తాడేపల్లి చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు వివేకా హత్య, మద్యం స్కామ్ లూప్‌లో జగన్ అరెస్ట్ తప్పదా..?

0
5

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ఊహించని భారీ పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా..? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ చట్టపరమైన ఉచ్చు వేగంగా బిగుస్తోందా..? అంటే అవుననే సమాధానాలు రాజకీయ వర్గాల నుండి బలంగా వినిపిస్తున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సంచలన మద్యం కుంభకోణం, అలాగే ఇన్నేళ్లుగా సాగుతోన్న వైఎస్ జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.. ఈ రెండు వ్యవహారాలు ఇప్పుడు నేరుగా తాడేపల్లి ప్యాలెస్ వైపే వేలెత్తి చూపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ రెండు కేసుల్లో దర్యాప్తు సంస్థల స్పీడ్ చూస్తుంటే, వచ్చే ఏడాది లోపు జగన్‌ను చట్టపరంగా అదుపులోకి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని టాక్ నడుస్తోంది.

ఇటీవలే నాటి ఎక్సైజ్, రెవెన్యూ శాఖల స్పెషల్ సిఎస్ రజత్ భార్గవ కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట ఇచ్చిన 164 సంచలన వాంగ్మూలం జగన్ కోటరీని వణకిస్తోంది. మద్యం అక్రమాల దందానంతా సీఎంవోలోని కీలక అధికారులైన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలే ఒత్తిడి తెచ్చి నడిపించారని, నాటి సీఎం జగన్‌కు తెలియకుండా ఇదంతా జరిగిందని తాను అనుకోవడం లేదని ఆయన స్పష్టంగా కోర్టుకు తెలిపారు. దీనికి తోడు, ఇటీవల మరో మాజీ ఓఎస్డీ సత్య ప్రసాద్ కూడా దర్యాప్తు సంస్థల ముందు ఇదే తరహా విషయాలను బయటపెట్టడం గమనార్హం. ఐఏఎస్ అధికారులు, కీలక అధికారులు నేరుగా సీఎంవో వైపే వేలు చూపిస్తుండటంతో మద్యం స్కామ్‌లో జగన్ ఏ క్షణమైనా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.

మరోవైపు, ఇన్నాళ్లూ సాగుతోన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సైతం అనూహ్య మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో రెండవ నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ ఇటీవల చేసిన కొన్ని సంచలన ప్రకటనలు ప్యాలెస్ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. వివేకా హత్యతో లబ్ది పొందింది అవినాష్ రెడ్డి, భారతి, జగన్ అంటూ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో అతను సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈ హత్య వెనుక ఉన్న కీలక సూత్రధారులు, తాడేపల్లి నుండి నడిచిన ఆపరేషన్ గురించిన అంతర్గత విషయాలు ఇప్పుడు దర్యాప్తు సంస్థల డైరీలోకి చేరినట్లు ప్రచారం జరుగుతోంది. రెండు వైపుల నుండి ఆధారాలు పక్కాగా లభిస్తుండటంతో దర్యాప్తు సంస్థలు క్లైమాక్స్ దిశగా అడుగులు వేస్తున్నాయి.

ఈ సమయంలో రాష్ట్రంలో మళ్లీ పుంజుకునేందుకు, ప్రజా మద్దతు కూడగట్టేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్లు పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. అయితే, తాజా పొలిటికల్ టాక్ ప్రకారం.. ఈ రెండు ప్రధాన కేసుల్లో రాబోయే రోజుల్లో ఊహించని పరిణామాలు ఎదురైతే, పక్కా ఆధారాలు దొరికితే, వచ్చే ఏడాది లోపు ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే జగన్ పాదయాత్ర చేయడం కూడా దాదాపు అసాధ్యంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా, తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా సాగిన వ్యూహాలు ఇప్పుడు జగన్ రాజకీయ భవిష్యత్తును తీవ్ర ఇరకాటంలోకి నెట్టేలా కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.