26 C
Vijayawada
Sunday, July 14, 2024
Homeరాజ నీతిఎన్టీఆర్ కి పవన్ ఎందుకు దండం పెట్టాడు ?

ఎన్టీఆర్ కి పవన్ ఎందుకు దండం పెట్టాడు ?

అవతల గ్రాఫ్ అమాంతం పడిపోతోంది… ఎటు చూసినా అవకాశాలే కనిపిస్తున్నాయ్ అని కాస్త ఎక్కువగానే ఆత్ర పడుతున్న టీడీపీ అసలు పని పక్కన పెట్టేసి, కొసరు లెక్కల్లో పడింది. పార్టీకి రిపేర్లు చేసుకోవడం, జిల్లాకు ఒకరిద్దరు చొప్పున అడ్డంపడే ముసలి ఆబోతుల్ని పక్కన పెట్టడం, అన్నిటికీ మించి సోషల్ ఇంజనీరింగ్ కొత్తగా చేసుకోవడం లాంటివి పెద్దగా నడుస్తున్నట్టు లేవు ఈ మధ్య. ఇలాంటి సమయంలో పవన్ చేసిన కామెంట్ రియల్లీ ఇంట్రెస్టింగ్. టీడీపీ సపోర్టర్లు పెద్గగా గమనించి ఉండరు ఈ విషయం. పవన్ ఏం మాట్లాడుతున్నాడు – ఎందుకు అని గమనించే ఓపిక, తీరిక, అంతకు మించిన అవసరం ఉందని కూడా వాళ్లు అనుకొని ఉండకపోవచ్చు. కానీ వాస్తవాలు వేరు. ఇంతకీ పవన్ ఎందుకు ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చాడు ? మళ్లీ నాల్రోజులకే చంద్రబాబు పక్కన కూర్చోవాల్సి వస్తుంది అని అమరావతి సభకి ఎందుకు దూరంగా ఉన్నాడు ? అసలు లెక్కేంటి ?

అన్ని సమయాల్లోనూ అంచనాలు వాస్తవాలు కావు. పడిపోతున్న గ్రాఫ్ అప్పుడే అమాంతం నేలను తాకదు. దిద్దుబాట్లు ఉంటాయ్. మద్యం రేట్లు తగ్గించినట్టు, ఇంకొన్ని పాలసీలు మార్చబోతున్నట్టు ! ఇంకా రెండున్నర ఏళ్లు సమయం ఉంది. ఈలోగా రాజకీయం ఎన్నో మలుపులు తిరిగే స్కోప్ ఉంది. ఇలాంటి సమయంలో సైన్యాన్ని సిద్ధం చేసుకోవడం – ఒకప్పటి స్నేహితుల్ని మళ్లీ దగ్గరకి తీసుకోవడం లాంటివి టీడీపీకి కంపల్సరీ. దగ్గరకి తీసుకోవడం అంటే ఇప్పటికిప్పుడు పొత్తు అని కాదు. భావజాలం, ఆలోచన ధోరణి. పవన్ మంగళగిరిలో ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. తనకి ఎన్టీఆర్ విధానాలు ఆదర్శం అన్నాడు. ఆయన తరహాలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది జనసేన పాలసీ అంటున్నాడు. ఎన్టీఆర్ హయాంలో జరిగినన్ని మేళ్లు మళ్లీ తర్వాత బడుగులకి ఎప్పుడూ జరగలేదు అనడంలో ఓ హింట్ కనిపిస్తుంది. బీసీలను చేరదీసేందుకు, బీసీ ప్లస్ కాపు ఈక్వేషన్ వర్కవుట్ చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇదొక్కటే కాదు, ఎన్టీఆర్ మాట ఎత్తి – సంప్రదాయ టీడీపీ ఓటర్లను ఆకర్షించవచ్చు. అలాగే చంద్రబాబు మాట ఎత్తకుండా కొంత సస్పెన్స్ కంటిన్యూ చేయాలన్నది ఆలోచనగా కనిపిస్తోంది.

పవన్ ఎప్పుడూ చంద్రబాబుకి దగ్గరగానే ఉన్నాడని వైసీపీ ఆరోపించడం కాదు. వాస్తవం కూడా చాలానే ఉందన్నది సన్నిహితులకి తెలుసు. 2019కి ముందు కొంత దూరం పెరిగిన మాట వాస్తవం. కొన్ని ఫోన్ కాల్స్ రికార్డు చేసి కొందరు పవన్ కి వినిపించడం వల్ల ఈ గ్యాప్ వచ్చిందన్నది కూడా ఓపెన్ సీక్రెట్. తర్వాత మొత్తానికి చంద్రబాబు ప్యాచ్ వర్క్ బాగానే చేశాడు. కానీ ఎన్నికల్లో పోటీ విషయం వచ్చేసరికి వేసిన ఎత్తుగడ వికటించింది. జనసేన సెపరేట్ గా పోటీ చేయడం వల్ల వ్యతిరేక ఓటు చీలుతుందని రెండు పార్టీలూ భావించాయ్. కానీ అవతల వేవ్ వచ్చి… ఇలాంటి లెక్కల్ని తారుమారు చేసేసింది. ఆ తర్వాత పెద్దగా టచ్ లేదు. ఈలోగా బీజేపీ కలిసింది. ఇప్పుడు కలవాలీ అంటే బీజేపీ కూడా ఉండాలేమో తెలియదు. ఇలాంటి సమయంలో పవన్ ఆచితూచి వెళుతున్నట్టు కనిపిస్తోంది. ప్రో టీడీపీ అని చెప్పేందుకు ఎన్టీఆర్ పేరు ప్రస్తావిస్తూనే చంద్రబాబు విషయంలో మాత్రం సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు.

అందుకే తిరుపతిలో అమరావతి రైతులు పెట్టిన సభకు పవన్ హాజరు కాలేదు. సరే, ఆయన పెద్ద నాయకుడు రాడు అనుకుందాం. పోనీ గుంటూరు జిల్లా నాయకుడు, పార్టీలో నంబర్ టు అనుకుంటున్న మనోహర్ కూడా రాలేదు. అంటే చంద్రబాబుతో కలిసిపోతాడు అనే ముద్ర అప్పుడే పడకూడదు అనుకుంటున్నాడా లేదంటే అంతకు మించిన ఆలోచన ఏదైనా ఉన్నదా అనేది ఆలోచించాల్సిన విషయం. పొత్తులు ఎత్తుగడలు ఎన్నికల సమయానికి తీసుకునే నిర్ణయం అయినా ఇప్పుడు పరిస్థితి వేరు. ఏపీలో బీజేపీ కొత్త ప్రయోగం చేయాలి అనుకుంటోంది. ప్రో ఏపీ పాలసీలు ఉంటాయని అమిత్ షా చెబుతున్నట్టు టైమ్ లో జనసేన ఏం చేస్తుంది… ఏం మాట్లాడుతుంది… ఏం అడుగుతుంది అనేది ఇంపార్టెంటే ! అందుకే టీడీపీ అంటే దూరం నుంచి ఇష్టమే దగ్గరగా వచ్చే ఆలోచన ఇప్పటికైతే లేదు అన్నట్టు పవన్ అడుగులు వేస్తున్నారేమో అనిపిస్తోంది.

పవన్ ఇలాంటి ఆలోచనలు చేయొచ్చు గాక. సోషల్ మీడియా పిత్తపరిగెలకు ఇవేం పట్టవ్. వాళ్లు ఎప్పటిలాగే పవన్ మీద ట్రోల్స్ చేయడం, జోకులు వేయడం లాంటివి చేస్తూనే ఉన్నారు. బాలయ్య సినిమా సూపర్ అంటూ పవన్ ప్యాన్స్ ఓ పక్కన మెచ్యురిటీ చూపిస్తే టీడీపీ మంద మేము అని చెప్పుకునే వాళ్లలో మాత్రం అలాంటి సెన్సిబిలిటీ తక్కువ అయిపోతోంది. అటు వైసీపీ మీదకి వెళ్లినట్టే ఇటు జనసేన విషయంలోనూ మాటతూలే ధోరణి ఇఫ్పటికీ కనిపిస్తుంటుంది. బహుశా లోతుగా ఆలోచించలేకపోవడం, ఇంటిలిజెన్షియా సమర్థంగా పనిచేయకపోవడం, పర్సెప్షన్ మేనేజ్మెంట్ కోసం సోషల్ మీడియాను వాడుకునే విషయంలో టీడీపీ ఇప్పటికీ పాత రాతి యుగంలోనే ఉండిపోవడం లాంటి కారణాలు చాలానే ఉండి ఉండొచ్చు. అవతల వాడు ఓడితే మేం గెలుస్తామని ఆలోచించేందుకు అలవాటు పడిన తర్వాత వాస్తవాలు వగరుగా ఉంటాయ్. రియాక్షన్లు పొగరుగా వస్తాయ్. ఈ ఇంపాక్ట్ భవిష్యత్ లో తెలుస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments