ముర్ము మన దగ్గరకు వచ్చే ముందు వరకూ పెద్దగా వేల్యూ లేని ప్రశ్నే ఇది ! ఇప్పుడు దూరంగా ఉన్నా, వాళ్లిద్దరూ కలిసి పోటీ చేస్తారు – ఈ పువ్వు ఎక్కడ పూస్తుంటో తెలియదు అన్నట్టుగా ఉండేది ఈక్వేషన్. కానీ ఆమె ఏపీ వచ్చే ముందు చంద్రబాబు మద్దతు చెప్పడం – ఆమె నేరుగా వచ్చి, కలిసి ఆశీస్సులు, మద్దతూ రెండూ తీసుకోవడం చకచకా జరిగిపోయాయ్. ఆ తర్వాత ఉంది అసలు పాయింటు. 150కి పైగా ఎమ్మెల్యేలు, 30 మందికిపైగా ఎంపీలూ ఉన్న పార్టీని కాదని – ఈ రెండు కేటగిరీలూ కలిపినా పట్టుమని 30 మంది కూడా లేని చంద్రబాబు మద్దతకు ఆమె ఉప్పొంగిపోవడం, ఢిల్లీ తిరిగెళ్లి – చంద్రబాబు, పార్టీ నేతలతో సమావేశం సంతోషాన్నిచ్చింది అని ప్రత్యేకంగా చెప్పడం అసలు హైలైట్ ! అంతటితో అయిపోలేదు… అంతకు ముందు తెలుగు పార్టీల నాయకులతో సమావేశం అయ్యాను అంటూ కర్రీలో కరేపాకు కబురు చెప్పడం వర్రీ పెంచుతోంది.
ఎవరికి ఎవరు ? చివరికి ఎవరు ? అనేది ఇప్పుడే చెప్పడం కాస్త కష్టమే అయినా కుదుపులు అదుపు తప్పుతున్నప్పుడు మాత్రం ఆలోచనలు రావడం సహజం. అందుకే ఎవరితో ఎవరు ఉంటారు ? ఎవరు ఎవరు కలిసి బరిలో దిగుతారు అనేది పొలిటికల్ పాయింట్ ఏపీలో ! నీది వారసత్వ పార్టీ మేం వారసత్వానికి వ్యతిరేకంగా వార్ చేస్తున్న సుద్దపూసలం అని ఓ పక్కన ఆ పార్టీ చెబుతున్నా – ఎదురెళ్లి మళ్లీ ఈ పార్టీ మద్దతు ప్రకటించి పండగ చేయడం మామూలు విషయం కాదు నిజానికి ! ఈయన ఊసుపోక చెప్పాడే అనుకోండి – అటు వైపు అలాంటి రియాక్షన్ రావడం ఆలోచించాల్సిన విషయమే ! ఇక పవన్ సంగతి ఉండనే ఉంది.
రోడ్డు మీద నుంచి బోర్డు మీద వరకూ ప్రతీ విషయంలోనూ టీడీపీకి – పవన్ కీ మధ్య సింక్ మరీ ఎక్కువైపోతోంది. నేరుగా పాలసీలపై యుద్ధం ప్రకటించడం, పోరాటమో, యాత్రో చేయడం టీడీపీ స్టైల్. ఇంకా చెప్పాలంటే ప్రతిపక్షం పాయింట్ ఆఫ్ వ్యూ. టీడీపీ ఎలాగూ చేస్తోంది ఈ పని. పవన్ కూడా కాల్షీట్ ఖాళీ ఉన్న ప్రతీసారీ పోరాటం చేస్తున్నాడు. తిరుగులేదు. కానీ పవన్ ప్రస్తుతం కలిసి ఉన్న కమలమే చంద్రబాబు సాయాన్ని సమ్మతించింది. కానీ, ఏపీలో ప్రభుత్వం మీద సమరం మాత్రం చేయడం లేదు. బాబు బరువు ఎలా తగ్గాడో తెలుసుకోవడం మీద పెట్టిన శ్రద్ధ – ఏపీలో బీజేపీ పోరాటం మీద కానీ, వైసీపీ మీద ఎదురుదాడి చేయడంలో కానీ సోము వీర్రాజు పెట్టలేకపోతున్నాడు. మరి ఇలాంటప్పుడు పొత్తు – ఎత్తు ఎలా కుదురుతుంది ? ఎలపట ఎద్దు ఎటు లాగుతోందో – దాపట ఎద్దు దానికి అప్పొజిట్ లో వెళుతున్నట్టుగా ఉంది జన – జనతా జోడీ ! మరి వాళ్లు తన దారికి వస్తారో – పవనే వాళ్లదారిలోకి వెళతాడో, లేదంటే తనదారి తాను చూసుకుంటాడో చూడాలి.
మరి టీడీపీ సంగతి ఏంటి ? పొత్తు లేకుండా ఎత్తు వేయడు అనే విపక్షాల విసుర్లు పక్కన పెట్టండి. చంద్రబాబు ఆల్రెడీ సన్నాహాలు మొదలు పెట్టేసిన సూచనలు అయితే కళ్లకు కనిపిస్తున్నాయ్. చూసే చూపు ఉండాలంతే ! కావాలంటే చూడండి – కడప ఎంపీ అభ్యర్థి ఈయన, రాజం పేట అభ్యర్థి ఆయన అని చెప్పేస్తున్నాడు. ఆనం రెండు అడిగితే ఒకటి ఇచ్చేందుకు ఓకే చేశారన్న టాక్ ఆల్రెడీ ఉన్నదే ! అంటే మొదటి దాంట్లో ప్రిపరేషను, రెండోదాంట్లో కాన్ఫిడెన్సు ఉన్నాయ్ అనుకోవాలి. జనం కోసం మనం టైపులో ఒంటరిగా వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్టే ! పైగా మహానాడు సక్సెస్ తర్వాత, అటు పక్కన గ్రాఫ్ ఫటాఫట్ అని కుప్పకూలుతున్నాక ఈ మాత్రం కాన్ఫిడెన్స్ లేకపోతే ఎట్లా – అనుకొని – తెలుసుకొని – తేరుకొని అయినా ఉండాలి. లేదంటే, మాకేం తక్కువ – మేమే మేజర్ పార్టీ అంటూ లిల్లీపుట్ గాళ్లు గెంతులు చూశాక ఇక లాభం లేదని అయినా అనుకొని ఉండాలి ! మొత్తానికి కారణం ఏదైనా, బాబు మాత్రం ఒంటరిగా బరిలో దిగాల్సి వచ్చినా సిద్ధమే అన్నట్టుంది సీన్.
మరి పవన్ సంగతి ఏంటి ? ఆవేశం అతవల గట్టును తాకితే సరిపోదు. అడుగు గడప దాటాలి. నిజమే కదా ! పార్టీ నిర్మాణం, అభ్యర్థులు, సామర్థ్యం, జనం మద్దతు ఇలా చాలా దినుసులు ఉండాలి పోటీ చేయాలంటే ! అవి అరకొరగా, అక్కడక్కడా ఉన్నప్పుడు, మల్టీ స్టారర్ చేసుకోవాలి. తెరమీద డామినేట్ చేస్తే చేయొచ్చునేమో, ఇక్కడ కుదరదు. కాస్తో కూస్తో అటు ఇటుగా మాట్లాడుకొని తేల్చుకోవాలి. అలా కాదంటే, బీజేపీతో కలిసి బరిలో దిగాలి. ఈయన ప్లస్సును వాళ్ల మైనస్సు వాటేసుకుంటే ముచ్చటగా మూడు పర్సంటో, కనాకష్టంగా రెండు పర్సంటో లెక్క తేలితే మొత్తానికి దెబ్బ పడుతుంది. మరి అంతటి సాహసం అవసరమా అన్నది ఆలోచన ! అందుకే మల్టీ స్టారరే మచ్ బెటర్ ఆప్షన్.
ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి అనేదాన్ని బట్టీ బీజేపీ ఎటు జరుగుతుందనేది ఉంటుందేమో ! ప్రస్తుతం ఆయన నోరు తెరిచిన సింహం బొమ్మలతో ఫోటోలు దిగడంలో బిజీ. కాస్త ఫ్రీ అయ్యాక ఇటు వైపు చూస్తే వాస్తవాలు తెలుస్తాయ్. ఈ లోగా కర్ణాటక, మధ్యప్రదేశ్ లాంటి చోట్ల ఏమవుతుంది అనేది కూడా పాయింటే ! జనరల్ ఎన్నికలకు ముందే ఏపీలో ఎలక్షన్ పొడుచుకొస్తే మాత్రం గెలిచిన వాళ్లతో మాట్లాడుకుందాం అని బీజేపీ అనుకునే అవకాశం ఉందమో ! అలాంటప్పుడు తేల్చుకోవాల్సింది బీజేపీ కాదు పవన్ కల్యాణ్ మాత్రమే ! ఇంత చిక్కుల చిక్కదనం ఉంది కాబట్టే బాబు తన పని తాను చేసుకుపోతున్నాడు. వస్తే లిఫ్ట్ ఇస్తా – లేదంటే సింగిల్ గా కొట్టొస్తా అనేది ఆయన ఐడియా అనుకోవాలి. ఇప్పటికింతే !