గాల్లో వేల అడుగుల ఎత్తున విమానం ప్రయాణిస్తున్నప్పుడు.. ఊహించని విధంగా మృత్యువు హైజాక్ రూపంలో ఎదురొస్తే సాధారణంగా ఎవరికైనా గుండె ఆగిపోయినంత పనవుతుంది. కానీ, అలాంటి అత్యంత భయానక ప్రాణాంతక పరిస్థితులలో కూడా భారతీయులకు ఉండే గుండెధైర్యం, సాహస గుణం ఎంతటిదో చరిత్రలో పలు సందర్భాల్లో నిరూపితమైంది.
తాజాగా దుబాయ్-టెల్ అవీవ్ ఫ్లైదుబాయ్ విమానంలో సాక్షాత్తూ సైకో కో-పైలట్ విమానాన్ని కూల్చేయడానికి ప్రయత్నించినప్పుడు, మన భారత సంతతికి చెందిన కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ఒంటిచేత్తో అతడిని తొక్కిపట్టి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన తీరు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనతో గతంలో పాకిస్తాన్‌లోని కరాచీలో హైజాకర్‌లకు ఎదురొడ్డి ప్రయాణికుల కోసం ప్రాణాలర్పించిన భారత వీరనారి నీరజా భానోత్ సాహస ప్రస్థానాన్ని ప్రపంచం మరోసారి గుర్తుచేసుకుంటోంది.
1986 కరాచీ నరకం.. నీరజా భానోత్ అమరగాథ:
భారతీయుల ధైర్యసాహసాల గురించి మాట్లాడుకుంటే మొదటగా గుర్తుకొచ్చే పేరు నీరజా భానోత్. సెప్టెంబర్ 5, 1986న ముంబై నుండి అమెరికా వెళ్తున్న ‘పాన్ యామ్ ఫ్లైట్ 73’ విమానాన్ని పాకిస్తాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో అబు నిడాల్ ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు సాయుధ ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఆ సమయంలో కేవలం 22 ఏళ్ల వయసున్న సీనియర్ ఫ్లైట్ పర్స్ అంటే ఎయిర్ హోస్టెస్.. నీరజా భానోత్ భయపడకుండా వ్యవహరించారు.
ఉగ్రవాదులు అమెరికా పౌరులను గుర్తించి కాల్చి చంపాలని చూసినప్పుడు, విమానంలోని అమెరికన్ పాస్‌పోర్టులను అత్యంత చాకచక్యంగా దాచిపెట్టి వారి ప్రాణాలను రక్షించారు. చివరకు విమానంలో ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నప్పుడు.. ప్రయాణికులను ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు పంపుతూ, ముగ్గురు పిల్లలను కాపాడే క్రమంలో ఉగ్రవాదుల బుల్లెట్లకు ఎదురొడ్డి ఆమె వీరమరణం పొందారు. ఆమె చూపిన అసాధారణ ధైర్యానికి గాను భారత ప్రభుత్వం అత్యున్నత అశోక చక్ర అవార్డుతో గౌరవించింది.
2026 కాక్‌పిట్ క్లైమాక్స్.. కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ సింహ పరాక్రమం:
సరిగ్గా నలభై ఏళ్ల తర్వాత, రూపం మారింది కానీ భారతీయుడి రక్తం లోని ధైర్యం మారలేదని కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ నిరూపించారు. దుబాయ్ నుండి ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో సహ-పైలట్‌కు అకస్మాత్తుగా తీవ్రమైన సైకోటిక్ అటాక్ వచ్చి విమానాన్ని కిందికి డైవ్ చేయించి కూల్చేయడానికి చూశాడు. ఆ సమయంలో గుజరాత్‌కు చెందిన కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ సింహంలా దూకి అతడిని అడ్డుకున్నారు.
ఆ సైకో కత్తితో దాడి చేయడంతో స్మిత్ తల, చేతులు తెగిపోయేలా గాయపడి, కాక్‌పిట్ అంతా రక్తసిక్తమైనప్పటికీ స్మిత్ ఏమాత్రం పట్టు వదల్లేదు. ‘నేను కళ్లు మూస్తే వెనుక ఉన్న వందలాది మంది శవాలవుతారు’ అనే ఒకే ఒక్క ఆలోచనతో, నరకప్రాయమైన నొప్పినీ భరిస్తూ ఆ సైకోను సీట్లోనే తొక్కిపట్టి విమానాన్ని తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారు. తీవ్ర రక్తస్రావంతోనే విమానాన్ని సౌదీ అరేబియాలో సురక్షితంగా ల్యాండ్ చేసి 174 మంది ప్రయాణికులకు పునర్జన్మ ప్రసాదించారు.
ప్రపంచాన్ని విస్మయపరుస్తోన్న ఇండియన్ బ్లడ్ పవర్:
భారతదేశంలో పుట్టి పెరిగిన పౌరులకు సంస్కారంతో పాటు ఆపద సమయంలో తోటి ప్రాణాలను కాపాడాలనే నైతిక బాధ్యత, లొంగిపోని గుండెధైర్యం సహజంగానే అబ్బుతాయని ఏవియేషన్ నిపుణులు సైతం ప్రశంసిస్తున్నారు. 1986లో నీరజా భానోత్ తుపాకీ బుల్లెట్లకు భయపడకుండా ప్రయాణికులకు డోర్లు తెరిస్తే.. నేడు 2026లో కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ తన ఒంటిపై కత్తుల గాయాలైనా సరే కాక్‌పిట్ కంట్రోల్స్ వదలకుండా నిలబడ్డారు. విమానయాన చరిత్రలో హైజాక్ లేదా కాక్‌పిట్ ఎమర్జెన్సీలు వచ్చినప్పుడు అత్యంత క్లిష్టమైన నిర్ణయాలు తీసుకుని, చావు నోట్లోంచి వందలాది మందిని సురక్షితంగా బయటకు తీసుకురావడంలో భారతీయుల తర్వాతే ఎవరైనా అని ఈ రెండు చారిత్రాత్మక ఘట్టాలు ప్రపంచానికి చాటిచెప్పాయి.
దేశాధినేతల ప్రసంశలు
ఈ సాహసంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా స్పందిస్తూ.. “మన గుజరాత్ గడ్డపై పుట్టిన స్మిత్ మచ్ఛర్ అసాధారణ ధైర్యం ప్రతి భారతీయుడికి గర్వకారణం” అని కొనియాడారు. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. “ఇలాంటి ప్రాణాంతక స్థితిలో ఒక మనిషి ఇంతటి ధైర్యం ప్రదర్శించడం అసాధ్యం, స్మిత్ ఒక గ్లోబల్ హీరో” అని ప్రశంసించారు. విమానంలో మెజారిటీ ఇజ్రాయెల్ పౌరులే ఉన్నందున, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నేరుగా స్మిత్ మచ్ఛర్ సాహసానికి కృతజ్ఞతలు తెలుపుతూ అధికారిక ప్రకటన విడుదల చేశారు.














