మొన్న సెప్టెంబరు 1వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమం జరిగింది. తెలంగాణలో కూడా కొంతమంది వైఎస్సార్ భక్తులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో తప్పేం లేదు. దివంగత నాయకుడు, నివాళులర్పించాలి. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వైఎస్ విగ్రహానికి నివాళులర్పించి, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బలపడాలని ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులని ఆహ్వానించామని, వాళ్లు తమనే గెంటేస్తుంటే చూస్తూ వూరుకోమని, తనలో అణువణువూ కాంగ్రెస్ రక్తం వుందని, తాను వున్నంతవరకు కాంగ్రెస్ ని ఎవరూ కబ్జా చెయ్యలేరని కూడా స్పష్టం చేశారు.
అణువణువూ కాంగ్రెస్ రక్తం వుందని చెప్తున్న రాజగోపాలరెడ్డి 2022లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీతో పాటు మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఉపఎన్నికలో బిజెపి తరపున పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 2023 ఎన్నికలకు నెల ముందు కాంగ్రెస్ లో చేరి, ఈయన తనది కాంగ్రెస్ రక్తం అని చెప్తున్నారు. ఇతను కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లడానికి చాలా కారణాలు చెప్తారు. ప్రధానంగా వ్యాపార ప్రయోజనాలు, కాంట్రాక్టులు, బిల్లుల కోసం అన్న ఆరోపణలున్నాయి.
అప్పటికే రేవంత్ పిసిసి అధ్యక్షుడు కావడంతో ఆ అసంత్రుప్తి, ఇక కాంగ్రెస్ ఎప్పటికీ గెలవలేదు, కేసీఆర్ని ఎదుర్కొనలేదు.. బిజెపి బెటర్ అని అటు వెళ్లారు. కానీ చివరకు రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ గెలిచే వాతావరణం ఏర్పడ్డంతో మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రి పదవి కోసం తహతహలాడుతున్నారు. ఆల్రెడీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈయన అన్న మంత్రిగా వున్నారు. అయినా తనకు కూడా మంత్రి పదవి కావాలని, ఒకే ఇంట్లో రెండిస్తే తప్పేంటని కూడా అంటున్నారు. అసలు విషయానికొస్తే ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీమాంధ్రుల చెప్పుచేతల్లో ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు.
ఒక వైపు సీమాంధ్ర పాలకుల చేతుల్లో ఈ ప్రభుత్వం వుందనిసొంత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ, మరో వైపు తెలంగాణలో వైఎస్ఆర్ పాలన తీసుకొస్తానని శపథం చేశారు. తాము వైఎస్ శిష్యులమని గర్వంగా చెప్పుకుంటామని ప్రకటించారు. ఒక వైపు ఈ ప్రభుత్వం సీమాంధ్రులు చెప్పినట్టు నడుస్తోందని విమర్శించి, మళ్లీ సీమాంధ్రుడే అయిన వైఎస్ పాలన తెస్తానని, నేను వైఎస్ శిష్యుడ్నే అని ప్రకటించారు. దీని మీద ఎవరైనా బీఆర్ఎస్ నేతలు కానీ, తెలంగాణ మేధావులు కానీ, జర్నలిస్టులు కానీ స్పందిస్తారేమోనని చూశాను కానీ ఎవరూ ఎక్కడా స్పందించలేదు.
వైఎస్సార టిఆర్ఎస్ పార్టీని చీల్చారు, తెలంగాణ వ్యతిరేకి అని అప్పట్లో కేసీఆర్ సహా నేతలంతా గగ్గోలు పెట్టారు. వైఎస్సార్ తెలంగాణ ఇస్తే హైదరాబాద్ వెళ్లాలంటే వీసాలు తీసుకోవాలన్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి వైఎస్సార్ పాలన తెస్తా అంటే నోరు మెదపడం లేదు. అదే రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరిస్తేనే వీళ్లకు కడుపునొప్పి మొదలవుతుంది. వాంతులుచేసుకుంటుంటారు. నాకు చంద్రబాబు రాజకీయ గురువని ఏ వేం నరేందర్ రెడ్డో, లేకపోతే నేను చంద్రబాబు కలిసి పనిచేశామని తుమ్మల నాగేశ్వరరావో అంటే అప్పుడొక్కసారిగా తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ అస్తిత్వం అన్నీ గుర్తుకొస్తాయి. అడ్డగోలు భాషతో రంగంలోకి దిగిపోతారు. పాశం యాదగిరి లాంటోళ్లయితే బూతులే తిడతారు. ద్వంద్వ ప్రమాణాలు, స్వార్థ ప్రయోజనాలు, పదవులు, వ్యాపారాలు, బ్లాక్ మెయిళ్లే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని, వ్యక్తులని బట్టి, సందర్భాన్ని బట్టి స్పందించడమే నయా తెలంగాణవాదం అని రుజువు చేస్తున్నారు.







