కూటమి సర్కార్ మెగా నోటిఫికేషన్ల స్పీడ్.. 2029 వరకు వైసీపీ కోలుకోవడం కష్టమేనా..?

0
3

ఏపీలో కూటమి సర్కార్ ఉద్యోగ నియామకాల విషయంలో స్పీడ్ పెంచింది. ముఖ్యంగా నిరుద్యోగుల కలల ఉద్యోగాలైన మెగా డీఎస్సీ, భారీ పోలీస్ నోటిఫికేషన్లను విడుదల చేస్తూ నియామకాల ప్రక్రియను పరుగులు పెట్టిస్తోంది. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ నియామకాలను ఎక్కడా ఆపకుండా ముందుకు తీసుకెళ్లడం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. ఈ నిర్ణయం కేవలం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడమే కాదు.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2029 సార్వత్రిక ఎన్నికల సమీకరణాలను కూడా పూర్తిగా మార్చేయబోతోంది. ఈ నోటిఫికేషన్ల వెల్లువ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎలా దెబ్బకొట్టబోతోంది..? జగన్ మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు ఇది ఎలాంటి ముప్పుగా మారబోతుందో ఓ లుక్ వేద్దాం.

అసలు విషయం అర్థం కావాలంటే మనం 2024 ఎన్నికలకు ముందు ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. గత ఐదేళ్ల జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. ఆ సమయంలో జగన్ ప్రభుత్వం కేవలం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు, వాలంటీర్ వ్యవస్థను మాత్రమే తీసుకొచ్చింది. అవి కూడా తక్కువ జీతాలతో, రాజకీయ ప్రయోజనాల కోసం తెచ్చిన తాత్కాలిక వ్యవస్థలనే విమర్శలు ఎదుర్కొన్నాయి.

ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలైన టీచర్ పోస్టులు, పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోవడంతో లక్షలాది మంది యువత తీవ్ర నిరాశకు గురైంది. అదే కోపం 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణమైంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ సరిగ్గా అక్కడే దెబ్బకొట్టింది. నిధుల కొరత వేధిస్తున్నా సరే.. యువతకు ఇచ్చిన మాట ప్రకారం రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రిక్రూట్‌మెంట్ల స్పీడ్ వైసీపీ పునాదులను కదిలించేలా కనిపిస్తోంది.

సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా యువత, నిరుద్యోగులు ఏ పార్టీ వైపు ఉంటే ఆ పార్టీకి తిరుగుండదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం లక్షలాది మంది యువతకు శాశ్వత ఉపాధి కల్పిస్తోంది. ఒక్కో ఇంట్లో ఉద్యోగం వస్తే ఆ కుటుంబాలు శాశ్వతంగా కూటమికి అండగా మారే అవకాశం ఉంది. దీనివల్ల త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి క్యాడర్ దొరకడం గగనంగా మారుతుంది. గతంలో వాలంటీర్లపై ఆధారపడి రాజకీయం చేసిన జగన్ కు.. ఇప్పుడు క్షేత్రస్థాయిలో యువత మద్దతు లభించడం కష్టమే.

ఈ ఉద్యోగాల ప్రభావం కేవలం స్థానిక ఎన్నికలకే పరిమితం కాదు.. 2029 నాటికి సరికొత్త యువ ఓటర్ల వర్గం పూర్తిగా కూటమికి అనుకూలంగా మారిపోతుంది. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న వైసీపీ ఆశలపై ఈ నోటిఫికేషన్లు నీళ్లు చల్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా.. ఆర్థిక ఇబ్బందులను పక్కనపెట్టి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సాహసోపేత నిర్ణయం ఏపీ రాజకీయాల్లో మైలేజ్ పెంచుతోంది. నిరుద్యోగుల ఆకలి తీరుస్తూనే.. రాజకీయంగా ప్రతిపక్షానికి కోలుకోలేని దెబ్బ కొడుతోంది చంద్రబాబు మార్క్ రాజకీయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.