కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు కేటాయించిన నిధులు, అందులో వాళ్లు ఖర్చు పెట్టిన వివరాలను విడుదల చేసింది. సాధారణంగా ప్రతి ఎంపీకి ఏడాదికి 5 కోట్ల రూపాయలు ఎంపీ నిధులు అలాట్ చేస్తారు. లోక్ సభ సభ్యుడికి 5 కోట్లు ఇస్తారు. ఇందులో నాలుగున్నర కోట్లు నియోజకవర్గంలో, 50 లక్షలు అదే రాష్ట్రంలో వేరే నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టొచ్చు. రాజ్యసభ సభ్యుడికి 5 కోట్లు ఇస్తారు. ఇందులో నాలుగున్నర కోట్లు తాను ఎన్నికైన రాష్ట్రంలో, 50 లక్షలు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా అభివ్రుద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టొచ్చు.
రోడ్లు, సామాజికభవనాలు, స్కూల్ బిల్డింగులు, తుఫాన్ షెల్టర్లు ఇలా ప్రజోపయోగ కార్యక్రమాల కోసం ఈ నిధులని ఖర్చు పెట్టొచ్చు. ఎంపీ నేరుగా అలాట్ చెయ్యొచ్చు. 5 లక్షల లోపు పనులకు నామినేషన్ మీద ఇచ్చేస్తారు. డబ్బు రెడీగా వుంటుంది. బిల్లులు చెల్లించరనే భయం వుండదు. దేశ వ్యాప్తంగా ఈ మూడేళ్లలో ఎంపీలకు 11 వేల 681 కోట్లు నిధులు విడుదల చేశారు. అందులో 3 వేల 964 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. తమకు కేటాయించిన మొత్తం నిధుల్లో 33.9 శాతం ఖర్చు పెట్టారు. నాగాలాండ్ ఎంపీలు ఈ విషయంలో ముందున్నారు. వాళ్లకు కేటాయించిన నిధుల్లో 95 శాతం ఖర్చు పెట్టారు. తెలుగు రాష్ట్రాల ఎంపీలు జాతీయ సగటు కంటే తక్కువగా ఖర్చు పెట్టారు.
జాతీయ సగటు 33.9 శాతం వుంటే, ఏపీ ఎంపీలు 23 శాతం, తెలంగాణ ఎంపీలు 23.8 శాతం నిధులు మాత్రమే ఖర్చు పెట్టారు. తెలంగాణలో ఉభయసభల ఎంపీలకు 394 కోట్లు కేటాయిస్తే, 94 కోట్లు ఖర్చు పెట్టారు. ఏపీలో 554 కోట్లు కేటాయిస్తే 127 కోట్లు ఖర్చు పెట్టారు. ఏపీలో అందరికంటే ఎక్కువ నిధులు ఖర్చు పెట్టింది చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు. ఆయన తొలిసారి ఎంపీ అయ్యారు. తనకు కేటాయించిన నిధుల్లో 51.93 శాతం ఖర్చు పెట్టారు. రెండో స్థానంలో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి 50 శాతం నిధులు ఖర్చు పెట్టారు. మిగతా ఎంపీలెవరూ కనీసం 40 శాతం కూడా పెట్టలేదు. కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ తనకు కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. నరసరావుపేట ఎంపీ లావు క్రిష్ణదేవరాయులు ఒక కోటి 38 లక్సలు మాత్రమే ఖర్చు పెట్టారు.
తెలంగాణలో అత్యధికంగా 56 శాతం నిధులుఖర్చు పెట్టారు బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్. రాజ్యసభ సభ్యులు అభిషేక్ సింఘ్వి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. సీనియర్ నేత రేణుకా చౌదరి కేవలం 2.08 కోట్లు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 3.23 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఏపీలో అభివ్రుద్ధి పనుల కోసంనిధుల కొరత బాగా వుంది. అభివ్రుద్ధి కార్యక్రమాలకుఫండ్స్ లేవని మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు. చిన్న చిన్న పనులకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఎంపీ నిధుల ద్వారా పూర్తి చేసే అవకాశం వుంటుంది. మరి మన ఎంపీలు నిధులు ఖర్చు పెట్టడంలో ఇంత పీనాసిగా ఎందుకుంటున్నారో అర్ధం కావడం లేదు. ఈ విషయంలో సీనియర్లు జూనియర్లనే తేడా కనబడ్డం లేదు. కేంద్రంలో ఏయే శాఖల్లో నిధులుంటాయో, వాటిని ఎలా రాబట్టుకోవచ్చు అనే విషయంలో చంద్రబాబు ఎక్స్ పర్ట్. ఎంపీలు నిధులు ఖర్చు పెట్టని విషయం ఆయన ద్రుష్టిలో పడినట్టు లేదు. పడితే ఇంత పూర్ పర్ఫార్మెన్స్ వుండేది కాదు.







