ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత చిత్రవిచిత్రమైన సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీలో ఒక అభ్యర్థి చేసిన వింత వేడుకోలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. “రూ.10 లక్షలు వడ్డీకి తెచ్చి మరీ ఓటర్లకు పంచాను.. డబ్బులు తీసుకుని కూడా నాకు ఓటు వేయని వారు దయచేసి నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయండి” అంటూ పలమనేరు 32వ వార్డు అభ్యర్థి ప్రసాద్‌రెడ్డి బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేయడం స్థానికంగా పెద్ద దుమారాన్నే రేపింది.
ఎన్నికల ప్రచార సమయంలో గెలుపు కోసం అభ్యర్థులు భారీగా ఖర్చు చేయడం సర్వసాధారణం. అయితే, పలమనేరు 32వ వార్డులో పోటీ చేసిన ప్రసాద్ రెడ్డి మాత్రం ఫలితాలు వచ్చాక ఓటమిని తట్టుకోలేకపోయారు. ఓటర్లను నమ్మి దాదాపు 10 లక్షల రూపాయల వరకు వడ్డీలకు తెచ్చి మరి పంచానని, తీరా చూస్తే ఓట్ల లెక్కింపులో తనకు ఘోర పరాభవం ఎదురైందని ఆయన వాపోయారు. డబ్బులు తీసుకుని కూడా తనకు ఓటు వేయకుండా మోసం చేసిన వారు మానవతా దృక్పథంతో ఆలోచించి, తన డబ్బును తనకు ఇచ్చేయాలని ఆయన కోరడం విశేషం.
ఓటు కోసం ఓటర్లకు బహిరంగంగానే డబ్బులు పంచానంటూ అభ్యర్థి స్వయంగా వ్యాఖ్యానించిన వీడియోలు, వార్తలు బయటకు రావడంతో స్థానికంగా దీనిపై తీవ్ర చర్చ నడుస్తోంది. అటు సోషల్ మీడియాలోనూ నెటిజన్లు దీనిపై ఒక రేంజ్‌లో కౌంటర్లు, మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు. “ఓటు కోసం చేసిన ఖర్చును కూడా వెనక్కి అడిగే పరిస్థితి వచ్చిందా బాబోయ్” అంటూ కామెంట్లు పెడుతున్నారు. వ్యాపారంలో నష్టపోతే వెనక్కి అడిగినట్లు, ఎన్నికల్లో ఓడిపోతే ఓటర్లను డబ్బులు అడగడం ఏంటని కొందరు నవ్వుకుంటుంటే.. మరికొందరు మాత్రం రాజకీయాల్లో డబ్బు సంస్కృతి ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి ఇదొక నిదర్శనమని విమర్శిస్తున్నారు.














