మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక “టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్” వేదికగా విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వరుస విజయాలతో విజయవాడ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన.. ఒక ప్రజాప్రతినిధిగా క్షేత్రస్థాయిలో తాను సాధించిన విజయాల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని తోటి నేతలతో పంచుకున్నారు. ప్రస్తుత ధనప్రవాహ రాజకీయాల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
సమావేశంలో గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. తన వద్ద పెద్దగా డబ్బు లేదని, తాను ఏ ఎన్నికల్లోనూ ఓటర్లకు డబ్బులు పంచలేదని బహిరంగంగా ప్రకటించారు. డబ్బుతో రాజకీయం చేయకుండా కేవలం ప్రజలతో ఉన్న అనుబంధమే తనను వరుసగా గెలిపిస్తోందని స్పష్టం చేశారు. “నా వద్దకు ఎవరు వచ్చినా సరే.. మొదట వారిని గౌరవంగా కూర్చోబెట్టి మాట్లాడతాను. ప్రజల సమస్యలను ఓపికగా వినడమే ఒక లీడర్కు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం” అని ఆయన వివరించారు.
ప్రజలు వివిధ పనుల నిమిత్తం తన వద్దకు వచ్చి ఇచ్చే అప్లికేషన్లను తాను ఎప్పుడూ పక్కన పడేయనని గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు, అవసరమైతే ఉన్నతాధికారులు మరియు పైస్థాయి ప్రభుత్వం వరకు వాటిని తీసుకెళ్లి ఫాలోఅప్ చేస్తానని చెప్పారు. ప్రజలతో నిత్యం మమేకమవుతూ, వారి సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడటం వల్లే తనకు ఈ స్థాయి గుర్తింపు లభించిందని, రాబోయే రోజుల్లోనూ ఇదే పంథాలో ముందుకెళ్తానని వెల్లడించారు.







