ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానమైన కార్పొరేషన్లు ఏవర్గాలకు రిజర్వ్ అవతాయి? కూటమి పార్టీలు ఏ కార్పొరేషన్లో పోటీ చేస్తాయన్న చర్చ జరుగుతా వుంది. ఏపీలో మొత్తం 16 కార్పొరేషన్లున్నాయి. ఇందులో టిడిపి ఎన్ని పోటీ చేస్తుంది? జనసేన, బిజెపిలకు ఎక్కడెక్కడ అవకాశం ఇస్తుందన్న చర్చ జరుగుతా వుంది. రాష్ట్రంలో విశాఖ కార్పొరేషన్ అన్నిటి కంటే పెద్దది దాని తరువాత .. విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, తిరుపతి, నెల్లూరు వుంటాయి.
అమరావతి పరిధిలోని రెండు అత్యంత కీలకమైన నగరాలైన విజయవాడ, గుంటూరు మేయర్ పీఠాలపై సరికొత్త సోషల్ ఇంజనీరింగ్‌కు తెరలేవచ్చని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతా వుంది. ఈ రెండు నగరాల్లో మేయర్ అభ్యర్థుల ఎంపిక కేవలం స్థానిక ఎన్నికల కోణంలోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సమీకరణాలు, కూటమిలోని పార్టీల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే వ్యూహాత్మక అడుగుగా మారబోతోందన్న వూహాగానాలున్నాయి.
ముందుగా బెజవాడ పాలిటిక్స్ విషయానికి వస్తే.. ఇక్కడ మేయర్ పీఠాన్ని ఈసారి తెలుగుదేశం పార్టీ.. కాపు సామాజిక వర్గానికి కేటాయించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయవాడ నగరంలో కాపు ఓటర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో వున్నారు. కొంత కాలంగా కాపు సామాజికవర్గంలో కొంతమంది కూటమి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. కాపులకేదో అన్యాయం జరిగిందన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఈసారి మేయర్ పదవిని కాపు సామాజిక వర్గానికి ఇవ్వడం ద్వారా ఆ విమర్శలను తిప్పికొట్టడంతో పాటు, జనసేన వైపు నుంచి కూడా ఒత్తిడి లేకుండా చూసుకోవచ్చన్న అభిప్రాయంతో టిడిపి వున్నట్టు తెలుస్తోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్థానిక ఎన్నికల్లో సాధారణ ఎన్నికల ఫార్ములా కుదరదంటున్నారు. ఈసారి జనసేన ఎక్కువ మునిసిపాలిటీలు అడిగే అవకాశం వుంది. అలాగే తమకుపదవుల్లో ప్రాధాన్యత దక్కలేదనే భావన జనసేన నేతల్లో కూడా వుంది. ఇప్పుడు కాపు సామాజికవర్గానికి విజయవాడ మేయర్ పదవి కేటాయిస్తే కొంతవరకు విమర్శలు తగ్గే అవకాశం వుంది. విజయవాడ మేయర్ బరిలో కాపులని నిలబెడితే, గుంటూరులో కమ్మ సామాజికవర్గానికి అవకాశం ఇవ్వొచ్చు. గుంటూరులో ఆ సామాజికవర్గం బలంగా వుండటంతో పాటు, ఆ కార్పొరేషన్ పరిధిలో వున్న ఎమ్మెల్యేలు ముగ్గురూ వేర్వేరు కమ్మేతర వర్గాలకు చెందినవాళ్లు కావడం వల్ల ఈసారి కమ్మసామాజికవర్గానికి అవకాశం వుంటుందన్న చర్చ జరుగుతా వుంది.
విజయవాడలో కాపులకు, గుంటూరులో కమ్మ సామాజిక వర్గానికి మేయర్ పీఠాలను పంచడం ద్వారా కూటమి అధినేతలు ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలని చూస్తున్నారు. అమరావతి రాజధాని రీజియన్‌లో ఉన్న ఈ రెండు ప్రధాన సామాజిక వర్గాలను సంతృప్తి పరచడం ద్వారా భవిష్యత్తు రాజకీయాలకు ఒక బలమైన పునాది వేయవచ్చని భావిస్తున్నారు. ఈ మాస్టర్ ప్లాన్ గనుక వర్కవుట్ అయితే, జనసేన-టిడిపి-బిజెపి కూటమికి క్షేత్రస్థాయిలో తిరుగులేని బలం చేకూరడం ఖాయం.అయితే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక, ఈ రెండు కార్పొరేషన్లు జనరల్ విభాగంలో వుంటేనే ఈ అంచనాలు నిజమయ్యే అవకాశం వుంది.







