దేశంలో ఎన్నికల నిర్వహణపై తీవ్రమైన రాజకీయ దుమారం రేగుతున్న వేళ, కేంద్ర ఎన్నికల సంఘం చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో అంతర్గత విభేదాలు, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ల అభ్యంతరాలను పక్కనబెట్టారన్న కథనాల నేపథ్యంలో.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ రంగంలోకి దిగింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ 48 గంటల్లోగా తన పదవికి రాజీనామా చేయాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే గురువారం డిమాండ్ చేశారు.
ఒకవేళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిర్ణీత గడువులోగా రాజీనామా చేయకపోతే, దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యమిస్తామని సీజేపీ హెచ్చరించింది. గతంలో విద్యా సంస్కరణల కోసం దేశ రాజధానిని కదిలించిన తరహాలోనే.. ఈసారి ఎన్నికల సంఘం తీరుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘జంతర్ మంతర్ 2.0’ పేరిట భారీ నిరసన ప్రదర్శన మరియు నిరవధిక ధర్నా చేపడతామని అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. ఓటు హక్కును కాలరాసేలా సాగుతున్న నిర్ణయాల వెనుక ఉన్న అసలు సూత్రధారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, స్వతంత్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ వివాదం పూర్తిగా సమసిపోయి, ప్రజల్లో నమ్మకం కలిగేలా స్వతంత్ర కమిటీ విచారణ పూర్తయ్యేంత వరకు త్వరలో జరగబోయే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను తక్షణమే నిలిపివేయాలని కాక్రోచ్ జనతా పార్టీ తేల్చి చెప్పింది. ఓటర్ల జాబితా అక్రమ మార్పుల ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగడం లేదని సీజేపీ ప్రతినిధులు ఆరోపించారు. ఇప్పటికే పార్లమెంట్‌లో విపక్షాలు సీఈసీ తొలగింపునకు నోటీసులు ఇస్తున్న తరుణంలో, యువత నుంచి వచ్చిన ఈ 48 గంటల అల్టిమేటం దేశ రాజధానిలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.














