33 C
Vijayawada
Tuesday, September 1, 2026
Homeఆంధ్రప్రదేశ్చంద్రబాబు భగీరథ యత్నం.. పశ్చిమ ప్రకాశానికి శాపవిముక్తి..!

చంద్రబాబు భగీరథ యత్నం.. పశ్చిమ ప్రకాశానికి శాపవిముక్తి..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వెనుకబడిన ప్రాంతం పశ్చిమ ప్రకాశం. పేరుకు కోస్తాంధ్రలో ఉన్నప్పటికీ అక్కడ వర్షాలు తక్కువ. సరాసరి వర్షపాతం 650 మిమీ. పశ్చిమ సరిహద్దుల్లో నల్లమలకొండలుండటం వల్ల ఇక్కడ వర్షపాతం తక్కువ. సాగునీరు లేని ప్రాంతం. తాగునీటికి కూడా కటకటే. భూగర్భజలం విషం. భూగర్భ జలాల్లో ఫ్లోరిన్ 5 పిపిఎం వుంటుంది. ఆ నీళ్లు తాగితే 30 ఏళ్లకే నడుములు ఒంగిపోతాయి. కాళ్లు వంకర్లు తిరుగుతాయి. పళ్లు గారపట్టి పాడయిపోతాయి. నేను జర్నలిస్టుగా ఒంగోల్లో పనిచేస్తున్నప్పుడు మార్కాపురంలో పనిచేసే లలితానంద్ అనే కొలీగ్ ఆ ప్రాంతం వెనుకబాటు గురించి చెప్తూ, మా వాళ్లు విమానం చూడాలంటే మంచం మీదో, నేల మీదో వెల్లకిలా పడుకోవాలి సార్, ఫ్లోరైడ్ ఎఫెక్ట్ వల్ల మధ్యవయసు వచ్చేసరికి నడుములు పట్టుకుపోతాయి అని చెప్పాడు.

అంత దారుణమైన పరిస్థితులుండేవి. అక్కడికి బదిలీ మీద వెళ్లాలంటే ఉద్యోగులు ఇష్టపడరు. పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. బతుకుతెరవు కోసం వలసలు ఈ ప్రాంతం నుంచే ఎక్కువగా వుంటాయి. హైదరాబాద్ సహా రెండు తెలుగురాష్ట్రాల్లో బేల్దారి పనులు చేసేవాళ్లు ఎక్కువ మంది ఈ ప్రాంతం వాళ్లే. ఒకసారి తెలంగాణ ఉద్యమం ఉధ్రుతంగా వున్న సమయంలో ఒక తెలంగాణ జర్నలిస్టు మిత్రుడు ఈ ప్రాంతంలో న్యూస్ కవరేజ్ కోసం వెళ్లొచ్చి, ఇంత ఘోరమైన వెనకబాటు మా తెలంగాణలో కూడా లేదు. దీని గురించి బాహ్యప్రపంచానికి అంతగా తెలియకపోవడం ఏంటి? రాయలసీమలో నీటికోసం ఉద్యమాలు జరుగుతుంటాయి కదా? మీ జిల్లా నాయకులు ఏం చేస్తున్నారని అడిగాడు. మా నాయకులే కాదు, కోస్తాంధ్రలో నాయకులకు సమస్యల మీద పోరాడే ఓపిక, సమయం వుండదని చెప్పాను. ఇప్పుడు ఆ కరువు నేలని సస్యశ్యామలం చేసేందుకు కృష్ణా జలాలు తరలి రాబోతున్నాయి.

పశ్చిమ ప్రకాశం ప్రజలకు ఇదొక పండగ రోజు. వాళ్ల ప్రార్ధనలు ఫలించిన రోజు. దేవుడు వరమిచ్చిన రోజు. 50 ఏళ్ల ఆరాటం, పోరాటం ఫలించిన రోజు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం 80 వ దశాబ్దం నుంచి ఇక్కడ ఉద్యమాలు జరుగుతుండేవి. చిన్నప్పుడు పేపర్లలో చదువుతుండేవాళ్లం. పెద్దయ్యాక పేపర్లలో రాసేవాళ్లం. మార్కాపురం శాసనసభ్యుడిగా పనిచేసిన పూలసుబ్బయ్య నాయకత్వంలో సిపిఐ వెలుగొండ కోసం సుదీర్ఘ పోరాటం చేసింది. ఈ ప్రాంతానికి క్రిష్ణా జలాలు తరలించాని, నల్లమల కొండల సహజ నిర్మాణాన్ని వాడుకుని రిజర్వాయర్ నిర్మించాలని ప్రజా ఉద్యమాలు చేపట్టారు. ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు డాక్టర్ కె.శ్రీరామక్రిష్ణయ్య ఈ ప్రాజెక్టు కోసం ఒక నివేదిక రూపొందించారు. 1994, 95 సంవత్సరాల్లో డిపిఆర్ రెడీ చేశారు.

1996 మార్చి 5న అప్పటి ఉమ్మడిరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అప్పటి అంచనా వ్యయం 980 కోట్ల రూపాయలు. ఆ తరువాత కూడా ప్రాజెక్టు నిర్మాణం వేగంగా ఏమీ సాగలేదు. 1996 నవంబరులో సెంట్రల్ వాటర్ కమిషన్ ఈప్రాజెక్టు నివేదికని తిప్పి పంపింది. మళ్లీ 2000 సంవత్సరంలో అనుమతులిచ్చింది. చంద్రబాబు హయాంలో ప్రాథమిక డిజైన్లు, సర్వేలు, పర్యావరణ అనుమతుల కోసం 150 కోట్లు ఖర్చు చేశారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక దీనికి మళ్లీ భూమిపూజ చేశారు. అంచనా వ్యయం 1750 కోట్లకుపెంచారు. తొలి డిపిఆర్ లో ఒకటేపెద్ద సొరంగం ప్రతిపాదిస్తే, మార్చినప్లాన్ లో రెండు చిన్న సైజు సొరంగాలు తవ్వాలని నిర్ణయించారు.

రాజశేఖరరెడ్డి జగన్మోహనరెడ్డిలా చంద్రబాబు స్టార్ట్ చేసినప్రాజెక్టుని నేనెందుకు కంటిన్యూ చెయ్యాలని ఆపేసి వుంటే ఇప్పుడిది సాకారం కావడానికి మరింత సమయం పట్టేదేమో. ఆయన హయాంలో 1800 కోట్లు ఖర్చు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య హయాంలో వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు.. ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం పది వేల కోట్లు దాటిపోయింది. రాష్ట్ర విభజన తరువాతే ఈ ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యాయి. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 3 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక టన్నెల్ బోర్ మిషన్లతో సొరంగాలు తవ్వే పనులు సింహభాగం పూర్తి చేశారు. ఒక సొరంగం తవ్వకం పూర్తవగా, మరొకటి పెండింగ్లో వున్నప్పుడు జగన్ అధికారంలోకి వచ్చారు.

అయిదేళ్లలో ఆయన 850 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే, సొరంగాల పనులు పూర్తికాకుండానే, నిర్వాశితులకు పరిహారం ఇవ్వకుండానే, వెలుగొండ పూర్తయిందని, దాన్ని జాతికి అంకితం చేస్తున్నానని ఎన్నికలకు ముందు ఫేక్ డ్రామా నడిపాడు. 14, 19 మధ్య చంద్రబాబు పెట్టిన ఖర్చు 2వేల కోట్లు. మళ్లీ అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో నిర్వాసితుల పునరావాసంతో కలిపి 1500 కోట్లు ఖర్చు పెట్టారు. జగన్ బకాయిలు పెట్టిన 140 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించడంతో పాటు, రెండవ టన్నెల్లో ఇరుక్కుపోయిన టన్నెల్ బోర్ మిషన్ని డిస్మాంటిల్ చేసి బయటకు తీసి నీటి ప్రవాహానికి ఇబ్బందుల్లేకుండా చేశారు. ఎట్టిపరిస్థితుల్లో 26 ఆగస్టు నాటికి నీరివ్వాలని చంద్రబాబు ఆదేశించడంతో ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు రేయింబవళ్లు ఫాలోఅప్ చేశారు.

ఇప్పటికి 7,500 కోట్లు ఖర్చయింది. దాదాపు 50 శాతం నిధులు చంద్రబాబు అధికారంలో వున్నప్పుడే ఖర్చుపెట్టారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ 855 అడుగుల నీటి మట్టానికి చేరుకున్నాక, కొల్లం వాగు ద్వారా నల్లమలసాగర్ కు నీరు సరఫరా అవుతుంది. కొల్లం వాగు దగ్గర రెగ్యులేటర్లు లిఫ్ట్ చేస్తే పంపులు, కరెంటు అవసరం లేకుండా, గ్రావిటీ ద్వారా రెండు సొరంగాల నుంచి నీరు కిందకు దూకుతుంది. ఒక్కొక్క సొరంగం పొడవు 18 కిలోమీటర్లు. నల్లమలసాగర్ రిజర్వాయర్ ని పదకొండు గ్రామాలు ఖాళీ చేయించి కొండల నడుమ నిర్మించారు. సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల దగ్గర కొండల నడుమ గ్యాప్‌ల వద్ద మూడు కాంక్రీట్ ఆనకట్టలు నిర్మించారు .ఇక్కడ నుంచి మూడు కాలవల ద్వారా పొలాలకు నీరందుతుంది.

ప్రస్తుతానికి గొట్టిపడియ కాలవ కింద మాత్రమే డిస్ట్రిబ్యూటరీలు పూర్తయ్యాయి. మిగతా కాలువలకు డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చెయ్యాలంటే 950 కోట్లు కావాలి. తొలిదశలో మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో 10 మండలాలకు నీరందుతుంది. రెండో దశలో దర్శి, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేలు నియోజకవర్గాలకునీరందుతుంది. ఈ ప్రాజెక్టు రెండు దశల నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటే 54 టిఎంసిల నీరు నిల్వ చెయ్యొచ్చు. కొన్ని తరాల నిరీక్షణకుఇప్పుడు తెరపడుతోంది. లక్షల మంది కరువు పీడితుల కలలు ఫలించబోతున్నాయి. కరువు నేలని క్రిష్ణమ్మ తడపబోతోంది. ఫ్లోరైడ్ శాపం నుంచి విముక్తి లభించబోతోంది. ఈ ప్రాంతంలో 20 ఏళ్లనాడు ఎకరం పదివేలున్న భూముల రేట్లు ఇప్పుడుఎకరం పది లక్షలకు పెరిగాయి.

వెలుగొండ కల సాకారమవడమే దీనికి కారణం. ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ రేట్లకు పొలాలు దొరికే ప్రాంతం ఇదే. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం హార్టికల్చర్ మిషన్ కింద చేర్చింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో హార్టికల్చర్ డెవలప్ కాబోతోంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం వూహించని విధంగా డెవలప్ అవుతుందని సీఎంగారు చెప్పారు. వెలుగొండ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా తరపున ఆయనకు ధన్యవాదాలు చెప్పినప్పుడు ఈ మాట చెప్పారు. అలాగే ఈ ప్రాజెక్టు ద్వారా దొనకొండ పారిశ్రామికవాడకు, కనిగిరి నిమ్జ్ లో ఏర్పాటయ్యే పరిశ్రమలకు కూడానీరివ్వచ్చు.హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఆగ్రో ప్రాసెసింగ్ పరిశ్రమలు వస్తాయి.

సమీపంలో రామాయపట్నం పోర్టుతో అనుసంధానం చెయ్యొచ్చు. వలసలకు అడ్డుకట్ట పడుతుంది. ఈ ప్రాంతానికి బంగారు భవిష్యత్తు కల్పించడం కోసం త్యాగం చేసినవాళ్ల గురించి కూడా చెప్పాలి. మొత్తం 11 గ్రామాలు, 7,300 కుటుంబాలు నిర్వాశితులుగా మారారు. ఇళ్లు వాకిళ్లు, భూములు వదిలేసి భావోద్వేగాల నడుమ వేరే ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇది నిజంగా చాలా పెయిన్ ఫుల్ గా వుంటుంది. ఆ బాధ అనుభవించినవాళ్లకే తెలుస్తుంది. ప్రభుత్వం పరిహారం ఇచ్చినా కూడా సొంతూరిని వదిలివెళ్లడం, ఆ ప్రాంతం శాశ్వతంగా జలగర్భంలోకి పోవడం, భవిష్యత్తులో ఇక చూడలేమనే బాధ వాళ్లందరికీ వుంటుంది.

వాళ్ల త్యాగానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు భగీరథ యత్నానికి ధన్యవాదాలు చెప్తున్నాను. 30 ఏళ్లనాడు ఆయనే శంకుస్థాపన చేశారు, ఇప్పుడు ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగానే జరుగుతోంది. అన్నట్టు చంద్రబాబు పశ్చిమ ప్రకాశానికి ఇంకో వరం కూడా ఇచ్చారు. ఎన్నోఏళ్లుగా వున్న మార్కాపురం జిల్లా డిమాండ్ ని కూడా నెరవేర్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెరవేర్చారు, ఆ విధంగా ఈ ప్రాంత ప్రజలకు రెండు వరాలిచ్చినట్టయింది.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments