ముఖ్యమంత్రి పీఠంపై ఉన్నా, దేశ రాజకీయాల్లోనే అత్యంత సీనియర్ నాయకుడైనా.. పార్టీ క్రమశిక్షణ, నిబంధనల ముందు అందరూ సమానమేనని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించారు. హోదా తెచ్చే అహంకారాన్ని పక్కనబెట్టి, ఒక సామాన్య కార్యకర్తలా నిలబడి పార్టీ నియమాలను పాటించిన ఆయన నిగర్వ శైలి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో సోమవారం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభమైన “టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్”కు చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే, లోపలికి వెళ్లే ముందు ఆయన నేరుగా క్యూలైన్ వద్దకు వెళ్లి, ఒక సాధారణ సభ్యుడిలా తన డిజిటల్ ఐడీ కార్డును చూపించారు. పార్టీ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘మై టీడీపీ’ (My TDP) యాప్ ద్వారా తన డిజిటల్ హాజరును స్కాన్ చేయించుకున్నాకే ఆయన లోపలికి ప్రవేశించారు.
తానే స్వయంగా డిజిటల్ నిబంధనలను పాటిస్తూ క్యాడర్‌కు మరియు పార్టీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు ఆదర్శంగా నిలిచారు. సీఎం స్థాయి వ్యక్తి సాధారణ కార్యకర్తలా నిలబడి ఐడీ కార్డ్ స్కాన్ చేయించుకుంటున్న ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పదవుల కంటే పార్టీ క్రమశిక్షణే సుప్రీం అని చాటిచెప్పిన అధినేత నిగర్వ శైలిపై తమ్ముళ్లు మరియు నెటిజన్ల నుండి ప్రశంసల జల్లు కురుస్తోంది.







