28.2 C
Vijayawada
Sunday, June 16, 2024
Homeరాజ నీతిచరిత్రలో చంద్రబాబు స్థానం ఎక్కడ ?

చరిత్రలో చంద్రబాబు స్థానం ఎక్కడ ?

ఎక్కడో ఊరు చివర, రాళ్ల మధ్యలో చుట్టు గుంటలా అదేదో కడుతున్నారు. గబ్బిలాలు పడుకుంటాయ్ అందులో ! ఈ మాత్రం దానికి ఏదేదో చెబుతున్నారు. ఇతను ఏం సాధించలేడు – హైటెక్ సిటీ కడుతున్నప్పుడు చూసి ఓ మాజీ ముఖ్యమంత్రి చేసిన కామెంట్ ఇది. సరిగ్గా ఐదేళ్లు తిరిగే లోపే హైదరాబాద్ దేశంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ అయ్యింది. సాఫ్టువేర్ లో ప్రపంచానికి డెస్టినేషన్ గా అవతరించింది. బాబు ఆలోచనలు ఎలా ఉంటాయో, నాదెండ్ల లాంటి ప్రత్యర్థుల ప్రచారాలు ఎంత విషతుల్యమో చెప్పే చిటికెడంత ఎగ్జాంపుల్ ఇది. ఇదొక్కటే కాదు, ప్రతీ నిర్ణయంలోనూ, భవిష్యత్ ను ఓ పది ఇరవై ఏళ్లు ముందుగానే ఊహించి వేసే ప్రతీ అడుగులోనూ చంద్రబాబుకు ఎదురుదెబ్బలే ఎదురొస్తాయ్. చెత్త ప్రచారాలే బహుమానం అవుతాయ్. సైబరాబాద్ నుంచి అమరావతి వరకూ ఇదే వరస. ఇంతకీ చరిత్ర ఎలా చూస్తుంది చంద్రబాబును ?

అనవసరంగా దెబ్బలు తింటూ ఉండేవాళ్లని చూసి, వీడికి దెబ్బల సుడి ఉందిరా అంటుంటారు మన ఊళ్లలో. అలాగే దుష్ట ప్రచారాలు ఎదుర్కొవాల్సిన సుడి ఏదో చంద్రబాబుకి ఉన్నట్టుంది జాతకంలో ! లేకపోతే మరేంటి ! బిల్ గేట్స్ లాంటి వాడు ప్రత్యేకంగా విశాఖ వచ్చి చంద్రబాబు ఈజ్ మై గుడ్ ఫ్రెండ్, హి ఈజ్ విజనరీ, తొలి అడుగులు వేస్తున్న విభజిత ఏపీ సేఫ్ హ్యాండ్స్ లో ఉంది అంటాడు. చంద్రబాబు ఆలోచనలు నన్ను ప్రభావితం చేశాయ్ అని మైక్రోసాఫ్ట్ నడిపిస్తున్న సత్య నాదెళ్ల చెబుతాడు. బాబు ఆర్థిక పాలసీలు, నిర్ణయాలు సరళీకరణ శకంలో మైలురాళ్లు అని ఢిల్లీ యూనివర్సిటీ ఆర్థశాస్త్ర పాఠాలు చెబుతుంది. ఇచ్చిన హామీల్లో రికార్డు స్థాయిలో 89 శాతం నెరవేర్చాడు చంద్రబాబు అని పక్క రాష్ట్రాలు కేస్ స్టడీగా తీసుకుంటాయ్. మనకి మాత్రం ఇలాంటి ప్రత్యేకతలు ఎప్పుడోగానీ అర్థం కావు. వీటికన్నా కుల ముద్రలు, పింక్ డైమండ్ ప్రచారాలు ఆకర్షణీయంగా కనిపిస్తాయ్ మనకి. ఎందుకంటే చంద్రబాబు విధానాలు సత్య నాదెళ్లలా ఉంటే, మన ఆలోచనలు ఆ నాటి నాదెండ్ల మాటల్లా ఉంటాయ్.

సైబరాబాద్ కి పునాదులు వేస్తున్నప్పుడు చేయని ఆరోపణలు లేవు. హైదారాబాద్ రోడ్లు విశాలం చేసి ప్లైఓవర్లు వేస్తున్నప్పుడు వేయని అడ్డుపుల్లలు లేవు. శంషాబాద్ లాంటి విమానాశ్రయం కావాలి అని బ్లూ ప్రింట్ రెడీ చేసిన రోజుల్లో భూముల మీద కన్నేశాడు అన్నారు కొందరు. రింగు రోడ్డు కావాలి అని చెప్పినపుడు అదెందుకో అర్థం కాలేదు చాలా మందికి. ఇప్పుడు అవన్నీ వర్తమానంలో వాస్తవాలు. రెండు దశాబ్దాల ముందే చంద్రబాబు ఊహించిన భవిష్యత్తు. అమరావతి కట్టాలన్నప్పుడు, అతి పెద్ద ఆధునిక నగరం ఆంధ్రజాతికి కావాలన్నప్పుడు విష ప్రచారాలు చేసి కుల రాజకీయాలకు తెర తీయడం కూడా అచ్చం అలాంటిదే ! పారిశ్రామిక హబ్ రాయలసీమ, ఫైనాన్షియల్ కేపిటల్ విశాఖ, సర్వీస్ సెక్టర్ కి ఆయువు పట్టు కోస్తా జిల్లాలు అని చెప్పినప్పుడు వాస్తవాలు జనం తెలుసుకునే లోపే విషం చిమ్మేసింది కుటిల రాజకీయం. చంద్రబాబు ప్రయత్నం మొదలు పెట్టిన ప్రతీసారీ దుష్ట సైంధవుల పన్నాగాలు సాగుతూనే ఉన్నాయ్. అలాగని ఆగిపోయే మనస్తత్వం చంద్రబాబుది కాదు కాబట్టి సరిపోతోంది. ఇవాళ కాకపోతే రేవు అయినా రాత మారుస్తా అంటున్నాడు. మళ్లీ గెలిచి వస్తా అని సవాల్ చేసి అంటున్నది అందుకే ! చంద్రబాబు నిర్ణయాల ప్రభావం ఎలా ఉంటుంది, చరిత్ర చంద్రబాబును ఎలా చూస్తుంది అని ఆలోచించాల్సింది కూడా ఇందుకే !

తాను జస్ట్ ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అనే సంగతి కూడా మరిచిపోతాడు. తన హోదా ఉన్న వాళ్లు దేశంలో మరో 28 మంది ఉంటారు. వారందరిలా తాను ఉండాలనుకోడు. ప్రపంచ గతులు, గమనం గురించి ఆలోచిస్తాడు. ట్రెండ్స్, టెక్నాలజీ, ఇన్వెస్ట్ మెంట్ ఐడియాలజీ అంటూ ఏవేవో మాట్లాడతాడు. దావోస్ లాంటి చోట్ల కూడా దుకాణాలు పెడతాడు. దేశ విదేశాల్నీ ఒప్పించి మెప్పించి రా రమ్మంటాడు. అందుకే ఆయన ఎట్రాక్ట్ చేస్తే మేం చేసినట్టే. ఆయన పెట్టుబడులు సాధించాడూ అంటే మేం సాధించినట్టే కదా, అందుకే నేను ఇడ్లీని ఆస్వాదిస్తున్నా అని అరుణ్ జైట్లీ లాంటి మేధావి సరదాగా చెప్పిన సందర్భాలు ఉన్నాయ్. ఇలాంటప్పుడే అనిపిస్తుంది. తెలుగు దేశానికి అధినేత అయ్యాడు కాబట్టి సరిపోయింది, ఈ దేశానికి నాయకుడు అయ్యుంటే ఇంకేం చేసేవాడో అని.

ఈ చంద్రబాబు నాయుడు ఎవరండి, హైటెక్ సిటీ కట్టాను అంటాడు. చరిత్ర చూడండి వాస్తవాలు తెలుస్తాయ్, అసలు హైటెక్ సిటీ కట్టింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో అంటాడు కేసీఆర్. దేంతో నవ్వాలో అర్థం కాదు ఇలాంటప్పుడు. ఈ లెక్కన పోలవరం ప్రాజెక్టుకు మొదటిసారి శంకుస్థాపన చేసింది టంగుటూరి అంజయ్య. 1980లో. అందుకని, రేపు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పోలవరం కట్టి చూపించాడు అనుకోండి – నాటి అంజయ్య కట్టాడూ అని ప్రచారం చేయొచ్చా ? చెప్పొచ్చా ? అలా ఉంటాయ్ కొందరి వాదనలు. కేసీఆర్ లాంటి వాళ్లకి మన జనం అవగాహన మీద, అజ్ఞానం మీదా అపారమైన నమ్మకం. అందుకే అలవోకగా అడ్డగోలుగా వాదిస్తారు. పిచ్చి ప్రచారాలతో ప్రేలాపనలతో చరిత్ర చెరిగిపోతుందని భావిస్తారు. తాళి దాచేస్తే పెళ్లి ఆగదు. పంచాంగం పోతే జాతకం పోయినట్టు కాదు. అలాగే చంద్రబాబు గురించి ఎవడెవరో ఏదేదో వాగుతున్నారూ అంటే – చంద్రబాబుపై బురద పడుతుంది అనుకోనక్కర్లేదేమో ! విషయం ఉన్నోడే ఇలాంటి విషాన్ని తట్టుకొని నిలబడగలడు. అందుకే చంద్రబాబు నిలుస్తాడు. గెలుస్తాడు.

ఇంత మాట్లాడుకున్నాక ఇక అర్థం అయ్యేది ఇదే. ప్రాజెక్టుల పేరు చెప్పి, కాలువలు తవ్వినట్టు నటించి వేల కోట్లు కొట్టేసినవాడినే రైతు బాంధవుడన్న జాతి మనది. అలాంటిది, తరతరాల రాత మార్చి, అమెరికాతో ఆంధ్ర దేశానికి బలమైన బంధం కలిపి, అవకాశాల తలుపు తెరిచిన చంద్రబాబును ఇంకేం అనాలి ? ఎప్పుడైనా ఆలోచించామా ? ఫైనల్ గా ఒకటి మర్చిపోకూడదు. ఎలాగోలా బతికేసినవాళ్లు చరిత్రకు గుర్తుండరు. ఎలా బతకాలో చూపించినవాడే ఎల్ల కాలం గుర్తుంటాడు. అందుకే చంద్రబాబుది చరిత్రలో చిరస్థాయి. చరిత్రను చెరపాలి అనుకున్నవాళ్లని చరిత్రే తుడిచి పెడుతుంది అనేది చారిత్రక వాస్తవం. ఎందుకంటే భవిష్యత్ కి తెలియాల్సింది వాస్తవాలు. కొందరి గుల గోల కాదు.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments