కరువు సీమ నుంచి ‘ఫ్రూట్ బౌల్’ దిశగా..! అసలు ఏమిటీ హార్టికల్చర్ హబ్ ?

0
7

ఏపీ ప్రభుత్వం ఇవ్వాళ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు శ్రీకారం చుట్టింది. లక్ష కోట్ల రూపాయల ఖర్చుతో ఏపీని ప్రపంచానికే ఫ్రూట్ బౌల్ గా తీర్చిదిద్దే అద్భుతమైన కార్యక్రమానికి బీజం వేసింది. దీని వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, కృషి వున్నాయి. వ్యవసాయ శాఖ, ఆర్ధిక, జలవనరుల శాఖలతో అనేకమార్లు సమీక్షలు నిర్వహించి, కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అసలేంటీ హార్టికల్చర్ హబ్? దీంతో రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు ఒనగూరే ప్రయోజనం ఏంటి? ఈ ప్రాంత రైతులకు, ప్రజలకు ఎలాంటి లబ్ధి కలుగుతుందన్న సందేహాలు చాలా మందిలో వుండొచ్చు.

రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు తక్కువ. నీటి వనరులు కూడా తక్కువే. అయితే తక్కువగా వున్న నీటివనరులని సద్వినియోగం చేసుకుంటూ, ఉద్యానవన పంటల సాగుని ప్రోత్సహించడం, నీటిపారుదల ప్రాజెక్టులని నిర్మించి, కొత్తగా 9 లక్షల ఎకరాలకు నీరందించడం, 4.3 లక్షల ఎకరాల ఆయకట్టుని స్థిరీకరించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టుని ప్రారంభించారు. దాదాపు లక్ష కోట్ల రూపాయల అంచనా పెట్టుబడితో, రాయలసీమను దేశంలోనే కీలక ఉద్యాన పంటల కేంద్రంగా, చివరికి అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానమైన ‘ఫ్రూట్ బౌల్’గా అభివృద్ధి చేయాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇది కేవలం కొత్తగా పండ్ల తోటలు వేయించే పథకం కాదు.

రైతు పొలంలో విత్తనం వేయడం దగ్గర నుంచి… పంట పండించడం… కోత… గ్రేడింగ్… ప్యాకింగ్… కోల్డ్ స్టోరేజ్… ప్రాసెసింగ్… రవాణా… చివరకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకం వరకు మొత్తం వ్యవస్థను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్నది ప్రణాళిక.ఈ ప్రాజెక్టు కింద పది జిల్లాల్లో 201 హార్టికల్చర్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూలు, చిత్తూరు, కడప, ఉమ్మడి ప్రకాశం జిల్లాలు ఈ ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయి. మొత్తం 303 మండలాలు, 5869 గ్రామాలను ఈ ప్రాజెక్ట్ కవర్ చేస్తుంది. ఉద్యానవన పంటల సాగుని 15 లక్షల ఎకరాలకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో రూపకల్పన చేశారు.

435 లక్షల మెట్రిక్ టన్నుల పండ్లు ఉత్పత్తి చెయ్యాలనేది లక్ష్యం. ఈ మొత్తం కార్యక్రమం ద్వారా సుమారు 9.6 లక్షల మంది రైతుల ఆదాయం, జీవన ప్రమాణాలను మెరుగుపడుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు పరిధిలోని జిల్లాల్లో పెండింగ్ లో వున్న నీటి పారుదల ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేస్తారు. ఇందులో ప్రభుత్వం వైపు నుంచి 40 వేల కోట్లు పెట్టుబడి పెడతారు. ఇంకో 60 వేల కోట్లు ప్రైవేటు పెట్టుబడులు సమీకరిస్తారు. ప్రభుత్వం పెట్టే పెట్టుబడుల్లో సాగునీటి రంగానికి 21 వేల కోట్లు, ఉద్యానవనరంగానికి 15 వేల కోట్లు, గ్రామీణ రహదారుల అభివృద్ధికి 4,500 కోట్లు ఖర్చు పెడతారు. అంటే పంటల సాగు కోసం నీటి సౌకర్యం, ఉత్పత్తుల రవాణా కోసం మంచి రోడ్లు, స్టోరేజ్, ప్రాసెసింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు.

దీంతో పాటు ఎగుమతులు, మార్కెట్ కూడా కలిపి ఒక సమగ్ర వ్యవస్థని తయారు చేస్తారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ఉద్యాన పంట సాగుకు ప్రధానంగా నీటి సమస్య వుంది. దీని కోసమే సాగునీటి వసతుల కల్పనకు 21 వేల కోట్లు కేటాయించారు. హంద్రీనీవా, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టులని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చెయ్యడం, అలాగే పెండింగ్ లో వున్న ఎత్తిపోతల పథకాలను సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చెయ్యడం లక్ష్యంగా పెట్టుకున్నారు. రిజర్వాయర్లు, లిఫ్ట్ ఇరిగేషన్, చెరువులు, చివరి ఆయకట్టు వరకు నీటిని తీసుకెళ్లే వ్యవస్థలతో పాటు డ్రిప్, స్ప్రింక్లర్, ఫర్టిగేషన్ వంటి సూక్ష్మ సాగునీటి విధానాలను విస్తరించాలని ప్రణాళికలో పేర్కొన్నారు.

ఈ పథకంలో భాగంగా మామిడి, అరటి, టమాటా, దానిమ్మ, బత్తాయి, మిర్చి వంటి పంటలతో పాటు… డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, బెర్రీస్, ఖర్జూరం వంటి అధిక విలువ కలిగిన పంటలను కూడా ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది.అయితే ఇక్కడ అసలు ప్రశ్న పంట పండించడం కాదు. పండించిన పంటకు మంచి ధర ఎలా వస్తుంది. అందుకే క్లస్టర్లలో కలెక్షన్ సెంటర్లు, గ్రేడింగ్, సార్టింగ్, ప్యాకింగ్ యూనిట్లు, ప్రీకూలింగ్ కేంద్రాలు, కోల్డ్ స్టోరేజీలు, రైపనింగ్ ఛాంబర్లు, కోల్డ్ చైన్ రవాణా, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

ఉదాహరణకు… మామిడిని పండుగా అమ్మడమే కాకుండా మామిడి పల్ప్గా మార్చవచ్చు. అరటిని పౌడర్ లేదా చిప్స్గా విలువ జోడించి మార్కెట్ చేయవచ్చు. టమాటాను ప్యూరీగా మార్చవచ్చు. మిరపకాయల నుంచి ఒలియోరెసిన్ వంటి విలువైన ఉత్పత్తులను తయారు చేయవచ్చు. తద్వారా మార్కెట్ పరిధిని పెంచి, రైతుకు ఆదాయం పెంచొచ్చు. ఉద్యాన పంటలు పండించినా మార్కెట్‌కు తీసుకెళ్లడానికి రోడ్లు లేకపోతే ప్రయోజనం ఉండదు. అందుకే దాదాపు 5,721 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయడానికి రూ.4,562 కోట్లు ప్రతిపాదించారు. పంట కోసిన వెంటనే మార్కెట్‌కు చేరాలి. అక్కడి నుంచి కోల్డ్ చైన్ ద్వారా ప్రాసెసింగ్ యూనిట్‌కు వెళ్లాలి.

అక్కడి నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు లేదా పోర్టుల ద్వారా విదేశాలకు వెళ్లాలి. కాబట్టి రోడ్లు వంటి మౌలిక సదుపాయాల కల్పించాలి. ఈ మొత్తం సరఫరా వ్యవస్థ సరిగా పనిచేస్తేనే హార్టికల్చర్ హబ్ లక్ష్యం నెరవేరుతుంది. ఇది సక్సెస్ అయితే ఈ జిల్లాల్లో రైతుల స్థితిగతులు మెరుగుపడతాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రపంచానికి ఈ ప్రాంతం ఫ్రూట్ బౌల్ గా మారుతుంది. ఈ సందర్భంగానే ఇంకో ప్రతిష్టాత్మక సంస్థకు శంకుస్థాపన చేశారు. అదే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్నప్పుడు హైదరాబాద్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏర్పాటు చేసినట్టుగా, వ్యవసాయరంగ అభివ్రుద్ధి కోసం రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ను ఏర్పాటు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.