37 C
Vijayawada
Friday, April 12, 2024
Homeరాజ నీతిబాలయ్యకే తొలి దెబ్బ పడుతుందా ?

బాలయ్యకే తొలి దెబ్బ పడుతుందా ?

పిచ్ కండిషన్ ఎలా ఉందో ప్రాక్టికల్ గా తెలియక ముందే బ్యాటింగ్ చేసే ఓపెనర్ లాంటోడు బాలక్రిష్ణ. తనంతట తానుగా రంగంలోకి దిగి పని చేసుకుంటూ వెళ్లిపోతాడు. 35 ఏళ్ల నాడు పంచెకట్టి పక్కా పల్లెటూరు కేరెక్టర్లు చేసిన కుర్రహీరోగా అయినా, 20 ఏళ్ల నాడు ఫ్యాక్షన్ కథలతో యాక్షన్ ను మరో మెట్టు ఎక్కించినా… అన్నిట్లోనూ మొదటోడు బాలయ్యే ! ఇప్పుడు కూడా ఇలాంటిదే, కాదు కాదు ఇంతకు మించిన ట్రెండ్ సెట్టర్ కాబోతున్నాడు. టిక్కెట్ రేటు ఇంతే ఉండాలి అంటూ కొత్త ఆర్డర్ వచ్చిన తర్వాత, ఇంపాక్ట్ ఎలా ఉండబోతోందో ఇండస్ట్రీకి తెలియబోతున్నది బాలయ్య సినిమాతోనే ! ఇంతకీ పరిణామాలు ఎలా ఉంటాయ్ ? అఖండ ఏం తేల్చబోతున్నాడు ?

 

విశాఖ మన్యంలో గంజాయి సాగును మించిన మహాపరాధం టాలీవుడ్ ఇంతకు ముందు జన్మలో ఏదో చేసినట్టు ఉంది. లేదంటే ఇండస్ట్రీ పెద్దలం అనుకునేవాళ్లు… రాళ్లతో పూజలు చేశారో ఏమో భలే ఆర్డర్ వాళ్ల నెత్తిన పడింది. మేం చెప్పిన రేటుకి మించి సినిమా టిక్కెట్లు అమ్మకూడదు అంటూ ఆదేశాలు అధికారికంగా వచ్చేశాయ్. వరద ముంచుకొస్తుంటే సకాలంలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం లేదు గానీ, ఎవరూ అడగకపోయినా… సినిమా టిక్కెట్ల రేట్లు మాత్రం తగ్గించి ప్రజల మనసు దోచుకోవడం చూస్తున్నాం ఇప్పుడు. అసలు సినిమా టిక్కెట్ల రేట్లను నిర్ణయించాలనుకోవడం ఎంత కరెక్టో, బేసిక్ ఎకనామిక్ ప్రిన్సిపుల్ తో తేల్చుకుందాం.

 

అఫ్ కోర్స్, ప్రపంచాన్ని శాసించే ఆర్థిక శాస్త్రం, అదేనండీ ఎకనామిక్స్… ఏపీలో మాత్రం ఉక్కిరిబిక్కిరై ఎర్రి మొహం వేసి వెనక్కి నడుస్తోంది. జనం జీవితాల్ని, భవిష్యత్ ను తలకిందులు చేసే యవ్వారాలు వదిలేసి సినిమా టిక్కెట్ రేట్ల రెగ్యులేషన్ లాంటి విప్లవాత్మక నిర్ణయాలు మన దగ్గరే విలయతాండవం చేస్తున్నాయ్. రేట్లు తగ్గిస్తే మంచిదే కదా, ఏం హీరోలు లేక ఛస్తున్నారా అంటూ అభినవ ఆర్థిక వేత్తలు కొద్దరు మద్దతు గుద్దులు గుద్దుతున్నారు రాష్ట్రాన్ని. ఇలాంటోళ్లు తెలుసుకోవాల్సిన కామన్ సెన్స్ ఒకటుంది. అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు అని మూడు రకాలు ఉంటాయ్. బతకడానికి కంపల్సరిగా కావాల్సినవి అవసరాలు. తిండి, బట్ట లాంటి నిత్యావసరాలు ఇందులో ఉంటాయ్. వీటిలో ప్రభుత్వ జోక్యం ఉండి తీరాలి. సౌకర్యాలంటే జీవితాన్ని మరో మెట్టు ఎక్కించేవి. అంటే ఓపిక ఉంటే ఖర్చు పెట్టు. లేదంటే మొదలకుండా ఉండొచ్చు. వీటి మీద మోస్తరు నుంచి ఎక్కువ మొత్తం పన్నులేసి సంపాదించుకునే అవకాశం ప్రభుత్వాలకి ఉంటుంది. ఇక విలాసాలు అంటే బలిసినోడికి బలిసినంత బాపతు. ఖర్చు పెట్టే కెపాసిటీ ఉంటే దిగుతారు. లేదంటే లేదు. ఇలాంటి వాళ్ల ఖర్చులో 30 శాతానికిపైగా ప్రభుత్వానికి రాబడి ఉంటుంది. ఇలాంటి విలాసాలు చేసేవాళ్లు వందలో 5 శాతం కూడా ఉండరు. ఇప్పుడు చెప్పండి. సినిమా అనేది ఏ కేటగిరీ ? సినిమా టిక్కెట్లు కొనలేక రోడ్డున పడిన కుటుంబాలు ఎమైనా చూశారా ఎవరైనా ? సినిమా చూడపోతే జీవితం ఛిన్నాభిన్నమైపోయే అవకాశం ఉందా ? లేనప్పుడు మరి రెగ్యులేషన్ అనేది దీని మీదే ఎందుకు? ఇసుక, ఇతర సరుకులు, పెట్రో రేట్లు, చెత్త పన్నులు ధారాళంగా వదిలేసి సినిమాల మీద పడటమే ఎందుకు ? మన ఎగస్పార్టీ వాళ్లు ఉన్నారనేనా ? ఆలోచించి, సమయం వచ్చినప్పుడు నిర్ణయం చెప్పే అవకాశం జనానికి ఎప్పుడూ ఉంటుంది.

 

ఇక ప్రభావం సంగతి చూద్దాం. రేట్లు ప్రభుత్వం నిర్ణయించాలి అనే ఎత్తుగడలో బ్యూటీ ఏంటో తెలుసా, ప్రతిపక్ష నేత వియ్యంకుడు బాలక్రిష్ణ సినిమాకు దెబ్బ పడుతుంది. ప్రత్యర్థి పార్టీని నడిపే పవన్ కల్యాణ్ మీద ఇంపార్ట్ ఉంటుంది. అదే వరసలో, ప్రభుత్వ నిర్ణయాల్ని ఎల్లవేళలా సమర్థించి, వికేంద్రీకరణకు మద్దతు పలికిన చిరంజీవి సినిమాలు కూడా కాటా దెబ్బ తిని తీరాల్సిందే ! ఎందుకంటే ఆ చట్టం ముందు ఎవరైనా గొట్టంతో సమానం. బల్క్ గా టిక్కెట్లు కొనేసుకొని రిటైల్ గా అమ్ముకునే వ్యాపార దక్షత ఉన్న అధికార పార్టీ నాయకులు ఎవరైనా ఉంటే తప్ప, మిగతా వాళ్లందరికీ… ఈ చట్టం బొక్కో బొక్కస్య బొక్కోభ్యహ ! అంతే. ఈ విషయం క్లియర్ గా తెలుసు కాబట్టి ఇక అభిమానులు, సినిమాల మీద ఆసక్తి ఉన్నవాళ్లు కాస్త ధియేటర్లకి వచ్చేందుకు సిద్ధపడే అవకాశం ఉండొచ్చు. కాస్త రాజకీయం తెలిసి, సినిమాల మీద అభిరుచి ఉంటే సరిపోతుంది… రాకెట్ సైన్స్ ఏమీ చదవక్కర్లేదు. బాలయ్య, పవన్ లాంటి వాళ్లను కొట్టేందుకు టోకుగా ఈ రూల్ వచ్చింది అని అర్థమైతే గేమ్ మారే ఛాన్సు ఉండొచ్చు. సపోజ్ అఖండ సినిమా బావుంది అనే టాక్ వచ్చింది అనుకోండి. బాలయ్య, పవన్ కల్యాణ్ లాంటి ఫిక్సుడు ఫ్యాన్ బేస్ ఉన్న రోజులకి తట్టుకునే ఛాన్సు కొంత వరకూ ఉంటుంది. ఓటీటీల్లో చూడ్డానికి అలవాటు పడినవాళ్లు, టీవీల్లో వస్తుందిలే అని ఆగే వాళ్లు కూడా కదిలే అవకాశం ఉంటుంది. మన హీరో సినిమా చూడాలి, ఆడించాలి అనే స్పృహ కల్గినా కలగొచ్చు. వంద రోజులు, వారాల లెక్కలు పోయి, మొదటి పది రోజుల్లో వసూళ్లు చేయడమే హిట్టుకి కొలమానం, తులాభారం అయిపోయిన ఈ రోజుల్లో… అభిమానులు తలుచుకుంటే కొద్దో గొప్పో మార్పు రావొచ్చు. ఇప్పటికిప్పుడు కాకపోయినా, వసూళ్ల మీద కొత్త రూల్ ప్రభావం అర్థం అయ్యాక అయినా ఇది జరగొచ్చు. అంటే అభిమాన జనంలో కదలిక తెచ్చి, ఏకం చేసే పరిణామం అయినా అవ్వొచ్చేమో ! ఊరకనే ఉన్న చంద్రబాబును మాటలతో కొట్టికొట్టి మళ్లీ జనంలో తిరిగి ట్రెండ్ అయ్యేలా చేసినట్టు… రేట్లు తగ్గించి ఆ ఇద్దరు హీరోల అభిమానుల్లో కసి రగిలించే చట్టం అవుతుందేమో ఇది ! కాలమే చెప్పాలి.

 

ఇక, సినిమా టిక్కెట్ల వ్యవహారం మీద బాలయ్య యుద్ధం ప్రకటించి ఉండాల్సింది అంటున్నారు. అలా జరగలేదు ఎందుకో చూద్దాం. బాలయ్య ముందు నుంచి అల్ప సంతోషి. తన పని తాను చేసుకొని పోయే టైపు. తోటి హీరోలు సినిమా లాభాల్లో వాటాలు తీసుకుంటూ, పారితోషికం పాతిక కోట్లు దాటించుకున్నప్పుడు కూడా నిర్మాతలకి అందుబాటులో, 10కి దిగువనే ఉండిపోయిన హీరో బాలయ్య. తనకి లాభం వచ్చే విషయమే అయినా, తన రేటే పెంచుకోనోడు… తనకి నష్టం వస్తుందని ఎలా మాట్లాడతాడు ! ఇక రాజకీయ కోణంలో చూస్తే, రాష్ట్రం లక్షాతొంబై సమస్యల్లో ఉండగా, ఆయన పార్టీ పోరాటం అంటూ ఉండగా, చంద్రబాబు సవాళ్లు చేస్తూ ఉండగా… తాను సినిమా టిక్కెట్లు, కుర్చీ బాల్కనీ అంటూ మాట్లాడ్డం ఎందుకు అని కూడా అనుకున్నాడేమో ! కాకపోతే ఒక్కటి మాత్రం నిజం. తనను లెక్క చేయని దృష్టితో చూశారనే మా ఎన్నికల్లో ఓ వర్గానికి దెబ్బ పడేలా పావులు కదిపిన బాలయ్య… ఈసారి సినిమా ఇండస్ట్రీని ఏక తాటిపైకి తెచ్చి, సమయం వచ్చినప్పుడు, తమ వంతుగా రావణ దహనం చేయిస్తాడేమో చూడాలి. అదే జరిగితే సినిమా ఇండస్ట్రీకి లాభం జరగడంతోపాటు ఇప్పటి వరకూ ఏపీ విషయంలోగానీ, అమరావతి విషయంలో కానీ ముందుకు రాని టాలీవుడ్ ఉత్సవ విగ్రహాల పాపప్రక్షాళన కొంత వరకు అయినా అవుతుంది. చూద్దాం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments