ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చేలా విశాఖపట్నంలో ఏర్పాటు కాబోతున్న ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల ప్రాజెక్టులపై అసెంబ్లీ వేదికగా ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టుల వల్ల పర్యావరణానికి ముప్పు పొంచివుందని, విశాఖ ప్రజల తాగునీటిని ఇటు మళ్లిస్తున్నారంటూ వస్తున్న కొన్ని దుష్ప్రచారాలపై ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో డేటాతో సహా క్లియర్ కట్ సమాధానం ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు దొంగ వీడియోలు తెచ్చి ప్రజలను భయపెడుతున్నారని, వాటిని అస్సలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అసలు వైజాగ్‌కు రాబోతున్న ఈ మెగా డేటా సెంటర్ల కథ ఏంటి? వాటికి నీరు, కరెంట్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు? 1995 నాటి కంప్యూటర్ల వివాదాన్ని లోకేష్ ఎందుకు ప్రస్తావించారు?
డేటా సెంటర్ల వల్ల విశాఖపట్నం తాగునీటి భద్రత దెబ్బతింటుందనే అపోహలపై లోకేష్ అసెంబ్లీలో స్పష్టతనిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ నీటిని గ్రావిటీ ద్వారా వచ్చే 18 నెలల్లో విశాఖపట్నానికి తీసుకువస్తున్నామని మంత్రి ప్రకటించారు. వైజాగ్‌లో ఏర్పాటు కాబోయే 6.5 గిగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్లకు కేవలం 3 టీఎంసీల నీరు మాత్రమే అవసరమవుతుందని, ఆ నీటిని కూడా పారిశ్రామిక అవసరాల కోసం ముందే కేటాయించిన పోలవరం జలాల నుంచే ఇస్తామని స్పష్టం చేశారు. అంటే, వైజాగ్ ప్రజలు తాగే నీటి నుంచి ఒక్క చుక్క కూడా పరిశ్రమలకు మళ్లించడం లేదని క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ గత చరిత్రను గుర్తుచేస్తూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. 1995వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగ అభివృద్ధికి తొలిసారి శ్రీకారం చుట్టినప్పుడు.. ప్రభుత్వ ఉద్యోగులు కూడా కంప్యూటర్లు నేర్చుకోవాలని కోరారట. అయితే ఆ సమయంలో పొరపాటున ఒక ఉద్యోగి మరణిస్తే.. అది కంప్యూటర్ రేడియేషన్ వల్లే జరిగిందంటూ అప్పట్లో కొందరు ప్రతిపక్ష నేతలు భారీ ఎత్తున తప్పుడు ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. ఒకవేళ ఆ రోజు ఆ విమర్శలకు భయపడి చంద్రబాబు గారు వెనక్కి తగ్గి ఉంటే.. ఈరోజు హైదరాబాద్ నగరం ఐటీ హబ్‌గా ఈ స్థాయిలో ఉండేది కాదని, ప్రస్తుత డేటా సెంటర్లపై జరుగుతున్న దుష్ప్రచారం కూడా సరిగ్గా అలాంటిదేనని ఎద్దేవా చేశారు.
డేటా సెంటర్ల వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా ప్రభుత్వం కఠిన నిబంధనలు పెట్టిందని లోకేష్ వివరించారు. ఈ డేటా సెంటర్లు తమ అవసరాల కోసం 70 శాతం కేవలం ‘గ్రీన్ పవర్’ మాత్రమే వాడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. అంతేకాదు, సముద్రపు నీటిని మంచినీటిగా మార్చేందుకు ఓ సంస్థ 100 ఎంఎల్డీ సామర్థ్యంతో డీశాలినేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోందని, ఇంటెల్ వంటి సంస్థలు అధునాతన ‘ఎయిర్ కూల్డ్ టెక్నాలజీ’తో నీటి వినియోగాన్ని భారీగా తగ్గిస్తున్నాయని చెప్పారు. ఈ కూలింగ్ ఎకోసిస్టమ్స్ తయారీ విభాగాల ద్వారా రాయలసీమ మరియు కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో దాదాపు 20 వేల మంది యువతకు కొత్తగా ఉద్యోగాలు రాబోతున్నాయని ప్రకటించారు.
విశాఖపట్నం వేదికగా గూగుల్ కంపెనీ అడుగుపెట్టిన తర్వాతే మరికొన్ని అంతర్జాతీయ ఐటీ సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయని, త్వరలోనే అమెరికాకు చెందిన ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం వైజాగ్ కేంద్రంగా ఏఐ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయబోతుందని లోకేష్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసం చేసే దుష్ప్రచారాలను నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దని ఆయన కోరారు.







