31 C
Vijayawada
Friday, September 4, 2026
Homeచాణక్య నీతిఇది కప్పల తక్కెడ కాంగ్రెస్ కాదు.. థమ్కీ ఇస్తే ఇంటికే..!

ఇది కప్పల తక్కెడ కాంగ్రెస్ కాదు.. థమ్కీ ఇస్తే ఇంటికే..!

తెలంగాణ రాజకీయాల్లో వివాదాస్పద కొండా దంపతులకి రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్ కాంగ్రెస్ లో రేవంత్ వ్యతిరేకులుగా వున్నవాళ్లని కంట్రోల్ చెయ్యొచ్చన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో నడుస్తా వుంది. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా కాంగ్రెస్ పార్టీలో క్రౌడ్ పుల్లర్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ని ఢీకొట్టే నాయకుడిగా, ఆయనకు సమానమైన ప్రత్యర్ధిగా కొద్ది కాలంలోనే ఎదగడంలో రేవంత్ తెలివితేటలు, వాగ్దాటి, పనితనమే కారణం. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యేవరకు కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే నాయకుడు.

విపరీత స్వేచ్ఛతో నోటికి పనిచెప్తూ, పార్టీకి నష్టం చేసే నేతలు అనేకమంది వుండేవారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక దీన్నొక ప్రాంతీయపార్టీలాగా నడిపారు. వైఎస్ పోయాక మళ్లీ కథ మొదటికి వచ్చింది. అందులోను తెలంగాణ కాంగ్రెస్లో ప్రతి ఒక్క నేతా తానే ముఖ్యమంత్రి అభ్యర్థినని ఫీలవుతుంటారు. బయటకు కూడా చెప్తుంటారు. నియోజకవర్గం దాటి పక్క నియోజకవర్గానికి పోతే వీళ్లని జనం గుర్తుపట్టరు. ఒకరంటే ఒకరికి పడదు. పలువురు కేసీఆర్ తో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలుండేవి. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రాదేమో అన్న వాతావరణంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ లో చేరారు.

రేవంత్ రెడ్డి ఫైర్, కేసీఆర్ మీద పోరాడ్డంలో రాజీలేనితనం రాహుల్ గాంధీ గుర్తించి, పిసిసి అధ్యక్షుడ్ని చేశారు. అధిష్టానం నమ్మకం నిలబెట్టి కాంగ్రెస్ ని గెలిపించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీగా యాక్టివ్ గా లేకపోయినా, ఆ పార్టీ అభిమానులున్నారు. వాళ్లలో ఎక్కువశాతం రేవంత్ కోసం కాంగ్రెస్ కు పనిచేసిన మాట నిజం. రేవంత్ సీఎం అవడం దశాబ్దాలుగా కాంగ్రెస్ లో వున్న సీనియర్ నేతలకు ఇష్టం లేకపోయినా, రాహుల్ మద్దతు, ప్రజామద్దతు ఉండటంతో మౌనంగా వున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా సెగ రాజేసే ప్రయత్నం చేస్తున్నారు.

చంద్రబాబు మనిషని, తెలుగుదేశం వాళ్లకు ప్రాధాన్యమిస్తాడని విమర్శిస్తుంటారు. రేవంత్ ఈ విమర్శలను పట్టించుకోకుండా తనదైన శైలిలో పనిచేసుకుంటున్నారు. ఇప్పుడు కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంలో వాళ్ల మీద చర్యలు తీసుకోడానికి అధిష్టానం అనుమతించకపోతే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి బలహీనపడేవారు. ఆయన్ని పాలన సరిగా చెయ్యనిచ్చే పరిస్థితి వుండదు. ఎందుకంటే ప్రతిపక్షం కంటే సొంత పార్టీ నేతలే ఇబ్బందులు పెట్టేవాళ్లు.

ముఖ్యమంత్రికి కంట్రోల్ లేకుండా ఎవరి దారి వారిదే అన్నట్టుండేది. అధిష్టానం ఆ ప్రమాదం నివారించిందని చెప్పాలి. అసలు ఈ వివాదానికి కారణం కొండా సురేఖ్ కుమార్తె సుస్మిత పటేల్. ఆమె ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించడం ఈ బర్తరఫ్ కుదారి తీసింది. గత నెల 16న ముఖ్యమంత్రి రేవంత్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. పరకాల నియోజకవర్గంలో జరిగిన సభలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా వున్న రేవూరి ప్రకాష్ రెడ్డే మళ్లీ పోటీ చేస్తారు, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

అక్కడ వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యాలనే ఆలోచనతో వున్న సుస్మిత నువ్వెవరు ఎనౌన్స్ చెయ్యడానికి అని ముఖ్యమంత్రిని, రేవూరి ప్రకాష్ రెడ్డిని దూషించారు. రేవంత్ కళ్ల నెత్తికెక్కాయని ఇష్టానుసారం అవినీతికి పాల్పడుతున్నారని విమర్శలు చేశారు. అక్కడి నుంచి వివాదం ముదిరి పాకన పడింది. ఆ తర్వాత.. కొండా సురేఖ తన కుమార్తెను వేసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా సీఎంపై విమర్శలు చేసారు. సుస్మితే కాదు సురేఖ కూడా గతంలో ముఖ్యమంత్రి మీద విమర్శలు చేశారు. అవే కాకుండా గతంలో కొండా సురేఖ నోటి దురుసు కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టింది.

ఆ తర్వాతనే ఆమెపై చర్యలకు కాంగ్రెస్ సిద్దమైంది. కొండా సురేఖ తన వాదన వినిపించడానికి ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిసినా ఫలితం లేదు. కేసీ వేణుగోపాల్ అయితే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. పైగా అక్కడ కూడా మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిమీద బహిరంగ విమర్శలు చేశారు. మంత్రివర్గ సభ్యురాలుగా వుంటూ ముఖ్యమంత్రి మీద బహిరంగ విమర్శలు చేశాక కూడా కంటిన్యూ చేస్తే అంతకంటే ఎగతాళి మారి వ్యవహారం ఇంకోటి వుండదు. రేపటి నుంచి సీఎం మీద ప్రతి వాడూ ఎగబడతాడు. అందుకే అధిష్టానం సూచన మేరకు రేవంత్ రెడ్డి సురేఖని బర్తరఫ్ చేశారు. ఈ బర్తరఫ్ తరువాత సురేఖ నాకు మాట మాత్రంగా చెప్పలేదు.

నా వివరణ తీసుకోలేదు, ముఖ్యమంత్రి తమ్ముళ్లు తిరుపతిరెడ్డి, కొండల్ రెడ్డి, మంత్రి పొంగులేటి కుట్ర చేసి తీయించారు. నా కూతురు అంటే నన్ను తీసేస్తారా, రెండేళ్ల ముందు ఎమ్మెల్యే అభ్యర్థిని సీఎం ఎలా ప్రకటిస్తారని స్పందించారు. ఆ నియోజకవర్గానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రజలను, ఎమ్మెల్యే మద్దతుదారులని హుషారు పరచడానికి ముఖ్యమంత్రి క్యాజువల్ గా అన్నారనుకోవాలి. లేదు కావాలని చెప్పినా కూడా ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఏదైనా వుంటే ఆయనతో మాట్లాడాలి కానీ, బహిరంగంగా సవాల్ చేస్తే ఏ ముఖ్యమంత్రి వూరుకోడు. రేవంత్ లాంటోళ్లు అసలూరుకోరు. నోరా వీపుకే తేకే అని ఒక సామెత వుంది.

అది కొండా కుటుంబానికి బాగా సరిపోలే సామెత. వీళ్ల రాజకీయ ప్రస్థానం ఆద్యంతం వివాదాలమయమే. కొండా మురళి పీపుల్స్ వార్ బ్యాక్ గ్రౌండ్ వుంది. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2002లో కొల్లి ప్రతాపరెడ్డి అని తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు, ఎర్రబెల్లి దయాకర్ అనుచరుడి హత్య కేసులో కొండా మురళినిందితుడు. ఆ ఘటనతోనే ఆయన పాపులర్ అయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వీళ్లని చేరదీశారు. వైఎస్ సీఎం అయ్యాక వీళ్ల వల్ల తనకు ప్రాణహాని వుందని దయాకరరావు అసెంబ్లీలో మొత్తుకున్నాడు. 2009లో వైఎస్ రెండోసారి సీఎం అయ్యాక సురేఖకి మంత్రి పదదవిచ్చారు. ఆయన మరణానంతరం రోశయ్య సీఎం అయ్యాక, జగన్ కురావాల్సిన పదవి రోశయ్యకిచ్చారని మంత్రిపదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరారు.

జగన్ మానుకోట పర్యటనని టిఆర్ఎస్ అడ్డుకున్నప్పుడు తన మనుషులతో ఎదురుదాడి చేశారు. ఆ తరువాత జగన్ కు దూరమయ్యారు. టిఆర్ఎస్ లో చేరారు. అక్కడ కూడా ఇమడలేకపోయారు. ఆ తరువాత తిరిగి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ పంపించేసింది. నెక్ట్స్ స్టెప్ ఏంటి అనే చర్చ జరుగుతా వుంది. కొసమెరుపేంటంటే గతంలో ఒక ఇంటర్వ్యూలో కొండా దంపతులు జగన్మోహనరెడ్డి మీద విమర్శలు చేస్తూ, చంద్రబాబు గెలిస్తేనే ఏపీకి ఫ్యూచర్ అని చెప్పారు. 2004కు ముందు తనను ఎనకౌంటర్ చేయించేందుకు ఎర్రబెల్లి పోలీసుల ద్వారా ప్రయత్నాలు చేశారని, అప్పుడు చంద్రబాబే వద్దని చెప్పడం వల్ల తాను బతికున్నానని కొండా మురళి చెప్పారు.

సీన్ కట్ చేస్తే ఇప్పుడు రేవంత్ తెలుగుదేశం నుంచి వచ్చాడు, తెలుగుదేశం వాళ్లతో కాంగ్రెస్ ని నింపేసి, అసలైన కాంగ్రెస్ వాళ్లని తరిమేస్తున్నాడని విమర్శిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే కొన్నాళ్లుగా రేవంత్ మీద తీవ్ర విమర్శలు చచేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని వదిలేసి, చిన్నారెడ్డి, కొండా మీదే యాక్షన్ తీసుకోవడానికి కారణమేంటన్నచర్చ జరుగుతా వుంది. వీళ్ల మీద యాక్షన్ తీసుకుంటే ఆయన సైలెంట్ అవతారనే ఆలోచనతో వున్నారో, అవకపోతే తరువాత లిస్ట్ లో వుంటారో చూడాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments