29 C
Vijayawada
Monday, October 2, 2023
Homeరాజ నీతిసుజనా వ్యూహంతో ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగిందా ?

సుజనా వ్యూహంతో ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగిందా ?

ఆముదం మొక్క కూడా మొలవని చోట అమాంతం చెట్లు మొలిపిస్తానంటే ఎవరు మాత్రం వద్దంటారు ! చెట్లే కాదు వాటికి కాయలు కూడా కాయిస్తానని, కష్టకాలంలో ఆదుకుంటాయని భరోసా ఇచ్చి, మార్గం చూపగల్గితే మరీ మేలు. ఏపీలో ఆరెస్సెస్ కి ఇలాంటే ఆశలే చిగురించాయ్. ఆ అంచనాలకి కారణం సుజనా చౌదరి. ఆల్రెడీ తిరుపతిలో ఓ సిట్టింగ్ అయ్యింది. వచ్చే నెలలో మరో సిట్టింగ్ విశాఖలో ! ఈలోగా ఇంకా స్పష్టతకి వచ్చి యాక్టివేట్ కావడం ఉంటుందని, అప్పటికే సంఘ్ చల్లగా రంగంలోకి దిగి గ్రౌండ్ వర్క్ చేస్తుందని చర్చ సాగుతోంది. ఏంటి ఏపీలో ఇంత అవకాశం ఉంటుందా ? అంతలోనే ఇంత మార్పు ఎలా వస్తోంది ?

బీజేపీకి పెద్ద రోగం ప్రో-ఏపీ పాలసీ, మైండ్ సెట్, ఫేస్ లేకపోవడం. అంతా కుర్తా పైజామా యవ్వారం. ఎవరెవరో వచ్చి మాట్లాడతారు. అంతా రెటమతం. జీవీఎల్ లాంటి వాళ్లు కనిపించగానే మీటర్ అమాంతం డౌన్ అయిపోతుంది. ఇక డౌన్ కావడానికి ఏం లేక ఇప్పటికైతే అలా పడి ఉంది. ఇలాంటి సందర్భంలో, ప్రోగ్రెస్సివ్ గా అంతకు మించి అగ్రెస్సివ్ గా వెళ్లాలని, అమరావతితోపాటు ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని అమిత్ షా చెప్పడం ఓపెన్ సీక్రెట్. ఇలా చెప్పడం వెనక అసలు రహస్యం ఏంటనేది మాత్రం ఆర్ఎస్ఎస్ అంతర్గత సంభాషణల్లో బయటకు వస్తోంది. ఏపీలో ఎనిమిది నుంచి పది ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. దాని కోసం మనం కన్సిస్టెంట్ గా నిలబడాలి. పని చేయాలి. జనంలోకి వెళ్లాలి. వాళ్లతోనే ఉన్నామన్న భరోసా ఇవ్వాలి. అలా ఇవ్వగలిగితే ఆ పది సీట్లు తెచ్చి చూపించే పూచీ నాదీ – అనే తరహాలో సుజనా ఢిల్లీకి నమ్మకం కల్గించారన్నది టాక్. ఎలా ?

ఏపీలో నిజంగానే బీజేపీ ఆముదం మొక్కంత కూడా లేదు. అలాంటిది అమాంతం పది సీట్ల వరకూ పాకడం అంటే మాటలు కాదు. పైగా ఇంకా ఉన్నది రెండు, రెండున్నరేళ్లే ! కష్టమే నిజానికి. కానీ అసాద్యం మాత్రం కాదు. బీజేపీ నమ్మింది. సంఘ్ కూడా నమ్ముతోంది కాబట్టే కదలిక వచ్చింది కమలంలో. అసలు ఈ పది సీట్ల ఆశలు ఏంటో, అసలు సంగతి ఏంటో వివరంగా చూద్దాం. బీజేపీకి కొత్త కోటలు వెదుక్కోవాల్సిన సమయం వచ్చింది. యూపీ, ఎంపీ లాంటి పాత కోటలకి బీటలు పడుతున్నాయ్ మెల్లగా. పైగా చెప్పుకోదగ్గ మిత్రపక్షాలు కూడా లేవు ఢిల్లీలో. ఇంకో పక్కన ప్రశాంత్ కిషోర్ జాతీయ వ్యూహాలు, టీఎంసీ లాంటి పార్టీల హడావుడి ఉంటోంది. పదేళ్లుగా మోడీ ఉన్నందుకు ప్రభుత్వ వ్యతిరేకత ఉండనే ఉంటుంది. ప్రత్యర్థుల ఆశ – బీజేపీ ఆందోళన ఇదే. ఇలాంటి సమయంలో కొత్త ఫ్రాంటియర్లు కావాలి. అందుకే పంజాబ్ లో కొత్త పార్టీ పుట్టింది. మహారాష్ట్రలో మళ్లీ పాత జోడీ వైపు మొగ్గేందుకు ప్రయత్నాలు కూడా ముమ్మురం అయ్యాయ్. కర్ణాటకలో దేవెగౌడతో మోడీ ఆత్మీయ ఆలింగనం చూశాక చాలా కనుబొమ్మలు పైకి లేచాయ్. ఇలాంటి ఎత్తుగడల్లో రెండు వైపులా పదును ఉంటుంది. బీజేపీ బలం కూడగట్టుకోవడం, ప్రత్యర్థుల బలాన్ని తగ్గించడం కూడా ఉంటుంది. తెలంగాణలో గాలి వాటాన్ని బట్టీ తెరచాప తిప్పేసే రీజినల్ పార్టీ ఎలాగూ ఉంది. ఇక ఏపీ సంగతి. ఇప్పుడున్న పార్టీ ప్రాభవం, ప్రభావం ఐస్ క్రీమ్ లా అమాంతం కరిగిపోతోంది అని బీజేపీకి గట్టి రిపోర్ట్ ఉంది. అందుకే నేరుగా రంగంలోకి దిగాడు అమిత్ షా. ఆయన ఒక్క మాట మాట్లాడ్డం అంటే వంద చేతలతో సమానం. రాజకీయాల వరకూ అంతే సీరియస్ నెస్ ఉంటుంది అమిత్ షాకు.

ఏపీలో టీడీపీ వీక్ అయిపోతే బీజేపీ స్కోప్ రావొచ్చు అనే దూరపుకొండల ఆలోచన ఇంతకు ముందు ఉండేది. కానీ అలాంటిది ఏం జరగలేదు. నిజానికి, అలా జరిగే అవకాశం జగన్ ఇవ్వలేదు టీడీపీకి. ఆ పార్టీని కొట్టీకొట్టీ జనంలో సింపథీ వచ్చేలా చేసేశాడు. పైగా అతి సౌమ్యుడు లాంటి చంద్రబాబు కూడా సవాల్ చేసి సభకు రానూ – అనే వరకూ పోయింది సీన్. అయినా కూడా – బీజేపీకి ఏపీలో అవకాశం కనిపించడానికి కారణం ఉంది. వెరీ క్లియర్. జనం రగులుతున్నారు. వ్యతిరేకత ఉంది. ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరం. అయినా టీడీపీ లీడర్లు ఇంకా జనంలోకి వచ్చే దమ్ముతో ఉన్నట్టు కనపడ్డం లేదు. 175 నియోజక వర్గాల్లో పట్టుమని ఓ 30 మంది నాయకులు కూడా జనంతో, జనంలో లేరు. కారణం భయం. వీపులు పగులుతాయనో, ఏం జరుగుతుందో ఏమో అనో అలజడి. ఇలాంటి భయస్తుల పార్టీకి ధైర్యం రావాలంటే ఓ బలం కావాలి. బలగం ఉండాలి. ఇదిగో సరిగ్గా ఇక్కడే ఏపీలో రాజకీయం అనూహ్యంగా మారబోతోంది. అమిత్ షా దృష్టి పెడుతున్నది, సుజనా ప్లాన్ రాజకీయంగా కలిసి వస్తుందని సంఘ్ మాట్లాడుతున్నదీ ఇందుకే ! ఎప్పుడైనా సరే – పడిపోయే, ఓడిపోయే పార్టీ వైపున సింపథీ ఉండకూడదు. ఇది రాజకీయంలో ప్రాధమిక సూత్రం. అందుకే ప్రోవైపీసీ మైండ్ సెట్ కి బీజేపీ దూరం జరుగుతోంది వేగంగా ! తగవు పెట్టుకొని చంద్రబాబు విడిపోతున్నప్పుడు ఢిల్లీ చెప్పిన మాట కూడా ఇదే. ఇక కర్మ – అనుభవిస్తావ్ అనేశారు అందుకే. అదే సీన్ ఇప్పుడు సరిగ్గా రివర్స్ అవుతోంది. చేతిలో చిల్లిగవ్వ లేకుండా చేసుకొని, దిక్కూదివాణం, దారీతెన్నూ లేని పాలసీలతో పడి కొట్టుకుపోతోంది ఇక్కడో పార్టీ. ఇక రెండో పార్టీకి అన్నీ ఉన్నా ఐదోతనం లేదన్నట్టు ఉంది. రాజకీయాల్లో ఐదోతనం అంతే తెగువ, తెగింపు, దైర్యం. ఇలాంటి సమయంలో బీజేపీ కనుక ప్రో ఏపీ పాలసీతో రంగంలోకి దిగి, రాజధానితో పాటు పోలవరం లాంటి పూర్తవుతాయి అని భరోసా ఇచ్చి, జనం పక్షాన నిలబడితే మార్పు సాధ్యమే అనేది అంచనా. కష్టకాలంలో మనతో ఉన్నోడే మనోడు అనుకుంటుంది ఆంధ్రా ప్రజ. ఎస్. ఆ మాత్రం సూది మొన మోపితే చాలు. ఇక కుట్టుకుంటూ వెళ్లిపోవచ్చు ముందుకు. సుజనా చెప్పిన పాయింట్ కచ్చితంగా ఇదే.

అందుకే పార్లమెంటులో అన్నమయ్య ప్రాజెక్టు ప్రస్తావన అంత పక్కాగా వచ్చింది. ఇక్కడ విపక్షం కూడా నోరెత్తి చెప్పలేని సంగతులు ఢిల్లీలో కేంద్రమంత్రి నోట రావడం అంతే మాటలు కాదు. వి ఆర్ సీరియస్ – అని చెప్పడమే. ఏపీ మీద కన్నేసి ఉంచాం అని చెప్పడానికి ఇదో శాంపిల్. దీంతోపాటు ఆర్ఎస్ఎస్ కీ – వైసీపీ విధానాలకీ ఉన్న సహజ రాజకీయ శత్రుత్వం కూడా బయటకు వస్తుంది ఇలాంటప్పుడే ! మత మార్పిడులు లాంటి విషయాలపై వాస్తవాలతో రంగంలోకి దిగడం, ఏయే విషయాల్లో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారో – చూసి ఇక జనంలోనే ఉండటం లాంటి యాక్షన్ ప్లాన్ ఉంటుంది. అందుకే సంఘ్ ఆల్రెడీ చెబుతోంది ఏపీలో బీజేపీ జెండా కూడా ఎగరబోతోంది అని. రాజకీయంగా రిజల్ట్ వస్తుంది అన్నప్పుడు బీజేపీ సీరియస్ గా దృష్టి పెడుతుంది. సుజనా వ్యూహం తర్వాత పరిస్థితి మారుతున్నది ఇలాగే. మరో ఏడాది ఏడాదిన్నర తర్వాత అప్పటి సందర్భాన్ని బట్టీ పొత్తులు లాంటి ఎత్తుగడలు ఉండొచ్చు. ఇప్పటికిప్పుడు అయినా మేం సిద్ధం అంటూ చంద్రబాబు తెల్ల జెండాలు చూపిస్తున్నారు కానీ ఇంతలోనే ఏం ఉండకపోవచ్చు,

బీజేపీ అంటే కేవలం బీజేపీ మాత్రమే కాదు. జనసేన కూడా. రెండూ కలిసి సగం లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే పరిస్థితి ఉంటే – తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ భుజానమోస్తే రెండంకెల సీట్లు పెద్ద కష్టం కానే కాదు. కాకపోతే కండిషన్స్ అప్లై. చంద్రబాబు గతంలో మాదిరిగా తోక జాడించకుండా ఏం చేయాలి, ఎలాంటి విధానాలు ఉండాలనేది చూసుకోవాలి అని బీజేపీ అనుకోవచ్చు. అప్పటికే బీజేపీ గ్రౌండ్ లో తిరిగి, జనంలో ముద్ర పడితే, ప్రో ఏపీ అప్రోచ్ తో కేంద్రం కూడా నిలకడగా ఉంటే – చేదుగతం కరిగిపోవడం పెద్ద కష్టం కాదు. ఇలాంటి పరిస్థితి వచ్చినా రావొచ్చు, వస్తుందేమో అని తెలుసు కాబట్టే అధికార పార్టీ ఆల్రెడీ కొత్త రాగం అందుకుంది. షెకావత్ అలా మాట్లాడ్డానికి కారణం సుజనా చౌదరే అంటోంది. చెప్పింది వాస్తవం అయినప్పుడు – ఎవరు సమాచారం ఇస్తే మాత్రం ఏంటి ? ఇలాంటప్పుడు యాగీ చేస్తే, పదే పదే సుజనా చౌదరి పేరు చెబితే బహుశా ఆయనకి పబ్లిసిటీ వస్తది. వైసీపీకి ముకుతాడు వేస్తున్నాడు, మొదలైంది అనే సంకేతం జనంలోకి పోతుంది. ఇలాంటి రాళ్లు పడుతున్నకొద్దీ వాటిని పోగేసి గోడకట్టడం మొదలు పెట్టాలి ఇక సుజన.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments