బొత్స కోటలో ప్రకంపనలు.. చీపురుపల్లిలో వైసీపీ ఖాళీ..!

0
3

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తిరుగులేని చక్రవర్తిగా వెలిగిన వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు ఆయన సొంత నియోజకవర్గమైన చీపురుపల్లిలో ఊహించని రాజకీయ సంక్షోభం ఎదురవుతోంది. ఒకప్పుడు జిల్లా రాజకీయాలను తన చేతులతో శాసించిన బొత్సకు, ఇప్పుడు సొంత గడ్డపైనే పట్టు పూర్తిగా చేజారిపోతోందా అనే అనుమానాలు ఆ పార్టీ కార్యకర్తల్లో బలపడుతున్నాయి. ఇటీవలే బొత్స సత్యనారాయణకు అత్యంత ఆప్తుడు, ఆయన మేనల్లుడు అయిన మజ్జి శ్రీనివాసరావు వైసీపీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు.

విజయనగరం జడ్పీ ఛైర్మన్‌గా, వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న చిన్న శ్రీను.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. ఉత్తరాంధ్రా వ్యాప్తంగా క్యాడర్‌ను నడిపించగల సామర్థ్యం ఉన్న చిన్న శ్రీను లాంటి బలమైన నేత టీడీపీలోకి వెళ్లడంతోనే జిల్లా వైసీపీ కుదేలైంది. ఆ దెబ్బ నుంచి కోలుకోకముందే, ఇప్పుడు బొత్స సొంత నియోజకవర్గ పరిధిలోని మెరకముడిదం మండలంలో మరో భారీ రాజీనామాల పర్వం తెరపైకి వచ్చింది.

మండల వైసీపీ అధ్యక్షుడు కోట్ల వెంకట్రావు ఆధ్వర్యంలో ఏకంగా 13 గ్రామాల కీలక నేతలు మూకుమ్మడిగా పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా చేసిన వారిలో 13 గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పలువురు కీలక కార్యకర్తలు ఉన్నారు. మేనల్లుడు చిన్న శ్రీను పార్టీ మారిన వెంటనే నియోజకవర్గంలో ఈ స్థాయి వలసలు జరగడం బొత్స నాయకత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ, ద్వితీయ శ్రేణి నాయకత్వం మొత్తం పక్క పార్టీల వైపు చూస్తుండటంతో చీపురుపల్లిలో వైసీపీ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. చిన్న శ్రీను బాటలోనే మెరకముడిదం మండల నేతలు కూడా నడవడంతో, రాబోయే రోజుల్లో విజయనగరం జిల్లాలో బొత్స రాజకీయ ప్రస్థానం ఏ మలుపు తిరుగుతుందోననే ఆసక్తికర చర్చ మొదలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.