తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు, ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సొంతంగా ప్రాంతీయ పార్టీని స్థాపించి, ఒంటిచేత్తో ముందుకు నడిపిస్తున్న బీఆర్‌ఎస్ మాజీ నేత కవిత.. ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు కోసం ఆధ్యాత్మిక, జ్యోతిష్య మార్గాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో నటుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ విజయభేరి వెనుక కీలక పాత్ర పోషించిన ప్రముఖ జ్యోతిష్యుడు రాధాన్ పండిట్‌ను ఆమె ఆశ్రయించడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి విజయ్‌కు జ్యోతిష్య సూచనలు, గ్రహగతుల సలహాలు అందించి ఆయన సీఎం పీఠాన్ని దక్కించుకోవడంలో రాధాన్ పండిట్ కీలక పాత్ర పోషించారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే కవిత తన కుమారుడు మరియు కొంతమంది ముఖ్య అనుచరులతో కలిసి ప్రత్యేకంగా రాధాన్ పండిట్‌ను కలిసినట్లు విశ్వసనీయ సమాచారం. తన నూతన పార్టీ భవిష్యత్తుకు బలమైన మార్గం చూపాలని, గ్రహ అనుకూలత కోసం ఎలాంటి పరిహారాలు చేయాలో సూచించాలని ఆమె వేడుకున్నట్లు తెలుస్తోంది.
కవిత కొత్త పార్టీని స్థాపించి దాదాపు ఐదు నెలలు కావస్తున్నా.. ఆశించిన స్థాయిలో రాజకీయ ఊపు రాకపోవడమే ఈ ఆధ్యాత్మిక శరణుకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజల నుండి కొంత మేర స్పందన వస్తున్నప్పటికీ, రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ నేతలు లేదా కీలక లీడర్లు ఎవరూ కూడా కవిత పార్టీ వైపు చూడటం లేదు. దీంతో రాజకీయంగా ఒంటి చేత్తో పార్టీని, క్యాడర్‌ను నెట్టుకురావడం కవితకు రోజురోజుకూ కష్టంగా మారుతోంది.
దీనికి తోడు పార్టీని నడపడానికి ఆశించిన స్థాయిలో విరాళాలు రాకపోవడం, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో క్యాంపెయిన్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోతున్నారు. రాజకీయంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా బ్రేక్ రాకపోవడంతో, చివరకు జ్యోతిష్యాన్నే నమ్ముకుని తమిళనాడు సీఎం ఫార్ములాను ఇక్కడ వర్కవుట్ చేయాలని కవిత భావిస్తున్నారు. విజయ్‌కు సీఎం యోగాన్ని తెచ్చిపెట్టిన రాధాన్ పండిట్ హస్తవాసి.. ఇప్పుడు తెలంగాణలో కవిత పార్టీకి ఎంతవరకు కలిసొస్తుందో, ఆమె రాజకీయ భవిష్యత్తును ఎలా మార్చబోతుందో వేచి చూడాలి.






