జగన్ మెప్పు కోసం బొత్సా కవరింగ్ పాలిటిక్స్..?

0
14

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన లౌక్యంతో, వివాదాలకు దూరంగా ఉండే నేతగా గుర్తింపు పొందిన వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా తన శైలిని మార్చుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విజయనగరం జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, ప్రత్యర్థులపై నిజంగానే కక్ష సాధించడానికి అన్నట్లు కాకుండా, తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్న కవరింగ్ పాలిటిక్స్‌లా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గత కొంతకాలంగా విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ పట్టు పూర్తిగా సడలిపోయిందనే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన ఘోర ఓటమి బొత్స నాయకత్వ సామర్థ్యంపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. దీనికి తోడు, జిల్లా రాజకీయాల్లో బొత్సకు కుడిభుజంగా ఉంటూ, పార్టీ వ్యవహారాలను చక్రం తిప్పిన చిన్న శ్రీను పార్టీ మారడం బొత్సకు కోలుకోలేని దెబ్బగా మారింది. చిన్న శ్రీను నిష్క్రమణ తర్వాత విజయనగరంలో బొత్స పని అయిపోయిందని, ఆయన ఇక కేవలం నామమాత్రపు నేతగా మిగిలిపోయారని సొంత పార్టీలోనే కాకుండా ప్రత్యర్థి వర్గాల్లోనూ పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపించాయి.

ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తుపై, జిల్లాపై తనకున్న పట్టుపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకే బొత్స ఇప్పుడు దూకుడు ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇకపై ఈక్వాలిటీ రాజకీయాలు పనికిరావు, కక్షపూరిత రాజకీయాలు చేస్తే చుక్కలు చూపిస్తాం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం తన బలహీనతను కప్పిపుచ్చుకునే ప్రయత్నమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తన పని ఇంకా అయిపోలేదని, జిల్లాలో తాను ఇంకా బలంగానే ఉన్నానని కేడర్‌కు మరియు ప్రత్యర్థులకు సంకేతాలు పంపడానికే ఆయన ఈ స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.

మరోవైపు, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద తన ప్రాధాన్యత తగ్గకుండా చూసుకోవడం కూడా ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. జగన్ వద్దని చెప్పినా తాను మాత్రం మారకూడదని ఫిక్సయ్యానని బొత్స చెప్పడం ద్వారా, తాను పార్టీ కోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నానని అధినేత మెప్పు పొందే ప్రయత్నం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి, స్థానిక ఓటములు, సన్నిహితుల నిష్క్రమణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బొత్స సత్యనారాయణ, తన రాజకీయ గ్రాఫ్ పడిపోకుండా కాపాడుకోవడానికి వేసిన తాజా ఎత్తుగడే ఈ దూకుడు ప్రసంగమని విజయనగరం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.