అతన్ని సీఎంను చేస్తారు అని ప్రచారం చేస్తే వైసీపీకి కలిసి వస్తుందట… అంటూ బొంగరానికి ఉంగరానికి తేడా తెలియని న్యూస్ ఒకటి వచ్చింది. అంతే గగ్గోలు పుట్టింది. వైసీపీని బలపరిచేలా రాశారు ఈ వార్త అని కొందరు, అబ్బేం అలాంటిదేం లేదు అని ఆ కుర్రాడే ఒప్పుకొని, ఏ పదవీ తీసుకోనూ అంటున్నాడు అంటూ ఇంకో అతి విధేయ వర్గం మేకప్ మొదలు పెట్టేసింది. అసలు ఆ కుర్రాడంటే గిట్టకే ఆ న్యూస్ రాశారేమో అని లోతులకు పోయి ఆలోచిస్తున్నవాళ్లూ ఉన్నారు. ఇంతకీ వారసుడు అయితే లీడర్ కాలేడా ? వారసుణ్ని ఒప్పుకోరా ? ఓ వారసుడు సీఎంగా ఉన్న స్టేట్ లో ఇలాంటి చర్చ జరగడం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సా ? ఇంకేదన్నానా ? అసలు ఏపీలో లీడర్ అవ్వాలంటే ఏం ఉండాలి ?
మనసు విప్పేసి మాట్లాడుకుందాం కాసేపు. ఇందులో ఏం ఫిల్టర్లు ఉండాల్సిన పని లేదు. ఏపీ జనం బాగా తెలివిగల వాళ్లు అనుకుంటారు కొంత మంది. అది భ్రమ. అలాగని తెలివి తక్కువ వాళ్లు అనడం లేదు సుమా ! జస్టు సింపుల్ పీపుల్. సీరియస్ విషయాన్ని కూడా యమ కామెడీగా తీసుకునేంత సింపుల్ జనం. రాజధాని ఉన్నా లేకపోయినా ఒకేలా ఉండటం, బ్రాండ్ దొరికినా దొరక్కపోయినా… అందిన కాడికి తాగడం వీళ్ల లక్షణాల్లో కొన్ని. రాజకీయాల్లో కూడా మన ఆంధ్రా మైండ్ సెట్ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు ఆంధ్రా అంటే ఆంధ్రప్రదేశ్ అని. అంటే సీమ కూడా ఇందులో భాగమే. ఆంధ్రా అన్నారు కదా అంటే మేం కాదా అని విశాల భావాలున్న వాళ్లు గొడవకి రావొచ్చు. అంత ప్రయాస అక్కర్లేకుండానే ఈ క్లారిటీ ఇస్తున్నది.
ఇంతకీ రాజకీయాల్లో లీడర్ కావాలంటే ఏం ఉండాలి ఏపీలో ? కొట్లాటలకి వెళ్లాలా ? పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పెడుతున్నట్టు సభలు పెట్టాలా… తిన్నది అరిగే వరకూ నడవాలా… అదే, పాదయాత్ర. అలా ఏం కాదు. చొక్కా నలగక పోయినా, గోల్డెన్ స్పూన్ తో పుట్టి… ఢిల్లీ లెవెల్లో పలుకుబడి ఉండి, అమాంతం లీడర్ కావాలనుకున్నా, గ్లామర్ ఉండి… ఏదో రోజు ఏలేద్దాం అని ఊగిపోతూ మాట్లాడినా కూడా ఓకే. కావాల్సిన కేలిబర్ మాత్రం ఒకే ఒక్కటి.
తెవిలితేటలు ఉండాలి. కొత్త ఆలోచననలు వండాలి. అంటే కుక్ చేయాలి. తయారు చేయాలి. బీహార్ నుంచి వచ్చి ఇచ్చిన సలహాలు తీసుకుంటేనే లీడర్ అవుతారు అని కాదు. వారసత్వం ఒక్కటే సరిపోదు. ఆటు పోట్లను తట్టుకునే పోట్లగిత్త లాంటోడు అనే ఇమేజ్ తెచ్చుకుంటే అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగని దాంతోనే పనులు అయిపోవు. పని చేయగలడు అని నమ్మించాలి. అర చేయి వెడల్పు అంచున్న పట్టుచీర కట్టుకున్న ఆమెను కూడా నీ సమస్యలు నాకు తెలుసు నా ప్రభుత్వం వచ్చి పరిష్కరిస్తుంది అని భరోసా ఇచ్చేయాలి. ఆమె అవును. అవునూ అని సమర్థిస్తుంది. సమస్య ఏంటి అసలు ఉందా లేదా సమస్య అనేది తర్వాత. ముందు ఒక పబ్లిక్ మూడ్ క్రియేట్ చేయగలిగే టెంపో ఉండాలి లీడర్ కావాలనుకునే నాయకుడికి ! దీంతోపాటు మరో క్వాలిఫికేషన్ అవసరం. అదే ఆశ పెట్టడం. ఫలానా చోట ఎకరం ఐదు కోట్లు అయ్యింది, నీ ఎకరం కూడా అంత రేటుకి వెళ్లేట్టు చేస్తా అని నమ్మిస్తే చాలు. ఒక్కొక్కడికీ ఎకరం అయిపోద్ది. ఆ తర్వాత అసలు వేల్యూ పది లక్షలకు పడిపోయినా ఎవరిని అడగాలో తెలియక మెదలకుండా కూర్చుంటాం.
వీటితోపాటు మరీ ముఖ్యంగా, అత్యంత ఇంపార్టెంట్ గా ఉండాల్సిన ఫీచర్… ఢక్కామొక్కీలు తట్టుకునే తత్వం. ఎవరు ఎంతగా దాడి చేసినా, ఎన్ని విమర్శలు వచ్చినా, నీ వల్ల ఏం కాదు, నువ్ ఏమీ చేయలేవు చేయలేవు అంటున్నా వెనక్కి తగ్గకుండా వెళ్లే తత్వం ఉంటే ఆటోమేటిగ్గా ఏదో రోజు నిలబడిపోవచ్చు ఏపీలో ! కావాలాంటే ఇంకోసారి చదువుకోండి. ఇవన్నీ ఏపీలో ప్రూవెన్ నిజాలు.
సెన్సిటివ్ గా కనిపిస్తున్న వారసుడు అయినా… గ్లామర్ తో ఏదైనా చేయొచ్చు అని ఆశ పడుతున్న నటుడు అయినా… ఏమో గుర్రం ఎగరావచ్చు అనుకుంటున్న బిజినెస్ మేన్ అయినా, ఇంకొకరు ఇంకొకరు అయినా గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటుంది. రాజకీయాలంటే క్రికెట్ కాదు. నువ్వు గీత గీసుకొని నిలబడిన చోటకు బౌన్సు అవుతూ బంతి వచ్చి పడదు. పొలిటిక్సు అంటే ఫుట్ బాల్. ఉన్నది ఒకటే బంతి. పోటీ పడేది 22 మంది. వెంటపడి, తన్నుకుంటూ పోవాలంతే ! అంటే అవకాశాన్ని అందుకునేందుకు దూసుకుపోవాలంతే ! వ్యక్తిగతంగా ఉండే మైనస్ లు ఎవడివి వాడికి ఉంటాయ్. ఫుట్ బాల్ లో బంతిని చేతితో తాకకూడదనే రూల్ ఉన్నట్టే ! అయినా సరే కాళ్ల ఒడుపుతో, తల బలంతో, ఒంటి స్టామినాతో గోల్ వేసినోడే ఛాంపియన్ అక్కడ. ఇక్కడ అయితే లీడర్ అంటాం. కాబట్టి క్రికెట్ మైండ్ సెట్ వదిలేస్తే… ఏపీలో ఎవడైనా ఆడొచ్చు ఫుట్ బాల్.