మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు మరింత బిగిస్తోంది. ఈ కేసులో అసలు నేరస్థులతో పాటు, హత్యానంతరం నడిచిన భారీ ఆర్థిక లావాదేవీలపై కన్నేసిన ఈడీ.. దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈ కేసులో అత్యంత కీలకమైన ఏ2 నిందితుడు సునీల్ యాదవ్‌ను ఈడీ నీడలా వెంటాడుతోంది. తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేస్తూ విచారణకు హాజరుకావాలని ఆదేశించడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
ఈడీ జారీ చేసిన తాజా నోటీసుల ప్రకారం.. ఈ నెల 24వ తేదీన ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సునీల్ యాదవ్‌ను అధికారులు ఆదేశించారు. కేవలం వ్యక్తిగతంగా రావడం మాత్రమే కాదు, తనతో పాటు తన కుటుంబ సభ్యుల పూర్తి ఆస్తుల వివరాలు, వారి బ్యాంకు ఖాతాల రికార్డులను కూడా విధిగా వెంట తీసుకురావాలని ఈడీ షరతు విధించింది. ఈ ఘటన వెనుక చేతులు మారిన సుపారీ సొమ్ము, మనీలాండరింగ్ కోణాన్ని వెలికితీయడమే లక్ష్యంగా ఈడీ ఈ సారి పక్కా స్కెచ్‌తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ముందు, ఆ తర్వాత నిందితుల అకౌంట్లలోకి ఎక్కడి నుండి నిధులు వచ్చాయి..? ఈ హత్య కోసం ఎవరెవరు ఆర్థికంగా సహాయం అందించారు..? అనే కీలక అంశాలపై సునీల్ యాదవ్‌ను అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరిని ఈడీ అధికారులు నిశితంగా విచారించి, కొన్ని కీలకమైన స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. దస్తగిరి ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఇప్పుడు ఏ2 సునీల్ యాదవ్‌కు నోటీసులు ఇచ్చి పట్టుబిగిస్తున్నట్లు సమాచారం. ఈ తాజా పరిణామం వివేకా కేసులో మరికొందరు పెద్ద తలకాయల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది.














