28.2 C
Vijayawada
Sunday, June 16, 2024
Homeనీతి ప్రత్యేకంహుజురాబాద్ ఉప ఎన్నిక ఎఫెక్టు ఏపీ మీద ఇంత ఉంటుందా ?

హుజురాబాద్ ఉప ఎన్నిక ఎఫెక్టు ఏపీ మీద ఇంత ఉంటుందా ?

ఉప ఎన్నిక ఫలితంతో ప్రజాభిప్రాయం తేలిపోయింది అనడం అంటే… వార్మప్ లో గెలిచాం కాబట్టి వరల్డు కప్ కూడా గెలుస్తాం అని కోహ్లీ చెప్పినట్టే ! ఎక్కడుంది టీమిండియా వార్మప్ తర్వాత ? ఇదీ అలాగే ఉంటుంది. ఉప ఎన్నికలో చాలా కారణాలు ఉంటాయ్. కోణాలుంటాయ్. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచిన టీడీపీ తర్వాత ఏమైంది… అలాగే ఉంటుంది లెక్క. ఇంతకీ హుజురాబాద్ ఉప ఎన్నిక ఏపీకి ఏం చెప్పింది ? తెలుసుకోవాల్సిన పాయింట్ ఒకటుంది.

హుజురాబాద్ సంగతి చూద్దాం ముందు. బీజేపీ తరపున నిలిచిన ఈటల గెలవడం అంటే బీజేపీ గెలిచినట్టు కాదు. రాజేందర్ మీదున్న సానుభూతి గెలిచినట్టు. కేసీఆర్ ప్రచారం చేయని ఎన్నికలో దళిత బంధు ఢంకా బజాయించి గెలిపిస్తదని టీఆర్ఎస్ అంచనా వేసుకుంది. ఎన్నికలకు రెండు నెలల ముందు పంచిన పసుపు కుంకుమ కలిసి వస్తుందని చంద్రబాబు లెక్క వేసుకున్నట్టే ఇది కూడా ! ఎన్నికల ముందు పెట్టే పథకాలు పని చేయవ్. ఎందుకంటే అప్పటికే ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుంది మైండ్ లో. అంతకు మించిన అజెండా ఏదో ఉంటుంది. అప్పట్లో ఏపీ జనం ఆశ పడ్డారు ఇంకెంతో చేస్తారు, ఇంకెవరో వస్తే అని. ఇక్కడ సానుభూతి చూపించడం అవసరం అని హుజురాబాద్ అనుకుంది. అందుకే పది లక్షలు తీసుకున్నవాళ్లు కూడా ఓటు రాజేందర్ కే వేశారు. పైపెచ్చు కాంగ్రెస్ ఓట్లు నిలువునా చీలాయ్. కౌశిక్ రెడ్డి అక్కడ మొన్నటి వరకూ కాంగ్రెస్ నేత. కేడర్ ను ఫీడ్ చేసిన వాడు. అందుకే 55 వేల ఓట్లు తెచ్చుకున్నాడు 2018లో. అలాంటి కౌశిక్ తోపాటే కేడర్ చాలా వరకూ టీఆర్ఎస్ వైపు వెళ్లింది. అందుకే కారుకు ఆ మాత్రం ఓట్లు పడ్డాయ్. ఇక మరికొన్ని ఓట్లు ఈటలకు పడితే బెటర్ అని కాంగ్రెస్ నాయకత్వమే అనుకుంది. కావాలంటే, పోలింగ్ కి వారం ముందు రేవంత్ ప్రచారంలో మాట్లాడిన మాటలు జాగ్రత్తగా వినండి అర్థం అయిపోతుంది. ముందు కేసీఆర్ అంటూ ఓడిపోతే, బీజేపీ పెద్ద విషయం కాదన్నది బహుశా రేవంత్ లెక్క. ఇదంతా రాజకీయం. ఇంతకీ ఉప ఎన్నికలో పని చేసిన ఈక్వేషన్సు ఏంటి ? ఏపీ మీద ఎఫెక్టు అని ఎందుకు అంటున్నామో చూద్దాం.

తెలంగాణ ఏపీ రాజకీయం భిన్నంగా ఉంటుంది. అందుకే అక్కడ కేసీఆర్ ముందస్తుకి వెళితే గెలిపించారు. ఇక్కడ సమయానికి జరిగిన ఎన్నికల్లో చంద్రబాబును ఓడించారు. పోలిక పెట్టలేం. కాకపోతే రాజకీయాల్లో నెగెటివ్ యాంగిల్ పాపులర్ గా పనిచేస్తుంది. ఎలాగో చూద్దాం. హైదారాబాద్ లాంటి రాజధాని కడతా అంటే… కట్టాలి కట్టాలి అని జనం కట్టుబడి ఉండకపోవచ్చు. అదే, కేసీఆర్ పంచి పెడుతున్నట్టు డబ్బులు పంచుతా అని పథకాలు ప్రకటిస్తే ఒక్క ఛాన్సు ఇచ్చేయొచ్చు, అంటే దీర్ఘకాలిక ప్లానింగ్ కన్నా… స్వల్పకాల భావోద్వేగ ప్రభావం ఎక్కువ. ఈ లెక్కన హుజురాబాద్ ఎన్నిక తర్వాత తెలంగాణలో మారే భావోద్వేగం ఏపీని ప్రభావితం చేయడం ఖాయం. రెండోసారి అధికారంలో ఉన్న కేసీఆర్ పై వ్యతిరేకత ఎంత స్థాయిలో ఉందో ఇప్పుడు క్రమంగా బయటకు వస్తుంది. కేసీఆర్ ను వ్యతిరేకించి బయట పడిన రాజేందర్ గెలిచిన తర్వాత ఇంకొంత మంది రాజేందర్ లా కావాలని అనుకోవచ్చు. ఇదే అదునుగా కాంగ్రెస్ కూడా జోరు పెంచి కేసీఆర్ లెక్క సరిచేసే కార్యక్రమం పెట్టుకోవచ్చు. ఎందుకంటే 2010 తర్వాత నిలదీతలు, అడ్డగింతలతోనే కేసీఆర్ కాంగ్రెస్ ను ఇరుకున పెట్టాడు. ఇప్పుడు అదే టైమ్ మళ్లీ రావొచ్చు. కాంగ్రెస్ లో అసమ్మతిని రెచ్చగొట్టి దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ లోనే ఉండి టీఆర్ఎస్ కోసం పనిచేసే కొందరు పెయిడ్ ఆర్టిస్టుల్ని రంగంలోకి దించినా పెద్దగా ఫలితం ఉండక పోవచ్చు అనేది ఓ అంచనా. ఎందుకంటే ఇక్కడ నిలదీసేది పార్టీలు కాదు. జనం. వాళ్లు ఇక తలుచుకుంటే తలకిందులు అవుతుంది రాజకీయం. గెలిచిన బీజేపీని వదిలి కాంగ్రెస్ గురించి మాట్లాడతారేంటి అంటారేమో, అక్కడ గెలిచింది ఈటల. బీజేపీ కాదు.

ఇలాంటివి జరిగితే ఆంధ్రాలో పరిస్థితి మారుతుందా అనేది ఓ విశ్లేషణ. మీడియా చేతిలో ఉండటం వల్లో, నిన్న మొన్నటి వరకూ బలమైన ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం వల్లో కేసీఆర్ కి పెద్ద సవాల్ ఎదురు కాలేదు. ఇప్పుడు పరిస్థితి మారింది. అందుకే జనం ఆలోచన కూడా మారితే ఆ ప్రభావం అక్కడి నుంచి సరిహద్దు దాటి ఇటు వైపు రావడం పెద్ద విషయం కాదు. పైగా తెలంగాణలో లాగా ఇక్కడ రాజకీయం గుంభనంగా ఏం లేదు. అధికార విపక్షాలు గేట్లు విరగ్గొట్టి మరీ కొట్టుకుంటున్నాయ్. ఇదే అదునుగా ఎటు వైపు ఉండాలో జనం నిర్ణయించుకునేందుకు, తెలంగాణలో పరిణామాలు ప్రేరకంగా పని చేసినా చేయొచ్చు.

 

రాజకీయంతోపాటు పరిపాలనా పరంగా కూడా ఆంధ్రా తెలంగాణలకు ఓ పోలిక ఉంది. అప్పులు. గొప్పలు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి పంచి పెట్టడం రెండు రాష్ట్రాల్లోనూ అలవాటు అయిపోయింది. హైదరాబాద్ లాంటి సిటీ ఆదాయం తెచ్చిపెడుతోంది కాబట్టి తెలంగాణ అప్పులు ప్రచారంలోకి రావడం లేదు అంతగా. ఏపీలో కడుతున్న అమరావతి కూడా బోల్తా పడింది కాబట్టి అప్పులు డప్పులు మోగినట్టు మోగుతున్నాయ్. హుజురాబాద్ కోసమో, రేవంత్ వచ్చాడు కాబట్టి కాంగ్రెస్ లేస్తుందేమో అనే ఆలోచనతోనో కేసీఆర్ పెట్టిన దళిత బంధు పథకం ఓట్లు రాల్చకపోవచ్చు అని ఉప ఎన్నిక తేల్చేసింది. కానీ తెలంగాణ బడ్జెట్ ను పీల్చి పిచ్చి చేయడం మాత్రం ఖాయం. ఇప్పుడు పథకం ఆపితే దళితులు తిరగబడతారు. అలాగని అప్పొసొప్పో చేసి ఇద్దాం అనుకుంటే రాష్ట్రం గుల్ల అవుతుంది. పైపెచ్చు, మిగతా కులాలు అన్నీ కేసీఆర్ కి వ్యతిరేకం అయిపోవడం ఖాయం. అంటే చెప్పొచ్చేది ఏంటంటే, పథకాలు ఓట్లు రాల్చకపోగా ప్రభుత్వాల ఊపిరి తీసే కారకాలు అయ్యే అవకాశాలే ఎక్కువ.

అయినా ఇంత చెప్పాక కూడా, తెలంగాణతో మన రాష్ట్రానికి పోలిక ఏంటి అంటారేమో ! ఏం ఎందుకు లేదు పోలిక ? సంబంధం, బాంధవ్యం, పోలిక ఉండబట్టే కదా, ఇక్కడ పార్టీ వదిలించుకున్న బాణం అక్కడ తిరుగుతోంది. ఇది కూడా అంతే !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments