విజయవాడలోని ‘శాప్’ కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో దౌర్జన్యానికి దిగాయి. ‘డీఎస్సీ-2025’ భర్తీపై సీబీఐ విచారణ జరపాలంటూ వైసీపీ ఇచ్చిన ముట్టడి పిలుపు చివరకు తీవ్ర హింసాత్మకంగా మారింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఈ ముట్టడి నేపథ్యంలో డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు తమ నియామకాలను సమర్థిస్తూ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
అయితే, అక్కడకు వచ్చిన వైసీపీ రౌడీ మూకలు ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకుని బూతు పురాణం అందుకున్నాయి. మహిళా ఉపాధ్యాయులు అని కూడా చూడకుండా అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ, వారిపై భౌతిక దాడులకు తెగబడ్డారు. ఈ ఘోర దౌర్జన్యాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన శాప్ డైరెక్టర్‌పై సైతం వైసీపీ శ్రేణులు దాడి చేయడం అక్కడ ఉద్రిక్తతను మరింత పెంచింది. వైసీపీ నేతల సమక్షంలోనే ఈ రౌడీయిజం సాగడంపై ఉపాధ్యాయ సంఘాలు మరియు బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.














