28.2 C
Vijayawada
Sunday, June 16, 2024
Homeరాజ నీతిటీడీపీకి అసలు కీడు చేసే బ్యాచ్ ఇదే !

టీడీపీకి అసలు కీడు చేసే బ్యాచ్ ఇదే !

శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్లు, కూతుళ్ల రూపంలో మారు వేషాలు వేసుకొని మన మధ్యే తిరుగుతుంటారు – అంటాడు రావు రమేశ్. ఇది సరదాగా అన్నమాటే అయినా కొన్ని వాస్తవాలు ఇంచుమించు ఇలాగే ఉంటాయ్. టీడీపీ విషయంలో కూడా అంతే ! ప్రశాంత్ కిశోర్ పికేశాడు అనో, జగన్ దెబ్బ కొట్టాడు అనో, పవన్ కల్యాణ్ ఓట్లు చీర్చాడు అనో అనుకునే ముందు, అసలు ఉతుకు ఇంటి నుంచి మొదలు పెడితే ఊరు మురికి గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. అమరావతి పాదయాత్ర జరుగుతున్న సమయంలో పేలుతున్న కుల తపంచాలు చూశాక చెప్పాలనిపించింది.

నాయకుణ్ని పొగుడుతూ నిరంతరం పోస్టులు వీళ్లే పెడతారు. బరువు తగ్గడం కూడా ఓ నాయకత్వ లక్షణమే అని వీళ్లు భావిస్తారు. గడ్డం పెంచడం హీరోయిజం అని నమ్ముతారు. దిక్కులు పిక్కటిల్లి పోయేలా ప్రకటన చేశాడు, వార్నింగ్ ఇచ్చేశాడు అంటారు. తండ్రి వైపు తాతను కంఫర్టబుల్ గా వదిలేసి, తల్లి వైపు తాతతో మనవణ్ని పోలుస్తారు. ఎందుకంటే ఆయన సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ హీరో కాబట్టి. అంటే వాస్తవాల్ని కూడా తమకి అనుకూలంగా మార్చుకునే అవకాశ వాదం చూస్తున్న వాళ్లకి చికాకు తెప్పిస్తుంటుంది. అయినా వీళ్లు పట్టించుకోరు. సొంత లాభం ముఖ్యం మరి. పార్టీ నాయకత్వ భజన తర్వాత రాష్ట్ర భవిష్యత్ అయిన రాజధాని మీద పడతారు. అమరావతికి అనుకూలంగా పదే పదే పోస్టులు కుమ్మరిస్తారు. అహో ఒహో అంటూనే ఉంటారు. ఉండవల్లి లాంటి వాళ్లు విశ్లేషణ చేస్తే కులం పేరుతో తిట్టి, తప్పుపడతారు. అదంటేంటే వైఎస్ అనుయాయుడు కదా ఆయన అంటారు. అయితే మాత్రం విషయం మాట్లాడకూడదా ? టీడీపీలో వెలగబెట్టిన వాళ్లు వైసీపీలో ఎందరు లేరు ? వైసీపీలోంచి వచ్చి నేరుగా టీడీపీలో మంత్రులు అయినవాళ్ల లెక్క మర్చిపోయారా ? వాళ్లకెవరికీ వర్తించని కొలతలు ఉండవల్లికే ఎందుకు ? ఎందుకంటే ఆయన చెప్పే లాజిక్కు మనకి నచ్చదు. నష్టం, పైగా తిప్పికొట్టడం కష్టం కాబట్టేనా ? ఇవన్నీ ఓపెన్ గా అర్థం అయిపోతూ ఉంటాయ్. ఏపీ రాజకీయాలతో పరిస్థితులతో సంబంధం లేని వాటిని కూడా వాల్ మీదకి తెచ్చి టీడీపీ భావజానాలకి విరుద్ధమైన చర్చ చేస్తారు. మోహన్ బాబు లాంటి వాళ్లకి సపోర్టు చేస్తారు. ప్రకాశ్ రాజ్ ఏ కులమో తెలియదు. కానీ మోహన్ బాబుది తెలుసు కాబట్టి వీళ్లు కన్వీనియెంట్ గా ఆ లైన్ తీసుకుంటారు. అదేంటి అంటే సినిమా అభిమానులుగా చెబుతున్నాం, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిగత అభిప్రాయం ఇది అంటారు. రాజకీయాల్లో వ్యక్తిగతం ఉంటుందా, ఉంటే మాత్రం వదులుతారా ? అయినా ప్రకాశ్ రాజ్ నచ్చని.. మంచు విష్ణు నచ్చే సినిమా అభిమానులు ఉంటారన్నది ఈ మధ్యే తెలిసిన వాస్తవం. అదో డిఫరెంట్ స్టాండర్డు. సోషల్ మీడియాలోనే కాదు మీడియాలో కూడా ఇదే వర్గం, ట్రెండు కంటిన్యూ అవుతుంది. పార్టీ తరపున అడ్డంగా వెనకేసుకొచ్చే ఛానళ్లు అవే అయి ఉంటాయ్, ఆఖరుకు అందులో చర్చలు నడిపించేది కూడా వాళ్లే అయినప్పుడు చదువుకున్నవాళ్లలో, ఆలోచన ఉన్నవాళ్లలో దగ్గరితనం, నమ్మకం ఎలా వస్తుంది ? అందుకే న్యూట్రల్ గా ఉన్నవాళ్లు టీడీపీ వైపు మొగ్గడానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. మనం ఒకవేళ అటు వెళ్లినా ఏలియన్సులా ఉంటామేమో, అంతా వాళ్లే కదా అనుకుంటారు. ఈ పాయింటు అర్థం కాకే టీడీపీ ఎదుటివాడిపై వ్యతిరేకతను నమ్ముకుంటోంది. తన బలాన్ని నమ్మలేకపోతోంది.

పైపెచ్చు వీళ్లు, ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయాన్నీ తప్పు పడుతూనే ఉంటారు. మంచి చెడ్డల చర్చ పెట్టరు. మనం అప్పొజిషన్ కాబట్టి వాణ్ని తిట్టిపోసి పైనున్న వాళ్ల దృష్టిలో పడిపోవాలన్నదే వీళ్ల తక్షణ కర్తవ్యం. టెక్నికల్ గా చాలా మందికి అర్థం కాని పాయింటు ఒకటుంది. నేరుగా వీళ్లు పార్టీలో చిన్నా, పెద్దా పదవుల్లో ఉండరు. నేరుగా పార్టీ నిర్ణయాల్ని ప్రభావితమూ చేయలేరు. కానీ ఇలా బాకా ఊదడానికి వాళ్ల కారణాలు వాళ్లకి చాలా క్లియర్ గా ఉంటాయ్. ఇవాళ కాకపోతే రేపు అయినా అధికారంలోకి వస్తే, పనులు జరగాలి, సబ్ కాంట్రాక్టులు పట్టుకోవాలి. సాధ్యమైనంత పిండుకోవాలన్నదే టార్గెట్. కానీవ్వండి… మీకేంటి ? అంటారా. ఎస్. ఇక్కడే ఉంది అసలు పాయింటు. ఇలాంటి వాళ్ల తోకలు, ఇంటి పేర్లు చూశాక, వాళ్లు పెట్టే పోస్టులకి సంబంధించిన అసలు సబ్జెక్టు ఉంటుంది చూశారూ, దాని మీద సానుకూల దృక్పథం పోతుంది సామాన్యుడికి. అహా, ఈ వర్గం వాళ్లు మాత్రమే దీనికి సపోర్టు అనమాట అనే ముద్ర అంతరాళాల్లో పడిపోతుంది. పై పెచ్చు అధికారంలో ఉన్న రోజుల్లో వాళ్లు లాభపడటం కళ్లారా చూస్తారు చుట్టూ ఉన్నవాళ్లు. ఇక అది రాజముద్ర అన్నట్టే. అక్కడే వ్యతిరేకతకు బీజం పడుతుంది. ఇలా వ్యతిరేకత వచ్చినంత మాత్రాన ఈ సోషల్ మీడియా బ్యాచ్ కేమీ నష్టం లేదు. అసలు ఇబ్బంది టీడీపీకే ! ఎలాగంటే, రావాల్సినంత మైలేజీ రాదు. అవతల వాళ్ల విధానాలు చూసి విసుగెత్తిపోయిన వాళ్లు కూడా వెయిట్ అండ్ సీ అనుకుంటారు. వీళ్లు మాత్రం తక్కువా అని వాదిస్తారు. ఒక వేళ పొత్తుల వల్లో, మరో కారణంతోనో తాత్కాలికంగా ఓటు వేయాల్సి వచ్చినా వీళ్లెప్పటికీ టీడీపీ బేస్ ఓటరు కావడానికి ఇష్టపడరు. ఎందుకంటే మధ్యలో ఉన్న ఈ రచ్చగాళ్ల వల్ల. దీర్ఘకాలంలో నష్టం కంటిన్యూ అవుతూనే ఉంటుంది.

చాలా మందికి రోషం వచ్చేస్తది మాట్లాడితే ! వాళ్ల గురించి ఎందుకు అనరండీ, వాళ్లని ఎందుకు తప్ప పట్టరు ? 650 నామినేటెడ్ పోస్టుల్లో మూడొంతులు రెడ్లకే ఇచ్చాడు కదా అని గింజుకునే బాపతు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. వాళ్లు అలాగే ఉన్నారు. ఉంటారు. ఆ మాట ఓపెన్ గా చెబుతారు. ఒప్పిస్తారో మెప్పిస్తారో భయపెడతారో మొత్తానికి అనుకున్నది సాధించుకుంటారు. దటీజ్ ఆల్ క్లియర్. పైగా ప్రత్యర్థివైపు ఉండే వర్గాలు ఎప్పుడూ టీడీపీ వైపు వచ్చే అవకాశం లేనివే ! అదే వాళ్ల బలం. పైగా మేం అందరికీ న్యాయం చేస్తామని చెబుతారే కానీ మీరే మా బలం, కళ్లూ ముుక్కూ చెవులు అని ప్రకటనలు చేయరు. ఈలోచించేవాళ్లకి ఈ తేడా సులభంగా అర్థం అయిపోతుంది. ఆ క్లారిటీ అటువైపు ఉంటుంది. మరి మీ వైపున ఉన్నదేంటి ? సామాజిక న్యాయం అంతా ఇటువైపే కదా ఉన్నది అంటారా ! ఆ మాట మనం అనుకొని సంతృప్తి పడితే సరిపోదు. మనం ఇచ్చే నామ్ కే వాస్తే పదవుల లెక్క తీస్తే చాలదు, అది కూడా అప్పోజిషన్ లో ఉండగా ఇచ్చినవి. ఇలాంటప్పుడు ఆయాసం, ప్రయాస తప్ప ఒరిగేదేమీ ఉండదు. అధికారంలో ఉండగా ఎంత మంది బలహీన వర్గాలు పైకొచ్చాయన్నది పాయింటు. ఆ లెక్కలు ఎక్కడా కనపడవ్ అంటేనే అర్థం చేసుకోవచ్చు వాస్తవం ఏంటో ! ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, టీడీపీ అధికారంలో ఉండగా క్రిష్ణా జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండేవారు. ఒకరు మనోడే. ఇతని దగ్గర సహాయకుడుగా పనిచేసిన ఆయన రెండోవాడు. జిల్లాలో ఏ పని జరిగినా, ఏ కార్యక్రమం ఉన్నా మొదటి మంత్రికి వచ్చిన ప్రయారిటీ రెండో మంత్రికి వచ్చిన దాఖలా లేదు. సింపుల్.

అయినా పార్టీ అంటేనే మహా సముద్రం. ఇలాంటి వాళ్లవి వ్యక్తిగత వ్యవహారాలు. కానీ కొందరు బాగుపడినంత మాత్రాన తప్పుపడతారా అంటారేమో ! పట్టాలి. కొన్నిసార్లు తప్పదు. క్రిష్ణా జిల్లా కమ్మ నటుడు పార్టీ పెట్టినా పడనంత కుల… ముద్ర విభజన జరిగి, రాజధాని ప్రకటించాకే వచ్చిందీ అంటే కారణం ఇలాంటి భావజాలమే. ఎన్టీఆర్ హయాంలో కాంగ్రెస్ అదే థియరీ తెచ్చే ప్రయత్నం చేసింది. కాకపోతే అలాంటి విమర్శల్ని ఆయన తిప్పికొట్టే తీరు వేరు. నేషనల్ జియోగ్రఫీలో కనిపించే సింగల్ సింహం వేట లాగా ఉండేది ఆయన దూకుడు. అందుకే అప్పుడు ఇలాంటి చర్చలు లేవు. సోషల్ మీడియా లేదు కాబట్టి ఈ ప్రస్తావనా వచ్చి ఉండదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇది కొత్త చీడ. పైగా ఇప్పుడు సింహం గుంపు కట్టుకొని పోతుంది కాబట్టే కలుపుకొని పోవడం కంపల్సరీ. మరి పార్టీ ఏం చేయాలి ? ఏం చేయగలదు ? ఇలాంటి వాళ్లు ఉంటూనే ఉంటారు కదా అంటే చేయొచ్చు… చాలానే ఉన్నాయ్.

సామాజిక మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో అధికారికంగా ఇతర కులస్తుల్ని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయడం అంటే అప్పొజిషన్ లో ఉండగా కుర్చీ వేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత మందలోకి నెట్టేయడం కాదు… ఇదిగో ఈ జనరేషన్ మాతో కనెక్టు అయ్యింది అని తెలిసేలా ప్రయారిటీ ఇవ్వడం, పోస్టులు పెడతారు, ఫోరమ్ లు నడుపుతారు, చర్చలు చేస్తారు, మంచి చెడ్డా చెబుతారు, భవిష్యత్తుకు ఏం కావాలో వాళ్లే తేల్చుకుంటారు. జనాన్ని కలుపుకుంటూ పోతారు. వాళ్లే వారధులు అవుతారు. మీరు చెబుతున్న బడుగుల అడుగులు వాళ్లే అవుతారు. వాళ్లే ముందుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు, బయటే కాదు సోషల్ మీడీయాలోనూ కొట్లాడుతున్నవాళ్లలో మెజారిటీ వాళ్లే అయినప్పుడు ఈ సొంత కుల గుల గాళ్లు ఆటోమేటిగ్గా మైనారిటీలు అయిపోతారు. దాంతోపాటే కుల ప్రభావ ముద్ర కూడా న్యూట్రలైజ్ అవుతుంది. బడుగులు, ఇతర కులాల వాళ్లకి గొంతుకొచ్చి, వాళ్లంతట వాళ్లుగా మిమ్మల్ని సమర్థించే రోజు వచ్చిన నాడు ఎవ్వడూ ఈ పార్టీని కదపలేడు. భవిష్యత్ భయం ఉండనే ఉండదు. జనంలో బలం వస్తుంది. ఆకులో వంకాయ ఉండొచ్చు కానీ వంకాయ పచ్చడి, వంకాయ కూర, వంకాయ పులుసు, వంకాయ పప్పు అంటూ ఆకంతా అదే ఉండకూడదు. ఇప్పుడు సోషల్ సోషల్ మీడియా హడావుడిలో ఉన్నదంతా ఈ వంకాయ్ గాళ్లే !

RELATED ARTICLES

1 COMMENT

  1. Sir party adhikaramlo unnappudu labha pada merantunna kulam valla list pettagalara, eppudu appudu kuda nastapoyindhi a kulam valle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments