కసితో నాస్తి దుర్బిక్షం. కసి ఉంటే చాలు. ఏపీలో దుర్భిక్షం పోతుంది, పోగొట్టగలం అనేది ఇప్పటి ట్రెండింగ్ అండ్ బజ్ వర్డ్. కసితో ఉండటానికి పెద్ద కృషి అక్కర్లేదు. కలిసి ఉంటే చాలు. అలా కలిసి ఉండకూడదనే కొత్త కుల ఎత్తుగడలు వేస్తున్నారు. కాపుల పేరుతో పార్టీ పెట్టించి విడగొట్టి, మరోసారి పడగొట్టాలని చూస్తున్నారు. ఇంతకీ కాపు ప్రయోజనాలు, కాపు అజెండా అంటూ మాట్లాడేవాళ్లు కాపుల్ని ఏకం చేస్తున్నట్టా ? ఏకాకి చేస్తున్నట్టా ? అలాంటి వాళ్లతో కాపులకి లాభమా ? నష్టమా ? డీటైల్డ్ గా చూద్దాం.
ఏపీలో కులాల వారీగా పార్టీలు ఉన్నాయా ? కులం కోసం పని చేస్తున్నాం, మాది కుల అజెండా అని ప్రకటించుకున్న దాఖలాలు కనిపించాయా ఎప్పుడైనా ? ఆరోపణలు, ప్రత్యర్థులు కుల ముద్రలు కొట్టడం వేరే సంగతి. ఓ పార్టీ తన అంతట తానుగా ఫలానా కులం కోసం పుట్టామని చెప్పుకున్నట్టు కనిపించిందా ? టీడీపీ కమ్మ కులం కోసం పుట్టామని చెప్పిందా ? ఎప్పుడైనా, వైసీపీ మాది రెడ్డి అజెండా అని ప్రకటించిందా ఏనాడైనా ? లేదే ! ఎందుకంటే ఆ ఒక్క కులంతో ఏం సాధించేది ఉండదు. కమ్మలు టీడీపీకి మద్దతు పలికితే పలకొచ్చు గాక. కానీ టీడీపీ కాంబినేషన్ ఎప్పుడూ కమ్మ ప్లస్ బీసీ. మిగతా ఈక్వేషన్స్ పరిస్థితుల్ని బట్టీ వస్తూ పోతూ ఉంటాయ్. మిగతా వాళ్లు కలిసినప్పుడు వీళ్లు గెలుస్తారు. అలాగే వైసీపీ రెడ్డి ప్లస్ దళిత్ కాంబినేషన్. మిగతా వాళ్లు కలుస్తుండొచ్చు. మొన్న ఎన్నికల్లో అప్పర్ క్యాస్ట్ అటువైపు మొగ్గినట్టు. మరి అలాంటప్పుడు మేం ఫలానా కులం కోసం పుట్టామని చెప్పడమో, లేదంటే ఓ కులం వారిని ఏకం చేస్తూ వేదిక ఎక్కిస్తూ మాట్లాడించడమో అంటే సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ? మాది ఫలానా కులం, మేం ఇదే కుల అజండా కోసం పుట్టామని ప్రకటించుకుంటే మిగతా వర్గాలు, వర్ణాలూ మద్దతిస్తాయా ? మిగతా వాళ్లంతా ఆ కులానికి దూరం అయ్యేందుకు ఓ కారణం చూపిస్తున్నట్టు కాదా ? ఇది రాంగ్ స్ట్రాటజీనే అనిపిస్తుంది కాస్త విశాలంగా ఆలోచిస్తే !
ఏపీలో కమ్మలు ఓ ఐదారు శాతం ఉంటారేమో. కాస్త అటూ ఇటుగా. రెడ్లు దాదాపు 8 పర్సెంట్ ఉండొచ్చు. కాపులు 13 శాతం వరకూ ఉంటారని కొందరు అంటే, కాదు 17 శాతం అనేవాళ్లు కూడా ఉన్నారు. ఇవన్నీ వాదనలే వాస్తవాలు కాదు. 1931 నాటి లెక్కలు దాదాపుగా వీటికి ఆధారం. ఏ కులం ఎంత ఉందో తెలియాలంటే ఇప్పుడు కొత్తగా కులాల వారీ జనగణన జరగాలి. ప్రాంతీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నది అందుకే. అప్పుడే క్లియర్ గా తెలుస్తుంది. అలా జరగనంత వరకూ వాదనలు ఉంటాయ్. కొంత వరకూ అందులో వాస్తవం ఉండొచ్చు. పాయింట్ కి వద్దాం. ఇప్పుడు 13 కాదు 17 కూడా కాదు. మధ్యస్తంగా 15 శాతం అనుకుందాం కాసేపు. ఇంత శాతం కాపులు రాష్ట్రంలో ఉన్నారు అనుకుందాం. కాపుల కోసం మూడు పార్టీల్లోంచి కొందరు నాయకుల్ని లాగి పార్టీ పెట్టిస్తే ఎంత మంది అటు వైపు మొగ్గుతారు ? ఎందుకంటే ప్రతీ పార్టీకి కులాలకు అతీతంగా లాయల్ ఓటు బ్యాంకు ఉంటుంది. కాపుల్లో టీడీపీ వైపు ఉండేవాళ్లు ఉంటారు. విధానాలు నచ్చి కావొచ్చు. లేదంటే స్థానికంగా కాపు అభ్యర్థి నిలబడటం వల్ల కూడా కావొచ్చు, అలాగే వైసీపీకి కూడా మద్దతిచ్చేవాళ్లు గట్టిగా ఉంటారు. భావజాలం నచ్చడంవల్లో, ప్రయారిటీ ఉంటుందేమో అనే ఆశ వల్లో. ఇలాంటి వాళ్లని మినహాయించగా, జనసేన ప్రభావాన్ని కూడా లెక్క తీస్తే మిగిలేది ఎంత శాతం ? మూడు పార్టీలూ మినహాయించాక మూడు పర్సెంటు మిగులుతుందా ? పోనీ, అంతకంటే ఎక్కువే ఉంటుంది అనుకుందాం. ఐదు శాతం మిగిలినా ఆ ఐదు శాతం ఓట్లతో సాధించేది ఏముంటుంది ? కొత్తగా వచ్చే పార్టీకి ఆ ఐదు శాతం ఓట్లు పడితే గెలిచే అవకాశం ఉంటుందా ? కచ్చితంగా ఉండదు. ఎందుకంటే ప్రధాన పార్టీల ఓట్ల శాతం 40 శాతానికి పైగానే ఉంటుంది. పైగా పొత్తులతో ఓట్లు పంచుకుంటాయ్ కొన్ని పార్టీలు. అలాంటప్పుడు ఈ ఐదు శాతం కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి మాత్రమే పనికొస్తుంది. ఎస్. అసలు ఎత్తుగడ కూడా అదే !
ప్రజారాజ్యం కేవలం ఓట్లను చీల్చడానికే పరిమితం అయిపోయింది ఇందుకే. ఈ విషయాన్ని స్టడీ చేసి అర్థం చేసుకున్నాడో, లేదంటే స్వభావమే అంతో తెలియదు కానీ పవన్ ఎప్పుడూ కులం గురించి మాట్లాడడు. కాపులు, ఉపకులాలు ప్లస్ బీసీలు అనే మాట వాడతాడు. అందరూ కలిస్తే 50 శాతానికిపైగా ఉంటారు. ఇదో మేజర్ స్ట్రాటజీ. అంటే కాపుల్ని మిగతా కులాలతో కలిపి కుడితే బలం పెరుగుతుంది. రాజకీయం మారే అవకాశం అందుతుంది. ఇదే తెలివైన వ్యూహం. విడివిడి వ్యూహం కాదు. కలివిడి వ్యూహం. కాపుల పేరుతో రాజకీయం చేయాలనుకుంటున్న మిడి మిడి తెలివిగాళ్ల వల్ల ఇలాంటి ప్రయోజనాలకు విఘాతం కల్గడం ఖాయం. ఎందుకంటే, నియోజక వర్గాల వారీగా తీస్తే కాపుల పర్సంటేజీ 25 శాతానికి పైగా ఉన్న సెగ్మెంట్లు ఏపీలో 18 ఉన్నాయ్. 20 శాతానికిపైగా ఉన్నది 14. పది నుంచి 15 శాతం ఉన్నవి మరో 20 ఉండొచ్చు. ఇలాంటి చోట్ల విజయావకాశాలు పెరగాలంటే ఇన్ క్లూజివ్ వ్యూహం కావాలి. అంటే గెలుపు కోసం కలుపుకోవాలి. అంతేకానీ ఎవరో లాభం కోసం – ఏకం అవుతున్నాం అనుకొని ఏకాకిగా మిగలకూడదన్నది పొటిలికల్ ఈక్వేషన్. అఫ్ కోర్స్, ఇక్కడో క్లారిఫికేషన్ ఏంటంటే – పవన్ ఎప్పుడూ కుల లెక్కలు చెప్పడు. ఐడెంటిటీ క్లెయిమ్ చేసుకోడు. కలిసి గెలవాలి అనే అంటాడు. సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా అదే పాలసీ. పవన్ కి సన్నిహితంగా ఎవరెవరు ఉంటారో చూస్తే తెలిసిపోతుంది ఈ విషయం.
ఒక్క వేలితో కనీసం కంట్లో నలుసు కూడా తీసుకోలేం. మరో చేత్తో రెప్పలు ఎత్తి పట్టుకొని, వేలు వాడితేనే పని అవుతుంది. అలాంటిది, ఒక్క కులాన్ని వాడటం వల్ల ఫలితం ఎలా వస్తుంది. ఒక్కటుంటే వేలు. బిగిస్తేనే కదా పిడికిలి. మరి ఈ విషయం తెలియకనా – పార్టీ పెట్టే, పెట్టించే ప్రయత్నాలు చేస్తున్నది. ఎస్. ఇదే పాయింట్. ఇక్కడ కాపాల్సింది కుల ప్రయోజనాలు కాదు. స్వప్రయోజనాలు. కాపు ప్రయోజనాలు అంటూ మాట్లాడే ప్రతీ ఒక్కడూ ఎవరో ఆడిస్తున్నట్టు బొమ్మే అనే ముద్ర ఎప్పుడూ బయటపడుతూనే ఉంటుంది. సొంతగా బాగుపడాలనుకునే వాళ్లు ఇలా కులం పేరు చెప్పి కంచాలు మోగించడం, కొద్దో గొప్పో బావుకున్నాక సైడైపోవడం నడుస్తున్న చరిత్ర. ఇలాంటి సీజన్ లో పవన్ లాంటి నాయకుడు – ఘోరమైన ఎదురు దెబ్బ తిన్నాక కూడా బరిలో ధీమాగా నిలిచాడు. సైనికుడులా, భీమ్లా నాయకుడులా ఉన్న పవన్ ను దెబ్బ తీసేందుకు మరోసారి కులాన్ని వాడటం అంటే పాత ఎత్తుగడనే కొత్తగా వేయడం అనుకోవాలి.