41 C
Vijayawada
Wednesday, June 7, 2023
Homeరాజ నీతిఅప్పుల ఏపీ బతుకు ఇప్పుడు ఏమవుతుంది ?

అప్పుల ఏపీ బతుకు ఇప్పుడు ఏమవుతుంది ?

ఇన్నాళ్లూ ఇంటి పక్కన వాళ్లు, ఎదురింటి వాళ్లు, పక్క వీధిలో వాళ్లూ, గిట్టని వాళ్లూ మాట్లాడారు. తప్పు పట్టారు. తిట్టిపోశారు. గోతిలో పడి లోతులోకి పోతున్నాం అని ఆందోళన బైటపెట్టారు. అదంతా కుట్ర, కుతంత్రం, ఏడుపు, రొద అని కొట్టిపారేశారు. సరే. అలాక్కానీ అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏకంగా అధికార పార్టీ ఎంపీనే నేరుగా దేశం మొత్తం చూస్తుండగా – పార్లమెంటులోనే భోరుమన్నాక – ఏపీ అస్తవ్యస్తం అయిపోయింది అని ప్రకటించుకున్నాక ఇక చెప్పడానికి ఏం మిగిలింది ? అసలు ఏపీ ఎందుకు దివాళా దశ దాటి దిక్కుతోచని దిశగా వెళ్లిపోతోంది ? ఎవరు బాధ్యులు ? భరించాల్సిన వాళ్లు ఎవరు ? లెక్కలు, అప్పుల చిట్టా అందరూ చెబుతున్నారు. అది ఇక్కడొద్దు. ఇంపాక్ట్, భవిష్యత్ మీద అప్పుల ప్రభావం ఎలా ఉంటుందో మనం కొలుచుకుందాం తీరిగ్గా !

ముందరోడు ఏదో కాస్త మిగిల్చి పోయాడు కాబట్టి మొదట్లో తెలియదు. దాకల్లో మిగిలిన అడుగూ బొడుగూ మొదటి ఏడాది వరకూ కలిసొచ్చింది. ఆ తర్వాత అవే దాకలు, డేక్సాలూ అమ్మడం మొదలు పెట్టాక రెండేళ్లు దాటాయ్. ఇక అప్పటి జలయజ్ఞం స్ఫూర్తితో ఇక్కడ స్థలయజ్ఞం మొదలైంది. ల్యాండ్ ఏ రూపంలో ఉన్నా బ్యాండ్ వేయాలన్న తపన పర్సనల్ గా పనికొస్తోంది కానీ అప్పులకి పెద్దగా అక్కరకు రావడం లేదు. ఢిల్లీ బంధువుల్ని బతిమాలి, బామాలి ఏదో కాస్త జమేసి పంచినా – అంతా మేసే మేళమే కానీ కాసే మేళం లేదన్నట్టు తయారైపోయింది యవ్వారం. ఇదిగో సగం కాలం ముగిసే సరికి కథ క్లైమాక్స్ కి వచ్చేసింది. మామూలుగా అయితే ఎవరైనా నాలుగేళ్లు దాటుతున్నా అదే గుంభనంగా మెయింటైన్ చేస్తారు. మాకు ఇంకో ఏడాది సమయం ఉంది అంటూ దాటేసి ఆనక ఓడి – మొహం చాటేస్తారు. అది ఆనవాయితీ. కానీ ఇప్పుడే కొసమెరుపులు కనిపిస్తున్నాయ్ అంటే – ముందున్నది ముసళ్ల ఫెస్టివలే. అసలు ఏపీ లెక్క ఎక్కడ తప్పింది ఇప్పటికే రెండున్నర లక్షల కోట్లకిపైగా అప్పులు ఎందుకు అయ్యాయ్ ? ఇలాగైతే ముందు ముందు జనం సంగతి రాష్ట్రం పరిస్థితి ఏమవుతాయ్ అన్నది ఇప్పుడు పాయింట్. పథకాలు, పకోడీలు పక్కన పెట్టి అసలు బాగోతం మాట్లాడుకోవాలిప్పుడైనా !

మీ తలకి నవరత్న రాస్తా అన్నప్పుడే కొందరికి తట్టింది. ఏడాదికి 89 వేల కోట్ల ఆదాయం మాత్రమే ఉన్న రాష్ట్రం. ఉన్న రంధి సరిపోదన్నట్టు, కొత్త హామీలకి ఎంత లేదన్నా 65 వేల కోట్లు కావాలి. లెక్కలొచ్చినోళ్లు లెక్కేసుకోండి. కాస్త అటు ఇటుగా మనమైతే 75 శాతం అదనంగా కావాలి అనుకుందాం. ఎక్కడి నుంచి తెస్తావ్ అని అఢిగిన పాపాన పోలేదు. ప్రత్యర్థి పార్టీ ప్రస్తావించినా – వాళ్లకి ఏడుపు కాబట్టి అలా అన్నారని కొట్టిపారేశారు. సీపీఎస్ లు, కార్పొరేషన్ల విలీనాలు, పిల్లల్ని బడికి పంపిస్తే తాయిలాలు, ఎవడి బండి వాడు తోలుకుంటే నజరానాలు, ఎవడి పళ్లు వాడు తోముకుంటే బొనాంజాలు – అబ్బో చిత్రవిచిత్రాలు పుట్టాయ్ అక్కడే. ఆదాయంగా వచ్చిన పావలానే కాదు అఫ్పుగా తెచ్చిన ముప్పావలా కూడా ఈ పిప్పరమెంట్లకే సరిపోయింది. ఆఖరికి రోడ్డు వేసుకోలేని, వరదలొచ్చి కొట్టుకుపోతే పట్టుమని ఓ రెండు వేలు సాయం ఇవ్వలేని స్థితికి దిగజారిపోయాం. అంతా కలిపి రెండున్నరేళ్లు. నాలుగున్నర లక్షల కోట్లు అప్పులుంటే ఏంటి ? మహారాష్ట్రకి ఆరున్నర లక్షల కోట్ల అప్పులున్నాయ్. యూపీకి తొమ్మిదిన్నర లక్షల కోట్లున్నాయ్ అప్పులు అంటూ కొందరు పెయిడ్ పండితులు నిన్నమొన్నటి వరకూ నీచ్ లాజిక్కులు చెప్పారు. ఆ రాష్ట్రాల ఆదాయం సగటున లక్షా అరవై వేల కోట్లకిపైగా ఉంది. అంటే మనకంటే డబుల్. ఇలాంటి చచ్చు వాదనలు కాదు. అసలు ప్రభుత్వం అప్పులు చేస్తే జనం బతుకు ఏమవుతోంది తెలుసుకుందాం.

ఈ కాలంలో కొత్తగా కట్టిన కట్టడం లేదు. వేసిన రోడ్డు లేదు. పెట్టిన సంస్థ లేదు. భవిష్యత్ కోసం పడిన అడుగు లేదు. ఇదిగో ఆ ఖర్చుతో ఇది మొదలు పెడుతున్నాం – దీనివల్ల ఈ ఆదాయం వస్తుంది అని చెప్పుకునే కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ లేదు. అన్నట్టు కేపిటల్ ఎట్లాగూ లేదు. అది వేరే చరిత్ర. అంటే వచ్చింది, అఫ్పు తెచ్చింది అంతా ఫేస్ పౌడర్లు, స్నోలు, లిప్ స్టిక్కులు, హెయిర్ బ్యాండ్లకే సరిపోయింది. అంతా మేకప్పుకే అయిపాయె. మరి తినేదెట్టా ? కడుపు నిండేదెట్టా ? ఇదీ ఇప్పుడు క్వశ్చన్. అందుకే పార్లమెంటు సాక్షిగా ఏపీ ఖజానా భోరుమంది. నా గల్లా పెట్టె ఎప్పుడూ డబ్బులతో కళకళలాడాలి. లేదు, డబ్బులు బయటకు తీశాను అంటే వస్తువు అయినా కొనాలి. ఆస్తి అయినా పెరగాలి. ఈ మూడింటిలో ఏదో ఒకటి జరగాలి. అలా కాలేదు అంటే నేను అసమర్థుణ్ని అని లెక్క – అనేది ది గ్రేట్ ఆర్థిక మంత్రి రోశయ్య డైలాగ్. ఆ పద్దుల పెద్దాయన ఇప్పుడు మన మధ్యన లేడు కానీ – యాక్టివ్ గా ఉండి ఉంటే దున్ని దునుమాడేశేవాడు ఈ దివాళాకోరుతనాన్ని.

ఇప్పుడు ఇక ఏమవుతుంది ? రాష్ట్రానికి అప్పులు ఎక్కువైతే ఏపీ నుదుటన రెడ్ మార్క్ పడుతుంది. కొత్తగా అప్పులు ఇవ్వడానికి ఎవడూ రాడు. పావలా పైసా ఇచ్చినా రెండింతలు మూడింతల వడ్డీలు లాగుతారు. చేతిలో డబ్బులు లేవు కాబట్టి కనీస ఖర్చులకి కూడా డబ్బులు ఆడవు. అంగన్ వాడీలో కోడిగుడ్లు పెట్టకపోవడం, పిల్లల మధ్యాహ్న భోజనం ఆగిపోవడం, రోడ్లు వేయకపోవడం, కొత్తగా ఏ పనీ చేయకపోవడం, రాష్ట్రంలో కనీసం ఏ పనికీ శంకుస్థాపన కూడా జరగకపోవడం లాంటి వన్నీ ఆ ప్రతిఫలాలే. ఇది ప్రభుత్వం వైపు నుంచి చూస్తే కనిపిస్తాయ్. ఇక జనం వైపు నుంచి. కొత్తగా పనులు జరగడం లేదు కాబట్టి ప్రభుత్వానివే కాదు ప్రైవేటు రాబడులు కూడా తగ్గుతాయ్. వ్యాపారాలు చల్లబడతాయ్. నిర్మాణాలు ఆగుతాయ్. భూముల ధరలు తగ్గుతాయ్. వీటన్నిటి వల్లా ఆదాయాలు పడిపోతాయ్. జనం ఖర్చు పెట్టే స్థాయి పడిపోతుంది. వస్తువులు కొనడం, అమ్మడం నీరసపడుతుంది. చేసేందుకు పని దొరకదు. కదిలేవాడు లేక రవాణా స్థంభించిపోతుంది. వీటన్నిటి వల్లా రాష్ట్రం దీనస్థితికి దిగజారుతుంది. అటు ప్రభుత్వం పరిస్థితి – ఇటు జనం స్థితి ఇలా ఉంటే ఏపీ బ్రాండ్ పడిపోతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు, సంస్థలు – పరిశ్రమలు స్థాపించేందుకు ఎవరూ ముందుకు రాదు. ఉద్యోగాలు – ఆదాయాలు ఉండవు. డబ్బులొచ్చే మార్గం లేదు కాబట్టి పన్నుల రూపంలో జనం నుంచి పిండుకోడానికి రేట్లు పెంచడం, కేంద్రం తగ్గించినా పెట్రో ధరలు రాష్ట్రంలో తగ్గించకపోవడం, కరెంటు బిల్లులు పెరగడం, ఆల్రెడీ ఉంటున్న ఇళ్ల మీద కూడా కొత్తగా పన్నులు వేయడం లాంటివన్నీ సాగుతాయ్. అంటే, చేతికి పైసా రాకపోగా – కట్టాల్సిన పన్నులు తాడు తెంచుతాయ్. ఇదంతా అప్పుల ఎఫెక్టే.

నిజం నిష్టూరంగా ఉంటుంది చెప్పేటప్పుడు. అబద్ధం అద్భుతంగా, నవరత్న రాచినట్టుగా చల్లగా సమ్మగా అనిపిస్తది. కానీ అదే అబద్ధం బద్దలవుతున్నప్పుడు మాత్రం ఆటంబాంబును మించిన విస్పోటనం ఉంటుంది. దాని ప్రభావం తరాలు తల్లడిల్లే స్థాయిలో తాకుతుంది. ఏ ఢిల్లీ కూడా రక్షించలేని స్థితిలో మిగులుతుంది. అందుకే ఇప్పుడు ఏపీ ఆలోచించాల్సింది పథకాల గురించో పంపకాల గురించో కాదు. రాజకీయాల గురించి అంతకన్నా కాదు. బతుకు గురించి. బిడ్డల భవిష్యత్ గురించి. ఎవడో చేతగాని తనానికి పిల్లల బతుకులు బీడు అయిపోయే స్థితి నుంచి ఎలా బయటపడాలి అనే దాని గురించి ! ఇక ఏపీ అస్తవ్యస్త పరిస్థితికి కారకుడెవరో ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుందిగా ఇప్పటికే. అన్నట్టు, పార్లమెంటులో ఎంపీ మిథున్ రెడ్డి చెప్పాడు. పులిని చేయబోతే పిల్లి అయ్యిందట అని. నిజమే. పులి అనుకొని రావాలి కావాలి అని పిలిచారు. కానీ అది పులి కాదు. పులిహోర. ఆ విషయం అర్థమయ్యే సరికి చద్దన్నం కూడా మిగల్లేదు పులిహోర కలుపుకొందామంటే !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments