మీ ట్రాప్ లో పడం, వైసీపీకి సుప్రీం షాక్..!

0
8

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో నామినేషన్ల దాఖలుకు గడువును మరింత పెంచాలని, అప్పటివరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మంగళవారం పూర్తిగా ముగించింది. ఎన్నికలను ఎలాగైనా వాయిదా వేయించాలనే వ్యూహంతోనే ఈ పిటిషన్ దాఖలు చేశారని అభిప్రాయపడ్డ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. “ఎన్నికలు వాయిదా వేయాలనే మీ ట్రాప్‌లో మేము పడబోము” అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ అభ్యర్థనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.

ఈ విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన వాదనలను బలంగా వినిపించింది. స్థానిక ఎన్నికల పారదర్శకతకు సంబంధించి గత విచారణల సందర్భంగా సుప్రీంకోర్టు జారీ చేసిన ప్రతి ఒక్క ఆదేశాన్ని, నిబంధనలను క్షేత్రస్థాయిలో అక్షరాలా పాటించామని ధర్మాసనానికి స్పష్టం చేసింది. నామినేషన్ల ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారమే సక్రమంగా జరిగిందని నివేదించింది.

ఎస్ఈసీ వాదనలతో ఏకీభవించిన సీజేఐ ధర్మాసనం.. ఇప్పటికే నామినేషన్ల దాఖలుకు సంబంధించిన అధికారిక సమయం ముగిసిపోయినందున, ఇకపై ఎలాంటి గడువు పెంపు ఉండబోదని తేల్చిచెప్పింది. “సమయం ముగిసింది.. ఇక వెళ్ళి ఎన్నికల్లో పోటీ చేయండి” అని స్పష్టం చేస్తూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ తీర్పుతో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక పోరుకు చట్టపరంగా ఉన్న అన్ని అడ్డంకులు పూర్తిగా తొలగిపోయినట్లయింది. న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం మిగిలిన స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లను మరింత ముమ్మరం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.