ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మరింత బలోపేతం చేస్తూ ప్రముఖ ప్రాంతీయ విమానయాన సంస్థ ఫ్లై-91 సరికొత్త సర్వీసును ప్రారంభించింది. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మరియు తిరుపతి ఎయిర్‌పోర్టుల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించేలా ఈ ప్రత్యేక విమాన సర్వీసులు నేటి నుండి అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు, అత్యవసర పనులపై ప్రయాణించే వ్యాపారవేత్తలు, సాధారణ ప్రయాణికులకు కేవలం 1 గంట 10 నిమిషాల వ్యవధిలోనే గమ్యస్థానాలకు చేర్చే ఈ సర్వీస్ ఎంతగానో ఉపయోగపడనుంది.
ఈ నూతన విమాన సర్వీస్ వారంలో నాలుగు రోజుల పాటు, అంటే ప్రతి మంగళవారం, గురువారం, శనివారం, మరియు ఆదివారాల్లో ప్రయాణికులకు సేవలు అందించనుంది. సమయాల వివరాలను పరిశీలిస్తే.. ఈ విమానం ఉదయం 8:05 గంటలకు తిరుపతిలో బయలుదేరి, ఉదయం 9:15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి అదే రోజు ఉదయం 9:45 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి, ఉదయం 10:50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. కనెక్టివిటీ పరంగా ఈ రూట్ అందుబాటులోకి రావడం వల్ల రాయలసీమ మరియు కోస్తాంధ్ర ప్రాంతాల మధ్య వాణిజ్య, పర్యాటక రంగాలు మరింత వేగంగా వృద్ధి చెందుతాయని రక్షణ మరియు విమానయాన రంగానికి చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు.














