కోట్లు సంపాదించినా.. ఊరిని మరచిపోలేదు..గిరిబాబు ఆఖరి కోరిక ఇదేనా?

0
8

ప్రముఖ సినీ నటుడు గిరిబాబు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం రావినూతలలో గ్రామస్థులు, అభిమానుల సమక్షంలో జరిగాయి. సాధారణంగా రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సినిమా ప్రముఖులు చనిపోతే వాళ్లుండే నగరాల్లోనే అంతిమసంస్కారాలు చేస్తుంటారు. వాళ్ల బంధుమిత్రులు, వాళ్ల సర్కిల్ అంతా నగరాల్లోనే వుంటుంది, అందరికీ కన్వీనెంట్ గా వుంటుంది కాబట్టి బంధువులు అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. అలాగే చాలా మందికి ఎదిగేకొద్ది జన్మభూమితో సంబంధాలు తెగిపోతుంటాయి. అది కూడా ఒక కారణం. కానీ గిరిబాబు మాత్రం తన స్వస్థలం రావినూతలలోనే తన అంత్యక్రియలు జరగాలని కోరుకున్నారు.

ఆయన కుమారుడు రఘుబాబు ఆ కోరికని నెరవేర్చారు. రావినూతల గ్రామస్థులు, ఆ పరిసర గ్రామాల్లో గిరిబాబుతో పరిచయం వున్నవాళ్లు, అభిమానులు, స్థానిక రాజకీయనాయకులు, నటుడు మోహన్ బాబు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆయన అంతిమయాత్రలో వయోభేదాలు లేకుండా గ్రామస్థులంతా పాల్గొన్నారు. గ్రామాల నుంచి మైగ్రేట్ అయి కోట్లు సంపాదించి సొంత వూళ్లని మరిచిపోయినవాళ్లున్న ఈ రోజుల్లో గిరిబాబు లాంటి వాళ్లు అరుదుగా వుంటారు. గిరిబాబు జన్మస్థలం రావినూతల ప్రకాశం జిల్లాలో ఒంగోలుకు 30 కిలోమీటర్ల దూరంలో చెన్నై, కొల్ కత్తా జాతీయరహదారి సమీపంలో వుంటుంది. ఆయన నటుడిగా ఎదుగుతున్న రోజుల్లోనే ముద్దు ముచ్చట అని ఒక సినిమా నిర్మించారు.

ఆ సినిమా షూటింగ్ మొత్తం రావినూతలలో, పక్కన దైవాలరావూరు గ్రామంలో జరిగింది. నటుడిగా ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత సంపాదించినా రూట్స్ మరచిపోలేదు. గ్రామస్థులతో అనుబంధాన్ని కొనసాగించారు. ఆ గ్రామస్థులు ఎవరైనా పనుల మీద మద్రాసు వెళ్లినా, ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక హైదరాబాద్ వెళ్లినా బాగా రిసీవ్ చేసుకునేవారని చెప్తుంటారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించడం, తను స్వయంగా ఇనీషియేట్ తీసుకోకపోయినా, పెద్దలకు సహకరించడం, ఏ కార్యక్రమం జరిగినా హాజరు కావడం జరుగుతుండేది. పరిశ్రమ మద్రాసులో వున్నప్పుడు, హైదరాబాద్ కు షిఫ్టయిన తరువాత కూడా షూటింగ్ లేనప్పుడు ఆయన కేరాఫ్ అడ్రస్ రావినూతలే.

ఆయన కుమారులు రఘుబాబు, బోసు బాబు ఇద్దరు హైదరాబాద్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సొంత ఊరికి వచ్చి తమ సన్నిహితులతో ఊరంతా తిరుగుతూ ఉంటారు. ఇప్పటికే ఊర్లో వారికి మంచి స్నేహితులు కూడా ఉన్నారని చెబుతూ ఉంటారు. వయోభారంతో గిరిబాబు ఊరుకు రాలేకపోయినా ఆయన కుమారులు ఇద్దరు ఊరుతో బంధాన్ని మాత్రం కొనసాగిస్తూ వచ్చారు. సాధారణంగా పాత తరం వాళ్లే ఊరుతో అనుబంధం కొనసాగిస్తారనే భావన ఉండేది. కానీ గిరిబాబు కుమారులు మాత్రం తండ్రి ప్రేమించిన ఊరిని ఇప్పటికి వదలక పోవడం అభినందించదగ్గ విషయమే. రావినూతలలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సహకరించారు.

సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ప్రతిసంవత్సరం జరుగుతాయి. ఈయన ప్రతి సంవత్సరం సంక్రాంతికి గ్రామంలో వుండిక్రికెట్ పోటీలని తిలకించేవారు. కొన్నిసార్లు సినిమా నటులతో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయించేవారు. జీవిత చరమాంకంలో కూడా స్వగ్రామంలో పాత స్నేహితులతో గడపడాన్ని ఇష్టపడేవారు. చుట్ట కాల్చడం ఆయనకు చాలా ఇష్టమని చెప్తుంటారు. అయితే వైద్యుల సలహా మేరకు కొన్ని సంవత్సరాల క్రితమే మానేశారట. పార్టీలకతీతంగా ఆయనకు స్నేహితులండేవారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఆ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున ప్రచారం చేశారు కూడా. చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు ప్రవేశపెట్టిన జన్మభూమి కార్యక్రమంలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు.

గ్రామంలో జన్మభూమి కమిటీ చైర్మన్ గా చేసి, సిమెంట్ రోడ్లు వేయించడానికి కృషి చేశారు. దేవాలయాల పునర్నిర్మాణానికి సహకరించారు. ఆ తరువాత కాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఏ పార్టీతో సంబంధాలు లేవని, న్యూట్రల్ గా వున్నారని గ్రామస్థులు చెప్తున్నారు. తను పుట్టి పెరిగిన వూరిలోనే గ్రామస్థుల సమక్షంలో తన అంత్యక్రియలు జరగాలనికోరుకోవడం జన్మస్థలం మీద ఆయనకున్న అభిమానానికి నిదర్శనం. హైదరాబాద్లో ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించడానికి ఆయనతో కలిసి పనిచేసిన కొంతమంది సినీరంగ ప్రముఖులకు తీరిక లేకపోతే, తిరుపతిలో ఉన్న మోహన్ బాబు గిరిబాబు స్వగ్రామానికి వచ్చి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించడం స్నేహానికి ఆయనిచ్చే విలువని తెలియచెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.