ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రాథమిక కసరత్తు తెరపైకి రావడంతో అధికార కూటమిలో సీట్ల సర్దుబాటు సమీకరణాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని అత్యంత కీలకమైన విజయవాడ, మచిలీపట్నం నగర కార్పొరేషన్ల మేయర్ స్థానాలపై కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఆసక్తికర చర్చ నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే, ఈ స్థానిక సమరంలోనూ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్న కూటమి నేతలు.. “బందరు జనసేనకు – విజయవాడ టీడీపీకి” అనే సరికొత్త ఫార్ములాను తెరపైకి తెస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో బలమైన విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మచిలీపట్నం కార్పొరేషన్ మేయర్ స్థానం ఈసారి బీసీ మహిళ కేటగిరీకి కేటాయించే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక అంచనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బందరు మేయర్ పీఠాన్ని తమకు కేటాయించాలని జనసేన పార్టీ బలంగా ఆశిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో, ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీకి బలమైన క్యాడర్, బీసీ సామాజిక వర్గ ఓటర్ల మద్దతు పుష్కలంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుండి కూటమి అభ్యర్థిగా జనసేన నేత బాలశౌరి ఎంపీగా విజయం సాధించడం కూడా పార్టీకి కలిసొచ్చే అంశం.
పార్లమెంట్ స్థానం తమ చేతిలో ఉండటంతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్న పట్టును బేస్ చేసుకుని, బందరు మేయర్ సీటును తమ ఖాతాలో వేసుకోవాలని జనసేన అధిష్టానం పట్టుబడుతున్నట్లు సమాచారం. మరోవైపు, రాష్ట్ర రాజకీయాలకే కేంద్ర బిందువైన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ తమ వద్దే ఉంచుకోవాలని తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. విజయవాడ నగరంలో టీడీపీకి దశాబ్దాలుగా తిరుగులేని రాజకీయ పట్టు ఉంది. గత మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా నడిచినా.. విజయవాడలో మాత్రం టీడీపీ గట్టి పోటీ ఇచ్చి కార్పొరేటర్ స్థానాలను కైవసం చేసుకుంది.
ప్రస్తుతం నగర పరిధిలోని సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ అసెంబ్లీ స్థానాలతో పాటు విజయవాడ లోక్‌సభ స్థానం కూడా కూటమి వశం కావడంతో.. బెజవాడ మేయర్ పీఠంపై టీడీపీ అభ్యర్థే కూటమి తరఫున రేసులో ఉండటం దాదాపు ఖాయమని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని ఈ రెండు ప్రధాన కార్పొరేషన్లలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి రెండు పార్టీల మధ్య అంతర్గతంగా ఒక అవగాహన కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకరికి బందరు, మరొకరికి బెజవాడ చొప్పున కేటాయించుకోవడం ద్వారా ఎలాంటి అసంతృప్తులు లేకుండా క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను సమన్వయం చేసుకోవచ్చని అగ్రనేతలు భావిస్తున్నారు. అమరావతిలో జరగబోయే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాధవ్‌ల తదుపరి అధికారిక భేటీలో ఈ జిల్లాల సీట్ల పంపిణీపై పూర్తి స్థాయి స్పష్టత రానుంది.














