34 C
Vijayawada
Friday, April 26, 2024
Homeరాజ నీతివచ్చే ఎన్నికల్లో కులం పని చేస్తుందా ?

వచ్చే ఎన్నికల్లో కులం పని చేస్తుందా ?

ఒకడి బలం ఏంటో తెలియడానికి ఏళ్లకి ఏళ్లు పట్టొచ్చు. జీవిత కాలం కూడా సరిపోకపోవచ్చు కొన్నిసార్లు. అదే ఒకడి బలహీనత ఏంటో తెలుసుకోడానికి సరిగ్గా ఫోకస్ పెడితే అరగంట అయినా సరిపోవచ్చు చాలాసార్లు. ఏపీని ఇదే సైకాలజీతో కొట్టి, మన జనాభాకు కులపిచ్చి ఎక్కువ అని కొత్తగా ఇంకోసారి సర్టిఫికెట్ ఇచ్చాడు పీకే. కులాన్ని టాక్టికల్ అస్త్రంగా వాడాడు. నెగెటివ్ ఫోర్స్ గా ప్రయోగించాడు. ఫలానా వాడికి ఓటు వేయండి అని చెప్పడానికి కాదు, ఫలానా వాడికి ఓటు వేయొద్దు, వాడికి కులపిచ్చి అని ముద్ర వేడాయనికి వాడాడు. ఈ పరకమైన ప్రయోగం ఫస్ట్ టైమ్. క్లిక్ అయ్యింది. మరి ఇప్పుడు ఇంకోసారి కుల అస్త్రం పని చేసే స్కోప్ ఉందా ? కులం కోణంలో రాజకీయం నడిపేందుకు కొందరు మళ్లీ మాట్లాడుతున్నారిప్పుడు. కారణం ఏంటి ? కులం ఎఫెక్ట్ ఎంత ?

1989లో కుల ప్రయోగం గట్టిగా జరిగింది ఏపీలో ! ఎన్టీఆర్ ఓ కులానికే పక్షపాతం చూపించాడు, గెలిచే వరకూ సోదర సోదరీమణురాలా అన్నాడు. గెలిచాక – చౌదరి సోదరీ మణులారా అని మార్చాడు అని ప్రచారం లేచింది అప్పుడే. మొన్న అమరావతి సభలో రఘురామ క్రిష్ణం రాజు కోట్ చేసింది ఈ ఫ్రేజ్ నే. మళ్లీ అంతటి స్థాయిలో కుల కుంపటి రగిలింది 2019 ఎన్నికల్లోనే. తన వైపునకు ఆకర్షించడానికి కాదు, ఎదుటి వైపు మళ్లకుండా ఉండటం కోసం పీకే వాటంగా వదిలిన బాణం కులం కోణం. ఆయన కులం వాళ్లకే ప్రమోషన్లు, ఆయన కులం వాళ్ల కోసమే రాజధాని, ఆయన కులం వాళ్లే బాగుపడిపోతున్నారు అనే ముద్రలు గుద్ది – సింగిల్ చేయడంలో సక్సెస్ అయ్యింది ఆ వ్యూహం. అలా సక్సెస్ కావడానికి ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయ్. అదీ అసలు తెలుసుకోవాల్సిన పాయింట్.

కులం అనేది కిళ్లీ లాంటిది. కడుపు నిండిన తర్వాత కాలక్షేపం కోసం వేసుకుంటాం. తిన్నది అరగడానికి వాడతాం. అంతే కానీ కడుపు నిండటం కోసం తినం. మనం సుబ్బరంగా తిని అరుగు మీదకెక్కి అరిగే వరకూ వాగుతున్నప్పుడు వస్తుంది కులం. అంతే కానీ మనం కష్టపడి, కూడు కోసం గిలగిల్లాడుతున్నప్పుడు కులం చూడం. ఫలానా కులం వాడు డబ్బులిస్తే తీసుకుందాం అని కూలీ అనుకోడు. ఫలానా కులం వాడితోనే బేరం చేస్తా అని వ్యాపారస్తుడు బిగుసుకోడు. ఫలానా కులం వాడినే బండి ఎక్కించుకుంటా అని డ్రైవర్ బోర్డు పెట్టుకోడు. ఎవడిది ఏ కులం అయినా ముందు పని జరగాలి అని మాత్రమే చూస్తారు. పని జరిగాక కాలక్షేపం వరసలో కులం వస్తే వస్తది. ఏపీ లాంటి చోట్ల అయితే కంపల్సరీ వస్తది. అలాగని కులం కోసం మాత్రమే బతికే బాపతు కాదు మన జనం. ఏవడో చేసిన పనికి కులం రంగు వేస్తాడంతే ! నాసామి రంగా, దాన్ని పట్టుకొని కొందరు ఊరేగుతారు తరతరాలూ. సరిగ్గా ఇక్కడే ఉంది అసలు పాయింట్. అంటే – కడుపు నిండిన చోట ఉంటుంది కులం. కడుపు మండిన చోట కాదు.

మనుగడే ప్రధానం అయినప్పుడు కులం లేదు. పాత రాతి యుగం నుంచి కనిపించే బహిరంగ వాస్తవం ఇది. కాస్త బతుకు మీద భరోసా వచ్చి, ఇక చేయడానికి పోరాటం ఏదీ లేదనుకున్నప్పుడు కులం లాంటివి పుడతాయ్. ఆల్రెడీ రాజధాని ఏదో కడతానంటున్నాడు. కొద్దో గొప్పో పరిశ్రమలు వచ్చాయ్. కార్ల ఇండస్ట్రీ కూడా వచ్చిందట. వోక్సువాగన్ లాంటి టోకరాలు చూశాం కానీ కియా లాంటివి రావడాలు చూడ్డం ఇదే ఫస్ట్ టైమ్. జీతాలకి, గోతాలకి ఢోకా లేదు, పైగా పండక్కి తాయిలాలు కూడా ఇస్తున్నాడు అంటే పరిస్థితి బాగానే ఉందన్న మాట అనుకున్నది జనం మైండ్ సెట్. 2019కి ముందు. అందుకే కులం బలంగా పని చేసింది. అంటే, చేయడానికి పని ఉందా చేతిలో ? లెక్కెట్టుకోడానికి పైసలు ఉన్నాయా జేబులో ? చేయడానికి వ్యాపారం ఉందా ? చదవడానికి, చదివించడానికి బడి చక్కగా ఉందా ? తినడానికి తిండి దొరుకుతోందా ? నచ్చినట్టు బతకడానికి భయం లేని స్కోపు ఉందా ? నా బుజ్జి బొజ్జకు శ్రీరామ రక్ష అని ఎవరికి వాళ్లు కులాసాగా మనగలిగే పరిస్థితి ఉందా ? – ఇలా ఉంటే కనుక కులం పనిచేస్తది. లేదూ, అభద్రత, ఆందోళన, అనిశ్చితి, అయోమయం, అగమ్యగోచరంగా ఉంటే మాత్రం… కులం కాదు, దాని అమ్మమ్మ కూడా పని చేయదు. ఇది ఖాయం.

విషయం ఏంటంటే ఎన్నికలు, రాజకీయం అనేవి ఇప్పుడు ఏం జరిగింది, ఏం చేశాం అనే దాని కన్నా ఏం చెప్పాం, ఎలా నమ్మించాం అనేదాన్ని బట్టీనే జరుగుతున్నాయ్. మాస్ మెకానిజం ఇది. ఈ పబ్లిక్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ లో వాడే ఎమోషనల్ వెపన్ ఏదైనా దీపావళి టపాసు లాంటిది. ఓసారి పేలిన తర్వాతో, వత్తి కాలి చీదేసిన తర్వాతో ఇక మళ్లీ అది పనికి రాదు. మళ్లీ మళ్లీ అదే పేల్చాలనుకుంటే చేతులు కాలతాయ్ అంతే ! ఏపీలో కుల అస్త్రం కూడా అంతే !

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments