విజయవాడ శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులు చేసిన డీఎస్సీ ధర్నా రచ్చ చూసి, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడికి పోతున్నాయో అని సామాన్యుడు కంగారుపడిపోయాడు. ప్రభుత్వ ఆఫీసును ముట్టడించి, పోలీసులతోనే డీ కొట్టి, టీచర్లను కొట్టి అక్కడ చేసిన రోత అంతా ఇంతా కాదు. ఈ హడావుడి చూసి మన ఖాకీ బాస్ లు, కూటమి పెద్దలు పెట్టిన రంకెలు అన్నీ ఇన్నీ కావు. “51 మందిపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తాం.. తోకలు కత్తిరిస్తాం.. జైల్లో చిప్పకూడు తినిపిస్తాం” అంటూ మైకులు పగిలిపోయేలా బిల్డప్ ఇచ్చారు.
తీరా సీన్ కట్ చేస్తే.. మాచవరం పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టిన 30 మంది నిందితుల్లో ఏకంగా 28 మందికి 24 గంటలు తిరగకముందే కోర్టు దర్జాగా బెయిల్ ఇచ్చేసింది. కేవలం ఇద్దరిని మాత్రమే రిమాండ్ కు పంపారు. భలే ఉంది కదూ మన సిస్టమ్.. అంత రచ్చ చేసినా తెల్లారేసరికి బెయిల్ పట్టుకుని ఇంటికి వచ్చేస్తుంటే, ఇక ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అంటే భయం ఎవరికి ఉంటుంది చెప్పండి..? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే “ఇకపై తప్పు చేస్తే ఉక్కుపాదం.. చట్టం అంటే వణుకు పుట్టాలి” అంటూ పవర్‌ఫుల్ డైలాగులు చెప్పారు.
కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే మాత్రం అంతా రివర్స్ లో ఉంది. రౌడీయిజం చేసిన వాళ్లు కూడా బెయిల్‌పై బయట తిరుగుతూ కాలర్ ఎగరేస్తుంటే, కూటమి సర్కార్ మాత్రం ఇంకా ప్రెస్ మీట్లలో హెచ్చరికల స్క్రిప్టులు చదువుకుంటూనే కాలక్షేపం చేస్తోంది. పోలీసులు కోర్టులో కేసును అంత ‘బలంగా’ వాదించారా..? లేక నిందితులపై కేసులు పెట్టేటప్పుడు సెక్షన్లు రాయడం మరిచిపోయారా..? అనే అనుమానాలు వస్తున్నాయి. ఇలాంటి తుస్సు అడ్మినిస్ట్రేషన్ పెట్టుకుని, తప్పు చేసే వాళ్లకు భయం పుట్టిస్తాం అని చెప్పడం పెద్ద జోక్ లా ఉందని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు కార్యకర్తలు.
ఒకవైపు 51 మందిపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని విజయవాడ సీపీ భీకర ప్రతిజ్ఞలు చేస్తుంటే.. మరోవైపు కోర్టులో మాత్రం పోలీసులు పట్టుకొచ్చిన నిందితులకు చకచకా బెయిళ్లు వచ్చేస్తున్నాయి. అంటే పోలీసుల దర్యాప్తు కేవలం ప్రెస్ నోట్లకే పరిమితమా..? లేక పక్కా ఆధారాలు లేకుండానే కేవలం టీవీల్లో చూపించుకోవడానికి అరెస్టుల డ్రామాలు ఆడారా..? ఒకవేళ నిందితులు నిజంగానే అంత పెద్ద నేరం చేస్తే, కనీసం రిమాండ్‌కు పంపేంత సీన్ కూడా పోలీసులు కోర్టులో ఎందుకు క్రియేట్ చేయలేకపోయారు..? ఇవన్నీ చూస్తుంటే.. కూటమి ప్రభుత్వం కేవలం సోషల్ మీడియాలో, ప్రెస్ మీట్లలో మాత్రమే ‘సింహం’ లా గర్జిస్తోందని, క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తిగా చేతులెత్తేసిందని అర్థమవుతోంది. ఈ అరెస్టులు, వెంటనే వచ్చే బెయిళ్లు చూస్తుంటే.. ఇదంతా కేవలం జనాన్ని నమ్మించడానికి ఆడుతున్న ఒక పొలిటికల్ ఐవాష్ డ్రామాలాగా అనిపిస్తోంది.






