భారత ఎన్నికల సంఘం చుట్టూ ముసురుకున్న వివాదాలు దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై.. తోటి ఎలక్షన్ కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తిరుగుబాటు జెండా ఎగరేశారనే వార్తలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజ్యాంగబద్ధమైన ఈ అత్యున్నత సంస్థలో గత 10 నెలల్లోనే ఏకంగా 14 సార్లు సీఈసీ నిర్ణయాలను తోటి కమిషనర్లు రికార్డు పూర్వకంగా వ్యతిరేకించారని, చాలా విషయాల్లో తమను చీకట్లోనే ఉంచారని వారు ఆరోపించడం ఈ వివాదాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది.
ప్రస్తుతం ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియే ఈ మొత్తం రచ్చకు ప్రధాన కారణమైంది. కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ‘ఫామ్-6’లో చేసిన కొన్ని మార్పులు పూర్తిగా “చట్టవిరుద్ధం, అనధికారికం” అని ఎలక్షన్ కమిషనర్ సంధూ ఆగస్టులోనే ఫైల్‌పై నోట్ రాశారు. ఈ నిబంధనల మార్పు వల్ల సాధారణ ఓటర్లలో అనవసర భయాందోళనలు రేగుతున్నాయని మాజీ సీఈసీలు కూడా తప్పుబడుతున్నారు. అయితే తోటి కమిషనర్ల అభ్యంతరాలను, నిబంధనలను పక్కనబెట్టి సీఈసీ ఏకపక్షంగా ముందుకు వెళ్లడం విపక్షాలకు బలమైన అస్త్రంగా మారింది.
ఈ అంతర్గత విభేదాల కథనాలు బయటకు రావడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా ‘INDIA’ కూటమి నేతలు సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈసీని వాడుకుని అధికార బీజేపీ ఓట్ల దొంగతనానికి, మేనిప్యులేషన్‌కు పాల్పడుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సీఈసీపై పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు నోటీసులు సిద్ధం చేస్తుండగా, యువజన ఒత్తిడి బృందాలు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలకు పిలుపునిచ్చాయి. మరోవైపు బీజేపీ ఈ ఆరోపణలను కొట్టిపారేస్తూ.. తాము వ్యవస్థలను కాపాడుతున్నామని, కాంగ్రెస్ అనవసర రాజకీయం చేస్తోందని కౌంటర్ ఇస్తోంది. ఏది ఏమైనా, వచ్చే ఏడాది జరగబోయే కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.














