కేతన్ అగర్వాల్ కేసు చార్జ్‌షీట్‌లో సియా గోయల్ దారుణాలు..!

0
2

మహారాష్ట్రలోని పుణె లోహగఢ్ కోట పైనుంచి లోయలోకి నెట్టి 25 ఏళ్ల యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌ను హత్య చేసిన సంచలన కేసులో పుణె పోలీసులు కోర్టులో దాఖలు చేసిన 5,053 పేజీల భారీ చార్జ్‌షీట్ ద్వారా దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దారుణ హత్యకు పాల్పడిన కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి, వారితో పాటు రితేష్ హంగే అనే ముగ్గురు నిందితుల నేరపూరిత కుట్రను పోలీసులు చార్జ్‌షీట్‌లో పూసగుచ్చినట్లు వివరించారు. కేతన్‌తో పెళ్లి ఇష్టం లేని సియా గోయల్, ఎలాగైనా అతడిని వదిలించుకోవాలనే పగతో ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు దర్యాప్తులో తేలింది.

చార్జ్‌షీట్ ప్రకారం.. నిందితులు మొదట కేతన్‌ను బెంగళూరుకు తీసుకెళ్లి అతని కాళ్లు, చేతులు విరగ్గొట్టాలని ప్లాన్ చేశారు, కానీ అక్కడ ఒక స్నేహితుడు ఇందుకు నిరాకరించడంతో నేరుగా చంపేయాలని డిసైడ్ అయ్యారు. ఈ హత్య ప్లాన్ కోసం నిందితులు క్రైమ్ సినిమాలు చూడటంతో పాటు, చాట్‌జీపీటీ టెక్నాలజీని, క్రైమ్ పాడ్‌కాస్ట్‌లను ఉపయోగించి పోలీసులకు దొరక్కుండా ఎలా తప్పించుకోవాలో స్కెచ్ వేశారు. జూన్ 6న ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం వెళ్తుండగా, ప్రియుడి ఐడియాతో సియా గోయల్ కేతన్ పాస్‌పోర్ట్‌ను కాఫీ షాప్ వాష్‌రూమ్‌లో చింపేసి పర్యటన క్యాన్సిల్ అయ్యేలా చేసింది. ఆ తర్వాత ‘మహి’ పేరుతో ఒక నకిలీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ సృష్టించి, సర్‌ప్రైజ్ బర్త్‌డే పార్టీ ఉందంటూ కేతన్‌ను నమ్మించి జూన్ 18న లోహగఢ్ కోటపైకి రప్పించారు.

కోటపైకి వెళ్లిన తర్వాత సియా గోయల్, ఆమె ప్రియుడు కలిసి కేతన్‌ను లోయలోకి తోసేస్తుండగా.. అక్కడ ఉన్న ఒక ప్రత్యక్ష సాక్షి దానిని చూశాడు. ఆ సమయంలో నిందితుడు చేతన్ చౌదరి “నోరు మూసుకుని ఉండు, లేదంటే నిన్ను కూడా కోట పైనుంచి కిందకు తోసేస్తాం” అని సదరు సాక్షిని బెదిరించాడు. భయపడిపోయిన ఆ సాక్షి, ఐదు రోజుల తర్వాత టీవీల్లో వార్తలు చూసి పోలీసులను సంప్రదించి స్టేట్‌మెంట్ ఇచ్చాడు. “ఎప్పటికీ జరగబోని పెళ్లి కోసం విమానం టికెట్లు బుక్ చేయడానికి ఆధార్ కార్డ్ పంపించు” అంటూ సియా గోయల్ తన స్నేహితురాలితో స్నాప్‌చాట్‌లో చేసిన చాటింగ్ కూడా దొరికింది. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం, నిందితులకు కఠిన శిక్ష పడేలా చేసేందుకు ప్రముఖ సీనియర్ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.