ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎవరూ ఊహించని మైండ్ బ్లాక్ షాక్ ఇచ్చాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత కూడా, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల విషయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను టార్గెట్ చేస్తూ.. డీఎస్సీ ప్రక్రియపై నిరంతరం యాగీ చేస్తే నిరుద్యోగ యువత ఓట్లు తమ వైపు మళ్లుతాయని వైసీపీ అగ్రనాయకత్వం ఒక పెద్ద పొలిటికల్ లెక్క వేసుకుంది. ఈ డీఎస్సీ అస్త్రంతో పట్టణ ఓటర్లను, యువతను కూటమికి వ్యతిరేకంగా తిప్పొచ్చని తాడేపల్లి వర్గం గట్టిగా నమ్మింది.
కానీ, తాజా స్థానిక సంస్థల ఎన్నికల తీర్పు చూశాక.. నిరుద్యోగులు వైసీపీ వ్యూహాలను కంప్లీట్‌గా రివర్స్ కొట్టి, కూటమి ప్రభుత్వం వైపే నిలిచారని స్పష్టమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 148 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 16,342 పోస్టులతో మొదటి మెగా డీఎస్సీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి, అభ్యర్థులకు నియామక పత్రాలు సైతం అందించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సీరియస్ గా తీసుకుని ఈ నియామకాలు పూర్తి చేయడంపై నిరుద్యోగుల్లో ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది.
దీనికి తోడు తాజాగా మరో 2,721 పోస్టులతో డీఎస్సీ-2026 సమగ్ర నోటిఫికేషన్‌ను కూడా ప్రభుత్వం బుధవారం అర్ధరాత్రి జారీ చేసింది. ప్రభుత్వం వరుసగా ఉద్యోగాల భర్తీ చేస్తుంటే.. వైసీపీ మాత్రం ప్రతి చిన్న విషయానికి కోర్టులకు వెళ్లడం, నోటిఫికేషన్లపై బురదజల్లడం వంటి పనులు చేయడం నిరుద్యోగ యువతకు నచ్చలేదు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతలు డీఎస్సీ నియామకాల్లో ఏదో అన్యాయం జరిగిపోయిందంటూ నగర, పట్టణ ఓటర్లలో అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేశారు.
నిరుద్యోగ ఓట్లను క్యాష్ చేసుకోవాలనే ప్లాన్ వేశారు. కానీ, విద్యావంతులు, యువత ఎక్కువగా ఉండే గ్రేటర్ విశాఖ, విజయవాడ, గుంటూరు లాంటి మేజర్ కార్పొరేషన్లలో వైసీపీ ప్రచారాన్ని ఓటర్లు కంప్లీట్‌గా తిరస్కరించారు. ఫలితంగా గ్రేటర్ విశాఖలో కూటమి అభ్యర్థి ముక్కా శ్రావణి ఏకంగా 2.44 లక్షల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోగా, విజయవాడలో వంగవీటి రాధాకృష్ణ చారిత్రాత్మక విజయం సాధించారు. నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు ఇస్తున్న కూటమి ప్రభుత్వ అభివృద్ధి అజెండా వైపే నిలబడ్డారని ఈ వన్‌సైడ్ ఫలితాలు నిరూపించాయి.
ఇప్పటికైనా యువత నాడిని పట్టుకోవడంలో వైసీపీ అధిష్టానం ఘోరంగా ఫెయిల్ అయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదో ఒక ఇష్యూ దొరికితే చాలు దానిపై యాగీ చేసి కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేయాలనే పాత రాజకీయ పద్ధతులనే జగన్ నమ్ముకున్నారు. కానీ, ఇప్పటి జనరేషన్ యువత కేవలం సోషల్ మీడియా ప్రచారాలను చూసి ఓట్లేయరని, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న రిక్రూట్మెంట్ని చూసి తమ భవిష్యత్తు కోసం ఓటేశారని మున్సిపల్ ఎన్నికల ట్రెండ్స్ క్లియర్ గా చూపించాయి. నిరుద్యోగులు తమ వైపు ఉన్నారనే భ్రమల నుంచి వైసీపీ ఇప్పటికైనా బయటకు రాకపోతే.. రాబోయే రోజుల్లో ఆ పార్టీకి యువత నుంచి మద్దతు పూర్తిగా సున్నా అయిపోవడం ఖాయం.














