ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక భయంకరమైన వాతావరణ ముప్పు వైపు అడుగులు వేస్తోంది. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న ‘గాడ్జిల్లా ఎల్ నినో’ కారణంగా భూగోళం మొత్తం డేంజర్ జోన్‌లోకి ప్రవేశించిందని ఐక్యరాజ్యసమితి, WMO సంస్థలు అధికారికంగా హెచ్చరించాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ భీకర పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అయితే, ఈ ప్రకృతి విపత్తు ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై చాలా తీవ్రంగా ఉండబోతోంది. కానీ, దురదృష్టవశాత్తూ ఈ కరువు ముప్పును కూడా మన రాజకీయ పార్టీలు ఓట్ల రాజకీయం కోసం వాడుకుంటున్నాయి. సాగునీరు, తాగునీటి సంక్షోభాన్ని అడ్డం పెట్టుకుని వైపాపా, బీఆర్ఎస్ ఆడుతున్న అసలు డ్రామా ఏంటి? ఓ లుక్ వేద్దాం.
అసలు ఏంటి ఈ గాడ్జిల్లా ఎల్ నినో..? పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోవడాన్ని సైంటిస్టులు ఎల్ నినోగా పిలుస్తున్నారు. ఈ సారి దీని తీవ్రత అత్యధికంగా ఉండటంతో దీనికి ‘గాడ్జిల్లా’ అని పేరు పెట్టారు. దీనివల్ల భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాతావరణ నివేదికల ప్రకారం.. పరిస్థితులు ఇలాగే ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది జూన్ వరకు కూడా సరైన వర్షాలు పడటం చాలా కష్టం. సాగునీరు పక్కన పెడితే, చివరకు ప్రజలు తాగడానికి కూడా నీళ్లు దొరకని ప్రమాదకరమైన పరిస్థితి పొంచి ఉంది. ఇదంతా ప్రకృతి సృష్టిస్తున్న విపత్తు అని స్పష్టంగా తెలుస్తున్నా.. విపక్షాలు మాత్రం దీన్ని రాజకీయం చేస్తున్నాయి.
ప్రకృతి సృష్టిస్తున్న ఈ ముప్పును అర్థం చేసుకోకుండా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష వైపాపా దీనిపై తీవ్ర రాజకీయం చేస్తోంది. ఎల్ నినో ప్రభావం వల్ల జలాశయాల్లో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో భవిష్యత్తు తాగునీటి అవసరాలను కాపాడుకోవడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంటే.. వైపాపా నేతలు మాత్రం రైతులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. శ్రీశైలం జలాలను అడ్డం పెట్టుకుని, వ్యవసాయానికి సాగునీరు ఇవ్వడం లేదంటూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీశైలంలో నీటి మట్టాలు నానాటికీ పడిపోతున్నాయనే నిజాన్ని దాచిపెట్టి, కేవలం రాజకీయ లబ్ధి కోసమే కరువుపై డ్రామాలు ఆడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు ఏ ప్రాజెక్ట్ కూడా పూర్తిగా నిండకపోయినా పొలిటికల్ స్టంట్ లు వేస్తున్నాయి విపక్షాలు.
ఇక అసలు విషయానికి వస్తే, ఇప్పుడున్న భయంకరమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు.. రైతులకు సాగునీరు ఇవ్వడం కంటే, సామాన్య ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తాగునీరు అందించడమే. ఒకవైపు ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటిపోతుంటే, వరి లాంటి విపరీతంగా నీరు అవసరమయ్యే పంటలకు ఈ తరుణంలో సాగునీరు విడుదల చేయడం ఏమాత్రం సాధ్యం కాని పని. ఈ చేదు నిజాన్ని గ్రహించకుండా, వరి పంటలకు నీళ్లు ఇవ్వడం లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని స్పష్టమవుతోంది. పంటలు పండకపోయినా నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవచ్చు కానీ, తాగడానికి బొట్టు నీరు లేక ప్రజలు అల్లాడిపోతే ఆ ప్రాణాలను తిరిగి తీసుకురాలేమనే కఠిన వాస్తవాన్ని ఇప్పటికైనా విపక్షాలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక ఇటు తెలంగాణ విషయానికి వస్తే, అక్కడ ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేస్తోంది. నాగార్జున సాగర్ జలాల విషయంలో తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను రగిల్చేందుకు ప్రయత్నిస్తోంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు విద్యుత్ అవసరాల కంటే తాగునీటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేస్తున్నప్పటికీ.. బీఆర్ఎస్ మాత్రం నీటి విడుదల కావడం లేదంటూ రైతులను, ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా స్టేట్‌మెంట్లు ఇస్తోంది. ప్రకృతి పరంగా వస్తున్న వర్షపాత లోటును, కరువును ప్రభుత్వ వైఫల్యంగా చూపించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఇలాంటి తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి అధికార, ప్రతిపక్షాలు ఉమ్మడిగా పనిచేయాల్సింది పోయి.. ఇలా ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకోవడం ప్రజలకు ఏమాత్రం మేలు చేయదు.







