33 C
Vijayawada
Thursday, September 3, 2026
Homeఆంధ్రప్రదేశ్ఎవరీ మాగుంట శ్రీనివాసులరెడ్డి?

ఎవరీ మాగుంట శ్రీనివాసులరెడ్డి?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెలిగొండ ప్రాజెక్టుని ప్రారంభించిన సందర్భంగా ప్రకాశం జిల్లా నేతలు చాలా ఎమోషన్ కు గురయ్యారు. క్రిష్ణా నీరు తమ గడ్డని తడపబోతుందన్న ఆనందంతో చిందేశారు. క్రిష్ణా నీరు తమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చెయ్యబోతోందని, ప్రజల జీవితాలు మెరుగుపడతాయని చంద్రబాబుకు క్రుతజ్నతలు తెలిపారు. తమ ప్రసంగాల్లో భావోద్వేగానికి గురయ్యారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆవేశంలో జగన్ మీద ఘాటైన విమర్శలు చేశారు. మన కులపోడని ఎగబడి ఎగబడి ఓట్లేశారు. జగన్ అయిదేళ్లు పట్టించుకోకుండా, ఎన్నికల సమయంలో తూతూమంత్రంగా పైలాన్ నిర్మాణం చేసి జాతికి అంకితం అని చెప్పిన మూర్ఖుడు అన్నారు.

మాగుంట శ్రీనివాసులరెడ్డి సాధారణంగా మాట తూలరు. సౌమ్యుడు, అజాత శత్రువనే పేరుంది. ఆయనకు అన్ని పార్టీల్లో మిత్రులుంటారు. నిన్నటి సభలో ఉద్వేగంలో నోరు జారి జగన్ని వాడు అన్నారు. మా నాయకుడ్ని అంత మాట అంటావా నువ్వెంత, నీ బతుకెంత అని వైసిపి నేతలు ఆయన మీద ఘాటైన విమర్శలు చేశారు. సోషల్మీడియాలో కూడా ఆయన్ను దుర్భాషలాడుతూ వైసిపి వాళ్లు పోస్టులు పెట్టారు. అసలు మాగుంట శ్రీనివాసులరెడ్డికి, ఆయన అన్న సుబ్బరామరెడ్డికి రాజకీయ భిక్ష పెట్టిందే వైఎస్ అని ప్రచారం చేస్తున్నారు. ఈ తరం వాళ్లకు మాగుంట కుటుంబం గురించి తెలియదు. వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వచ్చారో కూడా తెలియదు. అసలు ఒంగోలు రాజకీయంతో నెల్లూరుకున్న సంబంధం గురించి కూడా తెలియదు.

నెల్లూరు లోక్ సభ మొదట్లో జనరల్ కేటగిరిలో వుండేది. 1962లో ఎస్సీ రిజర్వుడ్ అయింది. దీంతో నెల్లూరు బడా నేతలకు లోక్ సభకు వెళ్లాలంటే పొరుగున వున్న ఒంగోలే దిక్కయింది. 1977లో నెల్లూరు జిల్లాకు చెందిన వెంకయ్యనాయుడు జనతాపార్టీ తరపున ఒంగోలు నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. 1984లో నెల్లూరు జిల్లాకు చెందిన బెజవాడ పాపిరెడ్డి తెలుగుదేశం తరపున ఒంగోలు నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 89లో మేకపాటి రాజమోహనరెడ్డి కాంగ్రెస్ తరపున ఎన్నికయ్యారు. ఒంగోలు పరిధిలో వున్న ఎమ్మెల్యేలకు ఆయనతో పొసగలేదు. 1991లో లోక్ సభకు వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో ఆయన్ను తప్పించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అప్పటి ముఖ్యమంత్రి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి నెల్లూరు వాస్తవ్వ్యులు, మద్రాసులో వ్యాపారాలున్న బిగ్ షాట్ మాగుంట సుబ్బరామరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించారు. మాగుంట కుటుంబం మద్యం, సినిమా వ్యాపారాల్లో వుండేది.

మెక్ డోవెల్, కింగ్ ఫిషర్ కంపెనీలకు సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్లుగా వున్నారు. కళ్యాణి ఫిలిమ్స్ పేరుతో ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్ వుంది. నెల్లూరులో క్రిష్ణ, కావేరి, కల్యాణి అని మూడు థియేటర్లు కూడా వున్నాయి. ఆ రోజుల్లో సుబ్బరామరెడ్డి నామినేషనే ఒక సంచలనం. అంత భారీగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పటి వరకు ఎన్టీఆర్ అభిమానిగా వున్న సుబ్బరామరెడ్డి, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఒంగోలు ఎంపీగా అనేక సేవా కార్యక్రమాలు,. దాన ధర్మాలు చేశారు. పిసిసి కోశాధికారిగా తిరుపతిలోజరిగిన ఎఐసిసి ప్లీనరీని ఘనంగా నిర్వహించి, ప్రధానమంత్రి పివి నరసింహారావు ప్రశంసలందుకున్నారు. ఒక దశలో ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అన్న ప్రచారం కూడా జరిగింది. 1995 డిసెంబరు 1న సుబ్బరామరెడ్డిని నక్సలైట్లు హత్య చేశారు. ఆ తరువాత 96లో జరిగిన ఎన్నికల్లో ఆయన భార్య పార్వతమ్మ ఎంపీ అయ్యారు.

98లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో పార్వతమ్మ రాజకీయాల నుంచి తప్పుకుని తన మరిది, సుబ్బరామరెడ్డి తమ్ముడు శ్రీనివాసులరెడ్డికి అవకాశం ఇచ్చారు. తొలిసారిగా 98లో శ్రీనివాసులరెడ్డి ఎంపీ అయ్యారు. 99లో టిడిపి అభ్యర్థి కరణం బలరామ్ చేతిలో ఓడిపోయారు.2004, 09 ఎన్నికల్లో వరుసగా ఒంగోలు నుంచి గెలుపొందారు. వీళ్లు నెల్లూరు వాళ్లు అయినప్పటికీ ఒంగోలు లోక్ సభకు మాగుంట కుటుంబానికి ఒక బాండింగ్ ఏర్పడింది. 2014లో తెలుగుదేశంనుంచి ఎంపీగా పోటీ చేసి వైవి సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయారు. చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. 19 ఎన్నికల్లో వైసిపిలో చేరి ఒంగోలు నుంచే ఎంపీ అయ్యారు. జగన్ అధికారంలోకి వచ్చాక మాగుంటకు జగన్ కు సరైన గౌరవం ఇవ్వలేదు.

ఆయన కంపెనీలకి రాష్ట్ర ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన బిల్లులని చెల్లించకుండా బకాయిలు పెట్టారు. ఎన్నికలకు ముందు మాగుంట తెలుగుదేశంలో చేరి మళ్లీ ఎంపీ అయ్యారు. మాగుంట కుటుంబానికి 35 ఏళ్ల రాజకీయ చరిత్ర వుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలున్నాయి. మాగుంట సుబ్బరామరెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన గాడ్ ఫాదర్ నేదురుమల్లి. ఆ వారసత్వ పరంపరలో వాళ్లు తప్ప వేరొకరు ఒంగోలు నుంచి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి, ఆయన భార్య, ఆయన సోదరుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్లిచ్చింది. బ్రీఫ్ గా ఇదీ మాగుంట వాళ్లరాజకీయ చరిత్ర. వైఎస్ రాజశేఖరరెడ్డి చలవ వల్ల మాగుంట సుబ్బరామరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు, జగన్ వల్ల శ్రీనివాసులరెడ్డి ఎంపీ అయ్యారనే ప్రచారాలు నిజం కాదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments