అధికారంలో ఉండటం అంటే అడ్డగోలుగా ఆస్తులు, ఆటాచ్ మెంట్లూ అన్నీ సంపాదించేసుకుంటారు అనుకుంటాం జనరల్ గా ! ఇది అందరికీ సాధ్యపడే టాలెంట్ కాదని, రాజకీయంలో ఉండటం కోసం కొంప, గోడు అమ్ముకునే పరిస్థితి వచ్చిన వాళ్లు కూడా ఉన్నారని… పాపం ఈ టీడీపీ లీడర్ ను చూస్తే అర్థం అవుతోంది. పైగా ఆయనేమీ జమానాలో మంత్రిగా పని చేసిన వాడు కాదు. చంద్రబాబు హయాంలో, 2019 వరకూ మంత్రిగా చేశాడు. ఇప్పుడు ఖర్చులకు కూడా డబ్బుల్లేక అప్పులు చేస్తే ఇల్లు వేలానికి వచ్చింది. గిట్టని వాళ్లు ఎన్ని మాట్లాడినా, పైసా ముట్టని వాళ్లు ఇలాగే ఉంటారు అనేందుకు ఇదో లేటెస్ట్ ఎగ్జాంపుల్ !
రాజకీయం అంటేనే దోపిడీ, రాపిడి అనుకునే రోజులివి. పైగా ఇసుకలో పిసికేశారు, నమిలేస్తున్నారు అని తెగ చెడ ప్రచారాలు చేసిన రోజులు అవి ! అంటే… 2019కి ముందు సంగతి. కానీ అసలు దోపిడీ అంటే ఎలా ఉంటుందో, నొక్కుడు అంటూ మొదలు పెడితే, ముక్కు పిండి వసూళ్లు చేయడం అంటూ చేస్తే ఎలా ఉంటుందో ఆ తర్వాత బోధపడింది అందరికీ, అది వేరే సంగతి ! ఇక్కడ మేటర్ తాజా మాజీ మంత్రి గురించి కదా ! అది చూద్దాం ముందు ! ఆయన గోదావరి జిల్లాలో ప్రముఖ నాయకుడు. పీకల్లోతు పోటీని తట్టుకొని – ఎదుటోడి ధవ ప్రవాహాన్ని ఎదిరించి 2014లో గెలిచాడు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు మంత్రి పదవి కూడా ఇచ్చాడు. చేతికి బండి అయితే ఇస్తాడు కానీ ఎటు వైపు వెళ్లాలి, ఎంత స్పీడులో వెళ్లాలి, ఎప్పుడు గేరు మార్చాలి… లాంటివన్నీ చంద్రబాబే చెబుతాడు. అందులో తిరుగులేదు. అందుకే ఆ బండిలో పెట్రోల్ కొట్టించే పరిస్థితి కూడా ఉండదు చాలా మందికి ! పాపం ఈ మంత్రి సంగతి అలాగే అయ్యింది.
ఎవ్వరినీ పైసా ముట్టనిచ్చిన దాఖలా లేదు. జనం మీద రూపాయి పన్ను పెంచిన సందర్భం లేదు. ఆ ఐదేళ్లలో ఏ ఛార్జీ పెరగలేదు. కరెంటు నుంచి ఆర్టీసీ బస్సు వరకూ అన్నీ అందుబాటులో ఉంచుతూ – రాబడికి కొత్త దారులు వెతుకుడే తప్ప ఉతుకుడు ఉండేది కాదు కదా ! పైగా సవాలక్ష కండిషన్లు, ఎవరైనా పావలా పదిపైసలకు పాల్పడినా చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉంటుందో – ఇప్పుడు తెలంగాణలో ఓ కీలక కుర్చీలో ఉన్న నాయకుణ్ని అడిగితే చెబుతాడు. అప్పట్లో ఆయన 93 లక్షలకు లెక్క చెప్పలేదని కేబినెట్లోంచి తీసేశాడు చంద్రబాబు. స్టేషనరీ వ్యవహారం అది. అలా ఉంటుంది యవ్వారం. అందుకే బొటాబొటిగా నెట్టుకొచ్చే వాళ్లకి చంద్రబాబుతో అంత సులభం కాదు. ఈ మంత్రిది కూడా అదే సీన్.
తీరా చూస్తుండగానే ఎన్నికలు వచ్చేశాయ్. పైగా జిల్లా మారి, క్రిష్ణాలో రంగంలోకి దిగాడు ఈ సారి ! ఎదుట ప్రవాహం, ధన ప్రవాహం ఉప్పొంగుతోంది. తన దగ్గర మాత్రం అంత తాహతు లేకపోయింది. అందుకే ఇల్లు తాకట్టు పెట్టాడు. భూములు అమ్మినా సరిపోలేదని ఇక తెగించాడు. తీరా ఓడిపోయాడు. పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు గత్యంతరం లేక ఇల్లు వేలానికి వచ్చింది. అదీ కథ ! కోట్ల మాట దేవుడెరుగు. లక్షలకు కూడా దిక్కూదివాణం లేక అల్లాడుతుంటే ఆ నోటా ఈ నోటా ఆ విషయం – ఇప్పుడు ఆ పార్టీలో లేని ఆపద్భాంధవుడికి తెలిసింది. సాయం అందింది. గోడు వినపడింది. గూడు నిలబడింది.
ఓ రకంగా సుఖాంతమే ! కాదనలేం ! కానీ అసలు విషాదం గురించి అంత తేలిగ్గా మర్చిపోతే ఎలా ? ఇలాంటి మంత్రులున్న కేబినెట్ ను, ఇలాంటి నాయకులు పని చేసిన ప్రభుత్వం మీద అవినీతి ముద్ర వేసేందుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ అప్పటి ఎన్నికల్లో చేయని ప్రయత్నం అంటూ లేదు. విలువకి శిలువ వేసినట్టు… విచక్షణకి వీడ్కోలు పలికినట్టు, నాలుకకు నరమే లేదని అడ్డగోలుగా అవాకులూ చవాకులూ పేలిన నోళ్లు ఈ మధ్య కాలంలో మూతపడిపోయాయ్. బహుశా అప్పుడు కూసిన గాలి కూతలకు ఇప్పుడు ఇప్పుడు సాక్షిభూతం కనిపిస్తున్నదేమో మరి ! ఇలాంటి వాళ్లలో కొంత మంది అయినా కళ్లు తెరిస్తే మేలు – అనే ఇంతలా చెప్పడం. ఇదంతా, ఆ మాజీ మంత్రి యాతనంతా ఎప్పుడోకప్పుడు బయటకు రాకమానదు. పోనీ అప్పుడైనా అర్థం చేసుకుంటే అదే పదివేలు.