టీడీపీ సపోర్టర్లలో చాలా మందిని చూస్తే టామ్ అండ్ జెర్రీలో టామ్ గుర్తొస్తుంది. జెర్రీ చాలా చిన్నది. బలహీనం. పైగా టామ్ కి ఆహారం అయిపోడానికి పుట్టింది. కానీ టామ్ మాత్రం దాన్ని చూసి భయపడుతూనే ఉంటుంది. పిడికెడంత లేని దానిని అతి భారీగా ఊహించుకొని కాళ్లూ కీళ్లూ విరగ్గొట్టుకుంటూ ఉంటుంది. అనవసరమైన ఫీట్లు చేస్తుంది. తల బొప్పికట్టిన తర్వాత కానీ తన బలం తాను తెలుసుకోదు. తీరా తెలుసుకొని రంగంలోకి దిగగానే జెర్రీ ఎదురొచ్చి మీల్స్ ప్లేట్ ముందుపెడుతుంది. కార్టూన్ చూసేవాళ్లకి ఈ సీన్ కామన్. కానీ ఇదెంత మాత్రం కామెడీ కాదు. వాస్తవం. టీడీపీతోపాటు మద్దతుదారులు కూడా తెలుసుకోవాల్సిన నిజం.
నువ్ అతిభయంకరంగా ఊహిస్తున్న నీ ప్రత్యర్థి నిజానికి అతి భయస్తుడు. బలహీనుడు. తను కూర్చున్న కుర్చీని కూడా ఎంజాయ్ చేయడం మాని, రివేంజ్ కు వాడుకుంటున్నది అందుకే ! నేను ఓ గెస్టుగా మాత్రమే ఈ కుర్చీలోకి వచ్చాను. ఇవాళ కాకపోతే రేపు అయినా గెస్టు నుంచి రెస్టుకి వెళ్లాల్సిందే అని తెలుసు కాబట్టే ఓ టాస్క్ పెట్టుకొని మరీ కొట్టుకుంటూ పోతున్నాడు. ప్రత్యర్థుల్ని క్లియర్ చేసేయాలన్న తాపత్రయం అందుకే. తిట్టినోళ్లని లాఠీలతో కొట్టించేది అందుకే. నన్ను ఓ మాట అంటే గేట్లు పడగొట్టి విధ్వంసం చేయండి అని పురిగొల్పేదీ అందుకే, ప్రత్యర్థిపై పగబట్టి వ్యక్తిగతంగా దాడి చేసి దూషించేదీ అందుకే. ఏదో ఒకటి చేసి వీడిని దెబ్బతీసేయాలన్న కసితో నిరంతరం రగిలిపోతూ తన కంఫర్ట్ ను కూడా తాను మర్చిపోయి, తాను ఎంతటి బలమైన స్థానంలో ఉన్నాడో కూడా నమ్మకుండా నిరంతరం అభద్రతో సావాసం చేస్తున్నాడంటే అంతకు మించిన బలహీనుడు ఎవరు ఉంటారు ? అది అర్థం చేసుకోండి ముందు. బలవంతుడు అయితే మరో ఐదేళ్లకి అది కడతా, మరో పదేళ్లకి ఇది చేస్తా అని ప్రణాళిక పెట్టుకుంటాడు. మన పవర్ అంత వరకూ ఉండదు కాబట్టి మనం అంత దూరం ఆలోచించకూడదు అనుకుంటాడు అంతే !
అధికారం లేని చంద్రబాబు నిజానికి బలవంతుడు కానేకాదు. చంద్రబాబు బలం పని చేయడం. అలా పని చేసే స్థానంలో ఉంటేనే ఆ బలం ఉంటుంది. స్థానబలం. అంటే కుర్చీ లేనప్పుడు బలం లేనట్టే. రెండోది చంద్రబాబుకి కలిసొచ్చేది, తను కూడా నమ్మేదీ సానుభూతిని. జనం తన గురించి ఆలోచించాలని, తనను తలుచుకోవాలని, జనానికి పది కాలాల పాటు గుర్తుండిపోవాలని భావిస్తాడు. అందుకే పని చేస్తాడు. హైటెక్ సిటీలు కట్టేది అందుకే. రాజధాని కట్టాలి అనుకునేది అందుకే. ఇప్పటికిప్పుడు ఓట్లు పడవ్, పోతాయ్ సామీ అని చెప్పినా వినిపించుకోకుండా డెవలప్ మెంట్ పాలిటిక్స్ మాత్రమే చేస్తాడు. ఎందుకంటే భవిష్యత్ తరాలు తనను గుర్తొంచుకొని మాట్లాడుకోవాలి అనే మోజు. చో ఎన్ లై, లీ క్వాన్ యు లాంటి వాళ్లని చూసి చెడిపోయాడు చంద్రబాబు. అలాంటి బాబును సోదిలో కూడా లేకుండా చేయడం చాలా సులభం నిజానికి ! బాబు చేతికి పని లేకుండా చేయడమే. ఆల్రెడీ ఓడి వీక్ అయ్యాడు. పట్టు మని 20 మంది కూడా లేరేమో ఎమ్మెల్యేలు. ఇలాంటి వాణ్ని జస్ట్ నేను చేస్తూ ఉంటాను – నువ్ చూస్తూ ఉండు అనేలా డీల్ చేయాలి. దమ్మునోడు చేయాల్సిన హ్లాండ్లింగ్ అది.
అలా జరుగుతోందా… లేదే ! రాజకీయం బాబు చుట్టూనే తిరుగుతోంది నిరంతరం. బాబు నిజానికి చంద్రుడు కాదు. సూర్యుడు. వెలుగులు పంచుతాడు అని కాదు. భూమి, గ్రహాలూ సూర్యుడు చుట్టూ తిరిగినట్టే ఇక్కడ కూడా బాబు చుట్టే తిరుగుతున్నారు అందుకే. అంటే నిరంతరం వాళ్లు వేసే అడుగులు, తీసే గోతులు, వేసే ఎత్తులు అన్నీ బాబు కోసమే, బాబు చుట్టూనే. లేకపోతే ఓఢి వీకైపోయిన బాబు మీద ఎందుకండి అంత కాన్సన్ ట్రేషన్ ? రాష్ట్రం నుంచి దూరంగా విసిరేసినట్టు ఉంటుంది కుప్పం. పది మందిలో నలుగురు తమిళం మాట్లాడతారు పైగా ! అలాంటి చోట ఏంది మీ ప్రతాపం ? ఇంత రాష్ట్రాన్ని వదిలేసి వరదల్లో కొట్టుకుపోతుంటే పట్టించుకోకుండా, చేతిలో డబ్బులు ఆడక, జీతాలు అందక ఏడుస్తున్న వాళ్లని గాలికొదిలి ఒక్కడి కోసం అంత లోడ్ ఆఫ్ పొలిటిక్స్ చేస్తున్నారంటేనే అర్థం… భయం. చంద్రబాబులో రాజకీయ కొనఊపిరి ఉన్నా మనం ఫేస్ చేయలేమేమో అనే భయం అలాంటి పనులు చేయిస్తుంది. నిజానికి ఇలాంటివన్నీ చేసి ఊపిరి పోశారు. పోస్తున్నారు. బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన బాబు … మళ్లీ సీఎం అయ్యాకే వస్తా అని సవాల్ చేశాడూ అంటేనే అర్థం అది.
అయినా బాబు అంటే ఎందుకు అంత భయం ? వాళ్ల రీజన్స్ వాళ్లకి ఉంటాయ్. చంద్రబాబు ఓ టార్గెట్. ఎప్పుడూ మనకంటే ముందే ఉంటాడు. అందుకోవడానికి అవస్థ పడాల్సింది మనమే. అందుకే అసలు టార్గెట్టే లేకుండా ఉంటే కులాసాగా ఉండొచ్చని. చంద్రబాబు అంటే ఓ రికార్డ్. ఇంతకు ముందు ఇలా చేశాడు, అది కట్టాడు, ఇది తెచ్చాడు అని ఒకటే నస. అందుకే ఎంత దుష్ప్రచారం చేస్తున్నా, హేళనకు దిగుతున్నా ఆగడం లేదు ఈ నస. చంద్రబాబు ఓ సిలబస్. ఏం చేయాలో, ఏం రాయాలో, ఎలా ఉంటాలో ముందే డిసైడ్ చేసి పెట్టి ఉంటాడు. అందుకే బుక్కు చించేయాలనిపిస్తుంది. పంచాంగం పోతే నక్షత్రాలు పోతాయా. బుక్కు చింపితే సిలబస్ పోతుందా మీ పిచ్చి కానీ. చంద్రబాబు ఓ శిఖరం. ఎక్కడికెళ్లినా కనిపిస్తుంది ఆ శిఖరం. దాంతో పోలిస్తే మన ఎత్తు ఎంతో తెలిసిపోయి, చిర్రెత్తుకొస్తుంది సహజంగా. అందుకే ఆ శిఖరాన్ని కొట్టాలని రాళ్లు వేస్తాం. తప్పదు.
ఇంత పొడుగు చెప్పాక ఇక అనొచ్చేది ఏంటంటే, ఎదుటోడికే ఇంత క్లారిటీ ఉన్నప్పుడు పక్కనుండేవాళ్లకి… బాబు తమ పక్కన ఉండాలి అనుకునేవాళ్లకీ ఇంకెంత క్లారిటీ ఉండాలి ? అది లేకపోగా, బాలక్రిష్ణ ఇంకా మాట్లాడలేదు, పురందేశ్వరి రాయలేదు, ఫలానా వాడు బయటకి రాలేదు అంటూ రాగాలెందుకంట ? ఇలా ఈకలు లెక్కపెడుతూ ఖాళీగా ఉండే బదులు పోయి వాళ్ల డైరీలు, డేట్లు మీరే చూడొచ్చుగా ! ఇదిగో ఈ టైమ్ కి చంద్రబాబు మీద సింపథీ చూపించండి, ఇదిగో ఈ టైమ్ కి మా లాంటి కాన్ఫిడెన్సు లేని కబోదుల మీద ఓ కన్నేయండి అని అడుక్కోవచ్చుగా ! బెటర్. అయినా ఇంత చెప్పిన తర్వాత ఓ మాట అనకుండా ఉండలేం. ఇలాంటి వివరం తెలియని టీడీపీ సానుభూతిపరుల కన్నా ఆ జూనియర్ ఎన్టీఆర్ ఎన్నోరెట్లు మేలు. అత్తయ్య, మామయ్య అనకపోయినా ఓ సగటు తెలుగోడిగా అయినా ఖండించాడు. రేపు చంద్రబాబు మళ్లీ గెలిచి వచ్చినప్పుడు కూడా అదే తెలుగోడుగా చప్పట్లు చరుస్తాడు చేతులు వాచిపోయేట్టు. చూస్తుండండి.