వచ్చాడు
గెలిచాడు
అనిపించేవాళ్లు ఎంతమందైనా ఉండొచ్చు !
కానీ
గెలిచి
నిలిచి
నిరంతరం తలిచేలా చేసేవాడిని,
చరిత్ర సృష్టించిన వాడిని చంద్రబాబు నాయుడు అంటారేమో !
కాలం మారినా…
రాష్ట్రం విడిపోయినా…
ఇప్పటికీ, ఎప్పటికీ
తెలుగు నేల మీద
శిలాక్షరాలతో
నిలువెత్తున కనిపించే పేరు…
నారా చంద్రబాబు నాయుడు.
కాలం కలిసివస్తే అధికారంలోకి ఎరైనా రావొచ్చు. కానీ తానొస్తే అభివృద్ధి కాలం వస్తుంది అని ముద్ర వేసిన అతి కొద్ది మంది నాయకుల్లో చంద్రబాబు అగ్రగణ్యుడు. నిస్సంకోచంగా ఇలా చెప్పడానికి కారణాలు అనేకం. పరిపాలన అంటే కేవలం ప్రభుత్వాన్ని నడపడమే కాదు జాతిని భవిష్యత్తు వైపు నడిపించడం కుడా – అని నిరూపించిన అతి కొద్ది మంది ఆధునిక పొలిటీషియన్లలో చంద్రబాబుది ముందు పేరు.
నిజానికి లీడర్ పేరు చెప్పగానే పార్టీ గుర్తొచ్చే నాయకులు చాలా మందే ఉంటారు. బహుశా పేరు చెప్పగానే డెవలప్ మెంట్ గుర్తొచ్చే నాయకుడు దేశ చరిత్రలోనే చంద్రబాబు ఒక్కడేనేమో. అందుకే అంత స్పెషల్ !
ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లలో చంద్రబాబు సాధించిన ఘనతలు, తెచ్చిపెట్టిన సంస్థలు, హైదరాబాద్ కి తీర్చిదిద్దిన హంగులే ఇప్పుడు ప్రపంచస్థాయిలో జిగేల్ మనడం చూస్తుంటే … ఏజ్ లెస్ విజన్ అంటే ఎలా ఉంటుందో అర్థమవుతుంది. గెలిచే వరకూ రాజకీయం చేస్తా, గెలిచాక అభివృద్ధి మాత్రమే చేస్తా అంటూ ఓ నాయకుడు ప్రకటించగా దేశం మొత్తం ఆశ్చర్యంతో వినడం అదే మొదటిసారి. దాహం వేశాక బావి తవ్వినట్టుగా నడుస్తున్న రాజకీయాన్ని భావి తరాల కోసం, రేపటి అవకాశాలు అందిపుచ్చుకోవడం కోసం ఇవాళే అడుగులు వేసేలా తీర్చిదిద్దిన తీరు చంద్రబాబుని విలక్షణ విజనరీని చేసింది. ప్రత్యేకమైన నాయకుడిగా నిలిపింది.
పనితీరే చంద్రబాబు నిబద్ధతకు కొలబద్ద. అవకాశాలకు వేదిక లాంటి హైటెక్స్ ను నిర్మిస్తున్నప్పుడు అడ్డుపడినవాళ్లూ, తప్పుపట్టినవాళ్లూ ఎంతో మంది ! మనకి ఇలాంటి కట్టడాలు అవసరమా – అని ప్రశ్నించారని ఆగిపోలేదు చంద్రబాబు. రేపటిని నిన్నే ఊహించి, ఇవాళే సిద్ధం కావడం తన నైజం కాబట్టే భారీ నిర్మాణాలకు బాటలు వేశాడు. హైదారాబాద్ లో ఇప్పటికీ అంతర్జాతీయ స్థాయి వేడుకలకు వేదిక హైటెక్సే ! ఇది పాతికేళ్ల నాడు చంద్రబాబు ఊహించిన భవిష్యత్తు.
కరోనాతో ఊపిరి అందక దేశం అల్లాడుతున్న సమయంలో ఆదుకున్నది భారత్ బయోటెక్ అయితే… ఆ ఆలోచననకు మూలం మాత్రం ముమ్మాటికీ చంద్రబాబే ! పాతికేళ్లనాడు జీనోమ్ వేలీ పేరుతో జీవ రసాయన పరిశోధనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పినపుడు అర్థమైనవాళ్ల కన్నా – ఆశ్చర్యపోయినోళ్లే ఎక్కువ. న్యాయ విద్యలో దేశంలోనే ఇపుడు టాప్ మోస్ట్ లో ఒకటి అని చెప్పుకునే నల్సార్ ని నిలబెట్టిందీ, బెంగళూరు పోటీని దాటి హైద్రాబాద్ గట్టున ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ను ప్రతీష్టించింది కూడా చంద్రబాబు చొరవే !
దేశంలో పునాది పడిన తొలి భారీ ప్రైవేటు ఏర్ పోర్ట్ శంషాబాద్. కలలు కళ్ల ముందుకు రావాలంటే ఆలోచనలకు రెక్కలు మొలవాలంటే – పెట్టుబడుల్లేక అడుగులు ఆగిపోకూడదు. అందుకే ప్రైవేటుకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ చంద్రబాబు ఢిల్లీలో చేసిన ప్రయత్నంతోనే శంషాబాద్ బిడ్ మొదలైంది. ఇండిపెండెంట్ రింగ్ రోడ్ ఉన్న తొలి భారత నగరంగా హైదరాబాద్ చరిత్ర సృష్టించడం వెనకా ఒక్కడి కృషే ఉంది.
నవాబుల నాగరికతకు నమూనా లాంటి హైదరాబాద్ లో ఆధునిక జమానాను అందలం ఎక్కించాలంటే కొత్త నగర నిర్మాణమే మార్గమంటూ వేసిన అడుగులతోనే సైబరాబాద్ మొలిచింది. సైబర్ టవర్స్ సిటీకే ఐకానిక్ సింబల్ అయ్యింది. కళ్లు చెదిరే కాంతులతో ఇప్పుడు విశ్వనగరం అంటే ఇలాగే ఉంటుందా అనిపించే స్థాయిలో నిలిచింది. ఇది 1999 తర్వాత సాకారమైన అద్భుతం.
ఇదంతా కేవలం తొమ్మిదంటే తొమ్మిదేళ్లలో సృష్టించిన చరిత్ర. ఇన్ని నిర్మాణాలు, ప్రఖ్యాత సంస్థలు, అన్నిటికీ మించి ఇంతటి ప్రపంచ ఖ్యాతీ అంత తక్కువ సమయంలో సాధించిన మరో నగరం ఈ దేశంలో లేదు.
చెప్పాలంటే, ఇవన్నీ తెచ్చి పెట్టూ అని ఎవ్వరూ చంద్రబాబును అడిగి ఉండరు. ఇవన్నీ తెచ్చినందుకు ఓట్లు పడతాయని కూడా ఆయన అనుకొని ఉండడు. నాకు ఓడినందుకు బాధలేదు, హైదరాబాద్ ను చూస్తే ఆనందం తప్ప – అని చంద్రబాబు చెబుతున్నప్పుడు వాత్సల్యం కనిపిస్తుంది. వాస్తవం అనిపిస్తుంది.
ఇలాంటివి చూసినప్పుడే జ్ఞాపకాలు కళ్ల ముందు కదలాడుతాయ్. చంద్రబాబు పని తీరును కీర్తిస్తూ – అన్నమాట తప్పడూ చంద్రబాబు నాయుడూ… ఆయనకే ఓటేద్దాం అందరమూ ఇప్పుడూ… అని కేసీఆర్ స్వయంగా రాసిన పాట గుర్తొస్తుంది. అదీ ప్రతీ తెలుగు హృదయంపై చంద్రబాబు ముద్ర !
కాలం కన్నా ముందు కెళ్లి ఆలోచించాడు కాబట్టే, రాబోయే సవాళ్లకి ముందుగానే జవాబులు సిద్ధం చేశాడు కాబట్టే బాబు పాలన డెవలప్ మెంట్ కి డిక్షనరీ అయ్యింది. చంద్రబాబు తర్వాత నలుగురు ముఖ్యమంత్రులు మారి ఉండొచ్చు. కానీ చంద్రబాబులా చరిత్ర సృష్ఠించినవాళ్లు ఎందరంటే సమాధానం చెప్పడం సులభం కాదు ! 294 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రాన్ని ఏలిన చంద్రబాబు 175 సీట్లతో మిగిలిన ఏపీకే పరిమితం అయి ఉండొచ్చు. కాల క్రమంలో గెలుపుతో సమంగా ఓటములనూ స్వీకరించి ఉండొచ్చు. కానీ తెలుగు నేలన అభివృద్ధి అధ్యాయాన్ని రాసిన పనితనం, తెలుగువాళ్లకి ఆధునికత అందించిన చరిత, హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దిన ఘనత మాత్రం ఎప్పటికీ చంద్రబాబును గుర్తుచేస్తూనే ఉంటాయ్. చరిత్రలో నిలువెత్తు వాస్తవంలా, ఆధునిక పురుషుడిగా నిలబెడుతూనే ఉంటాయ్.
హైదరాబాద్ కి సొగసులు అద్దినట్టే అంతర్జాతీయ హంగులు దిద్దినట్టే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ను పట్టాలు ఎక్కించేందుకు ప్రయాసపడిన చంద్రబాబు… గమ్యానికి సుదూరంలోనే నిలిచిపోవడం నడుస్తున్న చరిత్ర. నా రోజు వచ్చినప్పుడు వస్తా… నా రాష్ట్రానికి మంచి రోజులు తెస్తా అంటూ ఇప్పటికీ చిద్విలాసంగా చెప్పే బాబు… అభీ పిక్చర్ బాకీ హై అంటున్నాడు. ఐయామ్ డౌన్… బట్ నాటౌట్ అనే చంద్రబాబు స్పిరిట్ ఇప్పుడు ఏపీలో కొత్త పోరాటానికి రంగం సిద్ధం చేస్తోంది. బహుశా అది మరో కొత్త ఆధ్యాయం అవుతుందేమో భవిష్యత్తే చెప్పాలి !
Watch Video:
In depth analysis