ఇన్‌ఫ్లుయెన్సర్లకు నెలకు రూ.1.50 లక్షలు! పేపర్లు, టీవీలను దాటుతున్న డిజిటల్ ప్రభావం!

0
4

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజలకు తెలియచెప్పేందుకు ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ల ఎంప్యానెల్మెంట్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ద్వారా ఫేస్ బుక్, ఇన్ స్టా, యూట్యూబ్, ట్విటర్ లలో కంటెంట్ క్రియేటర్ల ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేయిస్తారు. దీనికి కోసం డిజిటల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు ప్రభుత్వం దగ్గర ఎంప్యానెల్ చేయించుకోవాలి. మొదట ఏడాది పాటు ఒప్పందం చేసుకుని, ఆ తరువాత పనితీరు ఆధారంగా ఇంకో రెండేళ్లు పొడిగిస్తారు.

ఇన్ ఫ్లుయెన్సర్లకున్న ఫాలోయర్ల సంఖ్యని బట్టి నాలుగు క్యాటగిరీలుగా విభజిస్తారు. లక్షకు పైగా ఫాలోయర్లుంటే ఏ కేటగిరి, 50 వేల నుంచి లక్ష లోపు ఫాలోయర్లుంటే బి కేటగిరి, 25 వేల నుంచి 50 వేల లోపుంటే సికేటగిరి, 25 వేల లోపు వుంటే డి కేటగిరిగా గుర్తిస్తారు. కంటెంట్ ని అన్ని సోషల్మీడియా ప్లాట్ ఫామ్స్ లో పోస్టు చచెయ్యాలి. అత్యధిక రీచ్ వున్న ప్లాట్ ఫాంకి నగదు చెల్లిస్తారు. ఒక క్రియేటర్ కు నెలకు చెల్లించే గరిష్ట పారితోషికం పరిమితి 1 లక్షా 50 వేలు. ప్రభుత్వం ఇచ్చే గ్రాఫిక్స్ పోస్టింగులకు కేటగిరి ఏ వాళ్లకు 1500, బి వాళ్లకు వెయ్యి, సి కేటగిరికి 750, డి కేటగిరికి 500 చొప్పున చెల్లిస్తారరు. ఆడియో, వీడియో పోస్టింగులకు కేటగిరి ఏకి 2 వేలు, బికి 1500, సికి వెయ్యి, డి కి 750 చొప్పున చెల్లిస్తారు.

క్రియేటర్స్ సొంతంగా వీడియోలు చేస్తే ఒక్కో వీడియోకు కేటగిరి ఏలో 15000, బిలో 7,500, సిలో 5,000, డిలో 2,500 చెల్లిస్తారు. ఎంప్యానెల్మెంట్ కు ఇన్ ఫ్లుయెన్సర్లు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. ఒక నెలకు లక్షా 50 వేలకు మించకుండా ఈ చెల్లింపులుంటాయి. ఇన్ ఫ్లుయెన్సర్లు అశ్లీల వీడియోలు, విద్వేషపూరిత వ్యాఖ్యలతో వీడియోలు చేసి వుంటే వాళ్లకు అవకాశం ఇవ్వరు. వారానికి రెండు పోస్టుల చొప్పున గత ఆరు నెలల్లో 48 కి పైగా పోస్టులు చేసి వుండాలి. ప్రభుత్వానికి సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ వీడియోలని ఉచితంగా వెయ్యాలి. స్థూలంగా ఇదీ పాలసీకి సంబంధించిన సమాచారం.

అయితే దీని మీద కొంతమంది అభ్యంతరాలు, విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగా లేనప్పుడు ఇలాంటివి అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. అందులో తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడావున్నారు. ఇది కొత్తగా ఏపీ ప్రభుత్వం తెచ్చిన పాలసీ కాదు. కొన్ని రాష్ట్రాల్లో ఈ పాలసీ అమలవుతోంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, గోవా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పాలసీని అమలు చేస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తరువాత ప్రభుత్వం ఈ పాలసీని తీసుకొచ్చింది. హిమాచల్ ప్రదేశ్ లో గరిష్టంగా నెలకు 2 లక్షలు, ఉత్తరప్రదేశ్ లో నెలకు 3 లక్షల నుంచి 8 లక్షల వరకు చెల్లిస్తున్నారు. పంజాబ్ లో వ్యూస్ నిబట్టి చెల్లింపులు చేస్తున్నారు.

ఆ రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ఇచ్చేది తక్కువే. ఇదేమీ తప్పు కాదు. ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోయినా, ఉచితాలు, పథకాలు ఇస్తూనే వున్నారు. వాటి గురించి ప్రచారం చేసుకోడానికి బడ్జెట్ కేటాయిస్తే తప్పేముంది? పైగా అది పార్టీ ప్రచారానికి కాదు, ప్రభుత్వ పథకాల ప్రచారానికి కేటాయించిన బడ్జెట్. ఒక వైపు చేసిన మంచి గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారని చెప్పేది వీళ్లే. ఎంతసేపు చంద్రబాబు తను చేసింది చెప్పుకోవడమే మనకి కనిపిస్తుంది. పార్టీ నేతల కంటే చంద్రబాబే ఎక్కువగా చెప్తారు. తన ప్రభుత్వం చేసింది తను చెప్పే కంటే, న్యూట్రల్స్ సైడ్ నుంచి చెప్తే, అది ప్రజల్లోకి బలంగా వెళ్తుంది.

ప్రభుత్వ పథకాల ప్రచారానికి డిజిటల్ కార్పొరేషన్ వుంది. అందులో ఉద్యోగులున్నారు. వాళ్లకి జీతభత్యాలిస్తున్నారు. అది తప్పు కానప్పుడు ఇది తప్పెలా అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వం ప్రకటనల రూపంలో పేపర్లకు, టీవీ చానళ్లకు ఏడాదికి వందల కోట్ల బడ్జెట్ కేటాయిస్తుంది. పెద్ద పత్రికల్లో ఒక ఫుల్ పేజీ కలర్ యాడ్ వేస్తే 50 నుంచి 60 లక్షలవుతుంది. రెండు మూడు పేపర్లకిస్తే కోటిన్నర నుంచి రెండు కోట్లు. అదీ ఒకసారి వేస్తేనే.ఆ కోటి వీళ్లకు నెల మొత్తం బడ్జెట్ కు సరిపోతుంది. తెలుగు ఇంగ్లీష్ పేపర్లలో ఇలాంటి ఫుల్ పేజీ యాడ్ లు నెలకు రెండు మూడుసార్లుంటాయి.

టీవీ ఛానళ్ల యాడ్స్ కూడా ఖరీదే. పేపర్లో వచ్చినవార్త కానీ, యాడ్ కానీ రోజు మారితే ఎవరూ చూడరు. న్యూస్ చానళ్లకి కూడా వ్యూయర్షిప్ తగ్గుతోంది. రోజు రోజుకు డిజిటల్ మీడియా ప్రభావం పెరిగిపోతోంది. చదువురాని వాళ్లు, గొడ్లు కాసుకునే వాళ్లు కూడా అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నారు.ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా డిజిటల్ ప్రభావం పెరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి పెట్టే ఖర్చు తక్కువ. పేపర్లు, టీవీ ప్రకటనలకు వచ్చే రీచ్ కంటే దీనికొచ్చే రీచ్ ఎక్కువుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.