరి కోసం అభిషేకిస్తారు భరత్ గారు? పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తూ సిగ్గు లేకుండా బజారు రౌడీలాగా మాట్లాడతాడా? మీరు ఏసీ కారుల్లో పోలీసు బందోబస్తుతో దర్జాగా తిరుగుతారు. సామాన్యకార్యకర్తలు మీ మాటలు విని రెచ్చిపోయి నరికడమో నరికించుకోడమో చేసి కాపురాలని గుల్ల చేసుకోవాలా? సిగ్గుండాలి ఇలాంటి కూతలు కుయ్యడానికి.

సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు ఇతని మీద పెట్టాలి ఉపా చట్టం కింద కేసు. పదే పదే నరుకుతాం, పొడుస్తాం, రక్తాభిషేకాలు చేస్తామని ప్రకటనలు చేస్తున్న నాయకులని ఎంకరేజ్ చేస్తున్న జగన్మోహనరెడ్డిని, ఆయన పార్టీని శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేస్తేనే ఆంధ్రప్రదేశ్ కు పట్టిన గ్రహణం వదులుతుంది. వీళ్లు ఇదే బాటలో నడుస్తుంటే ఇంకో పది జన్మలెత్తినా జగన్ సీఎం కాలేడు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇలాగే నడవాలని, ఇలాంటి ప్రకటనలే చెయ్యాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.