దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నీట్ యూజీ-2026’ పేపర్ లీక్ వ్యవహారంలో నమోదైన పోలీసు కేసులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న వేలాది మంది సాధారణ విద్యార్థులపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం చీఫ్ జస్టీస్ వ్యాఖ్యలతో పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీకి సుప్రీం నుంచే శుభవార్త లభించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా సెప్టెంబర్ 5న ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ముట్టడికి పిలుపునిచ్చిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం సుప్రంకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కేసులను కొట్టేస్తూ విద్యార్థి లోకానికి భారీ ఊరటనిచ్చింది. అయితే, ఈ కేసుల కొట్టివేత వ్యవహారంలో సుప్రీంకోర్టు ఒక కీలకమైన మినహాయింపునిచ్చింది. నిరసనల పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ చొరబడిన, తీవ్రమైన నేరచరిత్ర కలిగిన 2,873 మందిపై మాత్రం చట్టపరమైన కేసులు నమోదు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మరియు ఢిల్లీ పోలీసులకు న్యాయస్థానం పూర్తి అనుమతులు ఇచ్చింది.







