మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ దర్యాప్తును ముమ్మరం చేయడం ఆసక్తిని రేపుతోంది. ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్‌ను ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని తమ ప్రాంతీయ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించారు. హత్యకు ముందు, ఆ తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలతో పాటు, వివేకాను అంతమొందించడానికి చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్న రూ.40 కోట్ల నిధుల సమీకరణ, రూటింగ్ పై అధికారులు సుదీర్ఘంగా విచారించారు.
సునీల్ యాదవ్ తన కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాల వివరాలను ఈడీకి సమర్పించడంతో ఈ కోట్ల రూపాయల హవాలా నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు లింకులు బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విచారణ అంతా కేవలం సునీల్ యాదవ్ వంటి కింది స్థాయి నిందితుల చుట్టూనే ఎంతకాలం తిరుగుతుందనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒక మాజీ మంత్రిని అత్యంత దారుణంగా నరికి చంపేందుకు రూ.40 కోట్ల లాంటి భారీ మొత్తాన్ని సాదాసీదా వ్యక్తులు సమకూర్చడం అసాధ్యమనేది బహిరంగ రహస్యం.
ఈ కోట్ల రూపాయల నిధులను వెనుక నుండి నడిపించిన ఆ రాజకీయ ‘పెద్ద తలకాయలు’ ఎవరు..? ఆ నిధులను అంత ఈజీగా రూటింగ్ చేయగలిగినంత పవర్‌ఫుల్ శక్తులు ఈ కేసులో ఎక్కడున్నాయి..? అనే కోణంలో అసలు నిజాన్ని ఈడీ ఎప్పుడు బయటకు తీస్తుందనే ఉత్కంఠ నెలకొంది. హత్యకు స్కెచ్ వేసిన ప్రణాళికను, దానికి వాడిన మనీ రూట్‌ను అంగుళం అంగుళం జల్లెడ పడుతున్న ఈడీ.. ఈ ఆర్థిక మూలాల ఆధారంగా అసలు సూత్రధారులైన ఆ పెద్ద తలకాయల ముంగిట ఎప్పుడు నిలబడుతుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
కేవలం బ్యాంక్ స్టేట్‌మెంట్లు, అకౌంట్ల పరిశీలనలకే పరిమితం కాకుండా, ఈ కోట్ల రూపాయల వెనుక ఉన్న అసలు పొలిటికల్ బాస్ ల వైపు ఈడీ తన తదుపరి అడుగులు ఎప్పుడు వేయబోతోందో చూడాలి. సునీల్ యాదవ్ ఇచ్చిన కీలక సమాచారం మరియు నిధుల లావాదేవీల పత్రాల ఆధారంగా రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లోని కొందరు అగ్రనేతలకు ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది.














