మన దేశంలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎక్కడో ఒకచోట ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందనే వార్త వినపడకుండా రోజు గడవటం లేదు. అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా జరుగుతున్న ప్రమాదాలను పరిశీలిస్తే ఆటోలు, లారీలు, ప్రైవేట్ బస్సులు ప్రధాన కారణం అవుతున్నాయి. మొన్నటికి మొన్న కోదాడలో జరిగిన భయంకరమైన ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.
అలాగే, ఈరోజు చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర ప్రమాదానికి ఆటో డ్రైవర్ తప్పిదమే కారణమని స్పష్టమవుతోంది. రోడ్లపై వెళ్లే వాహనదారులకు భద్రత లేకుండా పోతోంది. అసలు ఈ వరుస ప్రమాదాలకు కారణం డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడమా?, లేక మన దేశంలో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్‌లోని లొసుగులా..? అనే ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా చిక్కుకుంటున్న ఆటో డ్రైవర్ల పరిస్థితిని చూస్తే దారుణమైన నిజాలు కనిపిస్తాయి. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను గొర్రెల మందలా ఎక్కించడం వీరికి అలవాటుగా మారింది.
దీనికి తోడు, ఆటో నడిపే చాలా మంది డ్రైవర్లలో కనీస చదువు ఉండదు. చదువు లేకపోవడం ఒకెత్తయితే, వారికి ట్రాఫిక్ రూల్స్, రోడ్డు సిగ్నల్స్,సైన్ బోర్డుల మీద కనీస అవగాహన కూడా ఉండదు. ముఖ్యంగా నగరాల్లో, పట్టణాల్లో ఆటో డ్రైవర్లు అడ్డగోలుగా వాహనాలను తోలుతుంటారు. వెనుక ఏ వాహనం వస్తోందో కూడా చూడకుండా, ఇండికేటర్ వేయకుండా ప్యాసింజర్ కనబడగానే సడన్‌గా లెఫ్ట్కో, రైట్కో తిప్పేస్తుంటారు. ఆటో వెనుక వచ్చే బైకర్లు, కార్ల వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నేడు నగరాల్లో కనిపిస్తోంది.
ఇక హైవేలపై నడిచే లారీ డ్రైవర్లు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్ డ్రైవర్ల పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. లారీలను, బస్సులను నడిపే చాలా మందికి అసలు రోడ్డు నిబంధనలు ఏంటో తెలియదు. ఏ లేన్‌లో వెళ్లాలో తెలియదు. భారీ వాహనాలు ఎప్పుడూ ఎడమ వైపు లేన్‌లో వెళ్లాలనే కనీస రూల్‌ను కూడా వీరు పాటించరు. హైవేలపై వేగంగా వెళ్లే కార్లను ఓవర్టేక్ చేస్తూ, రైట్ లేన్‌ను బ్లాక్ చేస్తూ రాంగ్ రూట్లలో దూసుకుపోతుంటారు. రాత్రి వేళల్లో నిద్రమత్తులో, కొందరైతే మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ వందలాది మంది ప్రాణాలను బలితీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్లు నడిపేవాళ్లయితే మరీ ఘోరం. సింగిల్ లైట్ తో లోడ్ ట్రక్కుతో రావడం, గ్రామీణ రహదారుల మీద ఇష్టం వచ్చినట్టు తోలడం, హైవేల మీద రాంగ్ రూట్ లో రావడం పరిపాటిగా మారింది.
చదువు లేకపోవడం, రూల్స్ తెలియకపోవడం, అన్నింటికీ మించి బాధ్యతారాహిత్యం మన డ్రైవర్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే విషయమై విదేశాల డ్రైవింగ్ సిస్టమ్‌తో మన దేశాన్ని పోల్చి చూస్తే అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో అర్థమవుతుంది. అమెరికా, యూరప్ లేదా దుబాయ్ వంటి విదేశాల్లో డ్రైవింగ్ లైసెన్స్ సాధించడం అనేది అంత సాదాసీదా విషయం కాదు. అక్కడ లైసెన్స్ ఇవ్వడానికి కఠినమైన నిబంధనలు ఉంటాయి. డ్రైవింగ్ టెస్ట్‌కు ముందు ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రతపై ఆన్లైన్ థియరీ పరీక్షలు రాయాలి.
రూల్స్ అన్నీ వంద శాతం తెలిస్తేనే ప్రాక్టికల్ టెస్ట్‌కు అనుమతి ఇస్తారు. అక్కడ డ్రైవింగ్ టెస్ట్ చేసే అధికారులు చాలా కఠినంగా వ్యవహరిస్తారు. చిన్న తప్పు చేసినా లైసెన్స్ రిజెక్ట్ చేస్తారు. కానీ, మన దేశంలో పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలుసు. డబ్బులిస్తే చాలు, ఇంట్లో కూర్చున్నా సరే డ్రైవింగ్ లైసెన్స్ చేతికి వచ్చేసే దారుణమైన వ్యవస్థ మన ఆర్టీఓ ఆఫీసుల్లో నడుస్తోంది.
అందుకే మన దేశంలో కూడా విదేశాల తరహాలోనే డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో అత్యంత కఠినమైన నిబంధనలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనీస విద్యార్హతతో పాటు, ట్రాఫిక్ రూల్స్‌పై క్షుణ్ణంగా అవగాహన ఉంటేనే లైసెన్స్ ఇవ్వాలి. లంచాలకు తావులేకుండా ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాకులను వంద శాతం అమలు చేయాలి. ఒక డ్రైవర్ తప్పు చేస్తే లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసే చట్టాలు రావాలి. అప్పుడే రోడ్లపై తిరిగే డ్రైవర్లలో భయం, బాధ్యత పెరుగుతాయి. అమాయకుల ప్రాణాలు రక్షించబడతాయి.







