ఈ మధ్యకాలంలో 40 లేదా 50 ఏళ్లు దాటిన తర్వాత ఫిట్నెస్ కోసం రన్నింగ్ ప్రారంభించే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే, 25 ఏళ్ల వయసులో స్పందించినట్లుగా 45 ఏళ్ల వయసులో మన శరీరం స్పందించదని, కాబట్టి సెలబ్రిటీలను చూసి తొందరపడి పరిగెత్తడం సరికాదని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సునీల్ దాచేపల్లి హెచ్చరించారు. మధ్య వయసులో రన్నింగ్ ప్రారంభించే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయి వాస్తవాలు ఒకసారి చూద్దాం.
40 ఏళ్లు దాటిన తర్వాత కండరాల పరిమాణం తగ్గడం ప్రారంభమవుతుంది. అలాగే కండరాలను, ఎముకలను బంధించే టెండన్లు, లిగమెంట్లు తమ స్థితిస్థాపకతను కోల్పోయి కాస్త గట్టిపడతాయి. దీనివల్ల 30 ఏళ్ల వయసులో రన్నింగ్ చేసిన మరుసటి రోజే శరీరం యాక్టివ్‌గా మారితే, 45 ఏళ్ల వయసులో కోలుకోవడానికి రెండు మూడు రోజులు పడుతుంది. ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం వల్ల ఎముకల సాంద్రత కూడా తగ్గుతుంది. చాలా ఏళ్లుగా ఎలాంటి వ్యాయామం చేయని వారు, గుండె లేదా బీపీ సమస్యలు ఉన్నవారు రన్నింగ్ మొదలుపెట్టే ముందు ఈసీజీ, బ్లడ్ టెస్టులు చేయించుకోవడం అవసరం.
భారతీయులలో విటమిన్ డి లోపం చాలా ఎక్కువ. ఇది ఎముకల బలాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి రన్నింగ్ కంటే ముందే వీటిని సరిచూసుకోవాలి. మీ బరువు, మీ పాదం ఆకృతికి సరిపోయే రన్నింగ్ షూస్‌ను మాత్రమే ఎంచుకోవాలి. మొదట్లోనే కిలోమీటర్ల కొద్దీ పరుగెత్తకుండా.. వాక్-రన్ పద్ధతిని పాటించాలి. ఉదాహరణకు 30 సెకన్లు పరిగెత్తితే, రెండు నిమిషాలు నడవాలి. వారానికి 10 శాతం కంటే ఎక్కువ దూరాన్ని లేదా సమయాన్ని పెంచకూడదు. పరుగెత్తేటప్పుడు పక్కవారితో పూర్తిగా ఒక వాక్యం మాట్లాడలేకపోతున్నారంటే మీ వేగం చాలా ఎక్కువగా ఉందని అర్థం. అన్నింటికంటే ముఖ్యంగా వారానికి కనీసం రెండు సార్లు స్క్వాట్స్, లంజెస్, కాఫ్ రైజెస్ వంటి స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం వల్ల మోకాళ్ల నొప్పులు, అకిలెస్ టెండన్ నొప్పులు, స్ట్రెస్ ఫ్రాక్చర్స్ వంటి గాయాల బారిన పడకుండా ఉండవచ్చు.














